Saturday, 17 February 2018

నా పేరు నరేంద్రమోదీ..! ప్రధాని కాదు ప్రొఫెసర్‌

నా పేరు నరేంద్రమోదీ..!
                                  ప్రధాని కాదు ప్రొఫెసర్‌

ఔరంగాబాద్‌: సాధారణ వ్యక్తుల పేర్లు సెలబ్రిటీ పేర్లతో పోలి ఉంటే వారిని కాస్త ప్రత్యేకంగా చూస్తుంటారు. అదే ఓ సాధారణ వ్యక్తి పేరు మన ప్రధాని నరేంద్ర మోదీ పేరే అయితే..? మరింత ప్రత్యేకంగా ఉంటుంది కదూ. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ నగరానికి చెందిన ఓ వ్యక్తి పేరు ‘నరేంద్ర మోదీ’. ఈ పేరుతో అతను ఎక్కడికి వెళ్లినా పాపులర్‌ అయిపోతున్నాడు. ఎంతగా అంటే ఏదన్నా ఆలయానికి వెళ్తే ఇతని పేరు తెలుసుకుని నిజంగానే ప్రధాని నరేంద్రమోదీ వచ్చారనుకుని పొరబడుతున్నారట.
‘40 ఏళ్ల క్రితం నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు నరేంద్ర చంద్రకాంత్‌ మోదీ. 20 ఏళ్ల క్రితం గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఎన్నికైనప్పటి నుంచి నాకు గుర్తింపు దక్కింది. ఔరంగాబాద్‌లోని బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. ఎక్కడికి వెళ్లినా ప్రజలు నన్ను ‘నమో’ అని పిలుస్తుంటారు. ఎవరైనా నా పేరు అడిగినప్పుడు ‘నరేంద్ర మోదీ’ అని చెబితే అసలు నమ్మేవారు కాదు. ఇలాంటి సందర్భాల్లో కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది కూడా. ఒక్కోసారి నా పేరు నరేంద్రమోదీ అని నిరూపించుకోవడానికి ఐడీ చూపించాల్సి వచ్చేది.’
‘అంతేకాదు నా పేరుతో ఫేస్‌బుక్‌ ఖాతా తెరిస్తే దాన్ని డీయాక్టివేట్‌ చేసేశారు. ఇక ఆధార్‌ కార్డుకి నమోదు చేసుకునేటప్పుడు పెద్ద సమస్యే ఎదురైంది. నా పేరు నరేంద్రమోదీ అని చెబితే అధికారులు నమ్మలేదు. ఆధార్‌ కార్డు రావడానికి చాలా సమయం పట్టింది. పెద్ద నోట్లు రద్దైనప్పుడు నా భార్య కొత్త నోట్ల కోసం బ్యాంక్‌కు వెళ్లింది. అక్కడి సిబ్బంది భర్త పేరు నరేంద్రమోదీ అని ఉండడం చూసి షాకయ్యారు.’
‘ఇక నా కూతురిని స్కూల్‌లో అందరూ ప్రధాని కూతురు వచ్చింది అంటూ ఆటపట్టిస్తుంటారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఔరంగాబాద్‌ వాసి పేరు ప్రధాని పేరు ఒకటే కావడంతో ఇక్కడి ప్రజలు గర్వపడటం మరోఎత్తు’ అని చెప్పుకొచ్చారు మోదీ.

No comments:

Post a Comment