Thursday, 8 February 2018

ఫ్లాట్‌ కొనేముందు.

ఫ్లాట్‌ కొనేముందు....

హైదరాబాద్ లో ని మియాపుర్‌లో రాముకు 600 చదరపు గజాల స్థలం ఉంది. ఈ స్థలంలో కృష్ణ అనే నిర్మాణదారు (బిల్డర్‌) 12 ఫ్లాట్లతో ఓ గృహ సముదాయాన్ని నిర్మించేందుకు రాముతో సంయుక్త అభివృద్ధి ఒప్పందం (జేడీఏ)  కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం 12 ఫ్లాట్లలో ఏడింటిని స్థల యజమాని రాముకు కృష్ణ అప్పగిస్తారు. మిగిలిన 5 ఫ్లాట్లు కృష్ణ సొంతం అవుతాయి. ఆ తర్వాత వీళ్లు ఈ ఫ్లాట్లను వేరే వాళ్లకు విక్రయించవచ్చు. ఇక్కడి వరకు సరే. మరి ఈ తరహా లావాదేవీలకు వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వర్తిస్తుందా? లేదా? ఒకవేళ వర్తిస్తే ఎవరు ఎవరికి చెల్లించాల్సి ఉంటుంది? వీళ్ళిద్దరి దగ్గరి నుంచి ఫ్లాట్లు కొనుగోలు చేసే కొనుగోలుదార్లపై పడే పన్ను భారమెంత..? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ముందుగా జేడీఏ అంటే ఏమిటో  తెలిసుండాలి. 
స్థిరాస్తి ప్రాజెక్టుల క్రయవిక్రయాల స్వరూపం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో.. నిర్మాణదారే సొంత స్థలంలో నిర్మాణం చేసి విక్రయించడం. రెండోది.. వేరే వ్యక్తికి చెందిన స్థలంలో నిర్మాణం చేసి అమ్మడం. ప్రస్తుతం మనం రెండో సందర్భంపైనే చర్చిద్దాం. ఎందుకంటే జేడీఏను కుదుర్చుకునేది ఈ సందర్భంలోనే. వాస్తవానికి జేడీఏ కింద జరిగే లావాదేవీలకు జీఎస్‌టీ వర్తింపుపై అటు నిర్మాణదార్లు, స్థల యజమానులకే కాదు.. కొనుగోలుదార్లు, సాధారణ ప్రజానికంలోనూ ఇప్పటికీ అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ సందేహాల నివృత్తికి ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.
మూడు కోణాల్లో..
జేడీఏ కింద జరిగే లావాదేవీలకు జీఎస్‌టీ వర్తింపును మూడు రకాల లావాదేవీల ద్వారా అర్ధం చేసుకోవచ్చు. మొదటిది బిల్డర్ల ఫ్లాట్ల అమ్మకం. రెండోది.. బిల్డర్‌, స్థల యజమాని మధ్య లావాదేవీ. మూడోది.. స్థల యజమాని ఫ్లాట్ల అమ్మకం. అయితే వీటికి సంబంధించి ఈ కింద వివరించే అంశాలకు జులై 1వ తేదీ తర్వాత జేడీఏను కుదుర్చుకున్నట్లుగా అనుకుందాం. అలాగే పూర్తి ప్రాజెక్టుకు జీఎస్‌టీ వర్తిస్తుందని భావిద్దాం.
నిర్మాణదార్ల ఫ్లాట్లు అమ్మకం
నిర్మాణదార్లు ఫ్లాట్లు నిర్మించి విక్రయించడం వ్యాపార లావాదేవీ కిందకు వస్తుంది. ‘గృహ సముదాయాల నిర్మాణ’ కార్యకలాపాలు సహా ఈ తరహా సేవలకు రెండు రకాల పన్ను రేట్లు వర్తిస్తాయి. అవి.. 18%, 12%. అవిభాజ్య స్థల వాటా (అన్‌డివైడెడ్‌ షేర్‌ ఆఫ్‌ ల్యాండ్‌) విలువను కలిపితే  12% జీఎస్‌టీ వర్తిస్తుంది.  అదే స్థలం విలువను కలపకుంటే పన్ను రేటు 18%.
పన్ను వర్తింపు..
‘కంప్లీషన్‌ సర్టిఫికేట్‌’ లేదా ’బిఫోర్‌ ఫస్ట్‌ ఆక్యుపెన్సీ’ పొందడానికంటే ముందే ఫ్లాట్ల విక్రయానికి బిల్డర్‌ అంగీకరించడం, ఫ్లాట్ల విక్రయానికి ముందస్తు డబ్బులు (అడ్వాన్స్‌) తీసుకున్న సందర్భంలో అమ్మకం విలువలో స్థల విలువను కలపడం లేదా కలపకపోవడం ఆధారంగా 18% లేదా 12% పన్ను రేటు చెల్లించాల్సి ఉంటుంది.
