Saturday, 3 February 2018

బిట్‌ కాయిన్‌.. జర భద్రం బ్రదరూ

డిసెంబరులో రూ.10 లక్షలకు పైగా 
ఇప్పుడేమో రూ.5 లక్షల స్థాయికి 
ప్రభావం చూపిన జైట్లీ ప్రకటన!?

క్రిప్టో కరెన్సీల్లో ప్రధానమైన బిట్‌కాయిన్‌ కొనుగోళ్లు, అమ్మకాలే దేశీయంగా అధికంగా జరుగుతున్నాయి. దీని విలువ గత డిసెంబరులో రూ.10 లక్షల (20,000 డాలర్ల వరకు) పైకి చేరగా, తాజాగా రూ.5 లక్షల స్థాయికి పడిపోవడంతో మదుపుదార్లు బెంబేలెత్తుతున్నారు. బిట్‌కాయిన్‌ సహా క్రిప్టోకరెన్సీలన్నీ చట్టవిరుద్ధమేనని, వాటిని వినియోగించకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో అరుణ్‌ జైట్లీ పేర్కొన్న సంగతి విదితమే. మరుసటి రోజే దేశీయంగా బిట్‌కాయిన్‌ విలువ భారీగా క్షీణించి, 8,000 అమెరికన్‌ డాలర్ల (సుమారు రూ.5.12 లక్షలు) కంటే దిగువకు చేరింది. ఈ విలువ ఎక్కడిదాకా పోతుందనేది ఎవరూ చెప్పలేని అంశం.
గిరాకీ, సరఫరా కనుగుణంగానే..
ఆయా దేశాల కరెన్సీలకు అక్కడి ప్రభుత్వాలు, కేంద్రీయ బ్యాంకులు విలువ నిర్థారిస్తుంటాయి. అంతర్జాతీయ విపణికి వచ్చేసరికి ఎగుమతి, దిగుమతి అవసరాల నిమిత్తం వినియోగించే తీరుకనుగుణంగా మారకపు విలువ ఉంటుంది. అయితే క్రిప్టోకరెన్సీలకు కేంద్రీయబ్యాంకుల ధ్రువీకరణ లేనందున, విలువ పూర్తిగా ఆన్‌లైన్‌ మదుపుదార్ల లావాదేవీలకు అనుగుణంగానే ఉంటుంది. వీటిపై సరైన అవగాహన లేకుండానే, ట్రేడింగ్‌ జరపుతున్న వారు ఎక్కువగా నష్టపోతున్నారని చెబుతున్నారు.
ఇన్ని రకాలున్నాయ్‌: బిట్‌కాయిన్‌ (బీటీసీ), రిపుల్‌ (ఎక్స్‌ఆర్‌పీ), ఇథెరిమ్‌, యూఎస్‌డీటీ, డైమండ్‌ (డీఎండీ), యాడ్‌టోకెన్‌ (ఏడీటీ), లుమెన్‌ (ఎక్స్‌ఎల్‌ఎన్‌), అడా (ఏడీఏ), వర్జ్‌ వంటి క్రిప్టోకరెన్సీల ట్రేడింగ్‌ దేశంలో జరుగుతోంది. దేశీయంగా జబ్‌పే (జడ్‌ఈబీపీఏవై), యూనోకాయిన్‌, కాయిన్‌ సెక్యూర్‌, కాయినెక్స్‌ వంటివి క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీల్లో వీటి ట్రేడింగ్‌ నడుస్తోంది. 24 గంటలూ ఈ లావాదేవీలు నడుస్తూనే ఉంటాయి.
విలువ తగ్గేందుకు ఇవీ కారణమా?
దేశీయంగా  ఒక వ్యక్తి క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడి పెట్టాలంటే, మొబైల్‌ నెంబరు, బ్యాంక్‌ ఖాతా, పాన్‌ (శాశ్వత ఖాతా సంఖ్య), ఆధార్‌ ఉండాలి. బిటరెక్స్‌, బినాన్స్‌ వంటి అంతర్జాతీయ ఎక్స్ఛేంజీల్లో అయితే డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్ట్‌ వంటి వివరాలూ అందించాలి.
ఒక బిట్‌కాయిన్‌ విలువ రూ.లక్షల్లో ఉండటంతో, తమ వద్ద ఉన్న నగదు మేరకు, అందులో భాగాన్ని (రూపాయల్లో పైసల్లా) కొనుగోలు చేసుకున్నారు. ‘మీరు వివరాలేమీ ఇవ్వనవసరం లేదు. మీరు పెట్టుబడి పెట్టండి, మీ తరఫున మేము లావాదేవీ నిర్వహించి, లాభాలు పంచుతాం’ అని డబ్బులు వసూలు చేసుకుని, బిచాణా ఎత్తేసి మోసగించిన వారు ఉన్నారు.
క్రిప్టో కరెన్సీలు చట్ట విరుద్ధమని ప్రభుత్వం ప్రకటించినందున, ట్రేడర్లు, మదుపర్లకు వారి పాన్‌ ఆధారంగానే ఐటీ శాఖ నోటీసులు కూడా జారీచేస్తోంది. ఇవన్నీ కూడా మదుపర్లకు ఆందోళన కలిగిస్తున్న అంశాలే.
నీ కేవలం మన మొబైల్‌ వాలెట్‌లో ఉన్నట్లే, డిజిటల్‌ పరంగా మాత్రమే క్రిప్టో కరెన్సీలు ఉంటాయి కనుక, హ్యాకింగ్‌కూ చోటుంది. జపాన్‌లోని ఎంటీగాక్స్‌ ఎక్స్ఛేంజీలో 2014లో 480 మిలియన్‌ డాలర్ల విలువైన  క్రిప్టో కరెన్సీ హ్యాకింగ్‌ ద్వారా చోరీకి గురవ్వగా, ఈ ఏడాది జనవరి 26న జపాన్‌లోనే కాయిన్‌చెక్‌ ఎక్స్ఛేంజీలో 530 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.3,400 కోట్ల) విలువైన క్రిప్టో కరెన్సీ అపహరణకు గురయ్యింది. ఇవి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ కరెన్సీల ప్రకటనలను ఫేస్‌బుక్‌ నిషేధించడం, దక్షిణకొరియా, చైనా, రష్యా వంటి దేశాలు క్రిప్టో కరెన్సీలకు నిబంధనలు రూపొందిస్తుండటంతో వీటి విలువలు క్షీణిస్తున్నాయి.
కొత్తగా వీటిల్లో పెట్టుబడులు పెడదామనుకున్న వారు అప్రమత్తంగా ఉండాలి.

No comments:

Post a Comment