డ్రాగన్ పడన నీడలో యామీన్ (మాల్దీవులు)
ఇంటర్నెట్ న్యూస్ : హిందూ మహాసముద్రంలో నాలుగులక్షల జనాభాతో ప్రకృతి అందాలతో ఆకట్టుకొనే మాల్దీవులు ఇప్పుడు కొంతకాలంగా రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. ఇది భారత్, చైనా దేశాల మధ్య ప్రాంతీయ ఆధిపత్యానికి తెరలేపనుంది.మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ తన అధికారానికి అడ్డు వస్తారనుకున్నవారిని జైలుపాలు చేశాడు. అయితే సోమవారం నాడు అక్కడి సుప్రీం కోర్టు వీరందరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ విడుదల చేయాలని ఆదేశించింది. కానీ మాల్దీవులు అధ్యక్షుడు మాత్రం ఏకంగా తీర్పు వెలువరించిన సుప్రీం న్యాయమూర్తులనే అరెస్ట్ చేయించాడు. దాంతో బుధవారం ఇతర న్యాయమూర్తులు ఈ తీర్పును కొట్టివేశారని అక్కడి మీడియా వెల్లడించింది. దీనిపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ దేశ సుప్రీం తీర్పును ప్రతిఒక్కరూ గౌరవించాలని భారత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీనిపై మంగళవారం చైనా కూడా స్పందించింది. మాల్దీవులు జనాభా దాదాపు నాలుగు లక్షలు. ఆ దేశానికి సమస్యను సొంతంగా పరిష్కరించుకొనే సామర్థ్యం ఉందని వెల్లడించింది. చైనా గత సంవత్సరం మాల్దీవులతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది.
చైనా ఎప్పటినుంచో హిందూ మహాసముద్రంలో తన ఆధిపత్యాన్ని పెంచుకొని భారత్‌ను ఒంటరిని చేయాలని ముందుకు కదులుతుంది. అందులో భాగంగానే శ్రీలంక,పాకిస్థాన్, జిబౌటి(మొదటి విదేశీ సైనిక స్థావరం ఉన్న మొట్టమొదటి ఆఫ్రికా దేశం) వంటి దేశాల్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది. ఇండియా కూడా హిందూ మహాసముద్రంలో తన ఆధిపత్యానికి గండిపడకుండా రాజీలేని ధోరణితో వ్యవహరిస్తుంది. ఈ విషయంలో భారత్‌కు జపాన్, అమెరికా సహకారం కూడా ఉంది.
‘ హిందూ మహాసముద్రం ప్రాంతంలో భారత్ తన ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవాలనుకుంటుంది. దానికి మాల్దీవుల సహకారం చాలా అవసరం’ అని దిల్లీకి చెందిన కార్నెగీ ఇండియాలో పనిచేస్తున్న కాన్‌స్టాంటినో గ్జేవియర్ వ్యాఖ్యానించారు. ‘యమీన్ పాశ్చాత్య దేశాలనుంచి ఒత్తిడులను కూడా లెక్కచేయకుండా చైనాతో ఎక్కువ చెలిమి చేస్తున్నాడు. భౌగోళికంగా అతి దగ్గరగా ఉన్న భారత్‌తో తన సంబంధాలను కొద్దికొద్దిగా తగ్గించుకుంటున్నాడు’ అని అన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా మాల్దీవులు రాజకీయంగా అస్థిరత్వాన్ని ఎదుర్కొంటుంది. యామీన్ 2013లో అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి చైనా, సౌదీ అరేబియాల నుంచే ఎక్కువగా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. దీన్ని విమర్శించిన రాజకీయ నాయకులను జైలు పాలు చేశాడు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కొట్టివేయకుముందు జైల్లో ఉన్న మాజీ అధ్యక్షుడు, ప్రతిపక్షనాయకుడు మహ్మద్ నషీద్ ‘ కోర్టు ఇచ్చిన తీర్పును, న్యాయమూర్తులను పరిరక్షించాలంటే భారత్ తన భద్రతా బలగాలను పంపించాలి’ అని కోరారు. అక్కడి ప్రభుత్వం చేస్తున్న చర్యను అమెరికా ఖండించింది. ‘ యామీన్ గత కొంతకాలంగా తన రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయనకు చైనా ఆర్థికంగా అండదండలు అందిస్తోంది. భారత్ ఎప్పుడూ ప్రజాస్వామ్య శక్తుల వెనకాలే ఉంటుంది. అయితే మాల్దీవులు.. చైనా చేతుల్లో చిక్కుకుండా భారత్ ప్రయత్నించాల్సిన అవసరం ఉంది’ అని బ్రూకింగ్స్ ఇండియా ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ఆర్థికంగా చైనా తనకెంతో అవసరం అని మాల్దీవులు భావిస్తుంది. 2017లో చైనా మూడులక్షల మంది పర్యాకులను మాల్దీవులకు పంపించింది. అంతమంది ఇంకే దేశం నుంచి రాలేదు. అలాగే అక్కడి మౌలికసదుపాయాల కల్పనుకు చైనా పెట్టుబడులు పెడుతోంది. పేరు బయటకు రాని ఒక చైనా సంస్థ మాలెకు దగ్గర్లోని ఒక దీవిని రిసార్టుల నిర్మాణం కోసం 50 సంవత్సరాలకు లీజుకు తీసుకుంది. దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ దీవులు నిర్మించినట్లుగానే హిందూ మహాసముద్రంలో కూడా చేయనుందన్న ఊహాగానాలు పెరుగుతున్నాయి. ‘ఏదైనా అద్భుతం జరిగితే తప్ప యామీన్ చైనా నుంచి దూరం జరగడు. ఈ విషయంలో భారత్ అంతగా అవకాశం లేదు’ అని ఆస్ట్రేలియా జాతీయ విశ్వవిద్యాలయంకు చెందిన డేవిడ్ వ్యాఖ్యానించారు.
No comments:
Post a Comment