పన్ను మినహాయింపు
‘కంప్లీషన్‌ సర్టిఫికేట్‌’ లేదా ’బిఫోర్‌ ఫస్ట్‌ ఆక్యుపెన్సీ’ పొందిన తర్వాతే ఫ్లాట్ల విక్రయానికి నిర్మాణదారు అంగీకరించడం, ఫ్లాట్ల విక్రయానికి కొనుగోలుదార్ల నుంచి ముందస్తు డబ్బులు (అడ్వాన్స్‌) తీసుకోని సందర్భంలో ఎలాంటి జీఎస్‌టీ వర్తించదు. నిర్మాణదారు స్థిరాస్తిని విక్రయిస్తున్న కారణంతో ఇక్కడ పన్ను మినహాయింపు లభిస్తుంది.
బిల్డర్‌, స్థల యజమాని మధ్య లావాదేవీ
ఫ్లాటుతో కలిసి స్థల బదలాయింపు అనేది సరఫరా నిర్వచనం కిందకు వస్తుంది. స్థల యజమానికి బిల్డర్లు నిర్మాణ సేవలు అందించడం జీఎస్‌టీ నిబంధనల ప్రకారం పన్ను పరిధిలోకి వస్తుంది. ఇలాంటప్పుడు నిర్మాణం పూర్తి లేదా కంప్లిషన్‌ సర్టిఫికేట్‌ను పొందిన తర్వాత స్థల యజమానికి బిల్డర్‌ ఫ్లాట్లను అప్పగించినా కూడా ప్రాజెక్టు స్థితితో సంబంధం లేకుండా జీఎస్‌టీ వర్తిస్తుంది. 
ఎంతెంత ఉండాలి? 
బిల్డర్లు, స్థల యజమానుల మధ్య జరిగే లావాదేవీలకు జీఎస్‌టీ వర్తింపుపై వివిధ వర్గాల్లో భిన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. స్థల యజమాని దగ్గర నుంచి ఫ్లాట్లను కొనుగోలు చేసే కొనుగోలుదార్లపై విధించే పన్నును పరిగణనలోకి తీసుకుంటే జీఎస్‌టీ 12% ఉండాలన్నది నా అభిప్రాయం. అదే స్థల యజమానికి కేటాయించిన ఫ్లాట్లకు అయిన నిర్మాణ వ్యయంపై వసూలు చేయదలిస్తే 18% జీఎస్‌టీ విధించాలి. 
ఎప్పుడు వసూలు చేయాలి.. 
జేడీఏలో విధించుకున్న షరతులకు అనుగుణంగా స్థల యజమాని, నిర్మాణదారు మధ్య జరిగే లావాదేవీలకు పన్నులు వర్తిస్తాయి. ఒకవేళ జీఎస్‌టీ అంశం జేడీఏలో లేకుంటే, స్థల యజమానికి నిర్మాణదారు ఫ్లాట్లను స్వాధీనం చేసిన సమయంలో ఆ స్థల యజమాని నుంచి నిర్మాణదారు పన్నులు వసూలు చేయాలి.
స్థల యజమాని ఫ్లాట్ల విక్రయం
ఫ్లాట్ల విక్రయం విషయంలో బిల్డర్లతో పోలిస్తే స్థల యజమానిది భిన్న పరిస్థితి. స్థిరాస్తిని అమ్మాలన్నదే స్థల యజమాని ముఖ్య ఉద్దేశం. స్థల యజమాని ఫ్లాట్లను విక్రయించడం వ్యాపార లావాదేవీకి కిందకు రాదు. ‘సరఫరా’ నిర్వచనమూ వర్తించదు. అంతేకాకుండా స్థల యజమాని ఎలాంటి నిర్మాణ సేవలను అందించడు. పై కారణాల రీత్యా స్థల యజమానులు ఫ్లాట్లు విక్రయిస్తే దానికి జీఎస్‌టీ ఉండదు. నిర్మాణ దశలో ఉన్నప్పుడు అమ్మినా కూడా జీఎస్‌టీ వర్తించదు. స్థల యజమానులు విక్రయించే ఫ్లాట్లకు అంతకంటే ముందే బిల్డర్లు, ఆ స్థల యజమాని మధ్య పన్ను లావాదేవీ జరుగుతుంది. అందువల్ల స్థల యజమానులు విక్రయించినప్పుడు మళ్లీ పన్ను విధిస్తే పన్ను మీద పన్నుకు దారి తీస్తుంది. 
పైవన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే సర్టిఫికెట్‌ ఆఫ్‌ కంప్లిషన్‌ లేదా బిఫోర్‌ ద ఫస్ట్‌ ఆక్యుపెన్సీని పొందడానికి కంటే ముందు బిల్డర్లు అమ్మిన మొత్తం ఫ్లాట్ల ద్వారా ప్రభుత్వానికి పన్ను ఆదాయం వస్తుంది. అలాగే బిల్డర్లు స్థల యజమానికి స్వాధీనం చేసే ఫ్లాట్ల ద్వారా కూడా పన్ను ఆదాయం లభిస్తుంది.

No comments:

Post a Comment