Thursday, 8 February 2018

క్రిప్టో కుబేరులొచ్చారు తొలిసారిగా ప్రచురించిన ఫోర్బ్స్‌ క్రిస్‌ లార్సెన్‌కు అగ్రస్థానం

క్రిప్టో కుబేరులొచ్చారు 
తొలిసారిగా ప్రచురించిన ఫోర్బ్స్‌ 
క్రిస్‌ లార్సెన్‌కు అగ్రస్థానం

న్యూయార్క్‌: ఫోర్బ్స్‌ తొలిసారిగా క్రిప్టోకరెన్సీ కుబేరుల జాబితాను విడుదల చేసింది. అంటే కేవలం క్రిప్టోకరెన్సీ(ఊహాజనిత కరెన్సీ) ఆధారంగా అత్యంత ధనవంతులైన వారికి ఇందులో చోటు ఉంటుందన్నమాట. జాబితాలో 7.5-8 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.48750-52,000 కోట్లు)తో రిపుల్‌ సహ వ్యవస్థాపకుడు క్రిస్‌ లార్సెన్‌ అగ్రస్థానంలో నిలిచారు. బ్లాక్‌చైన్‌ సాంకేతిక ఆధారంగా సీక్రెట్‌ ఆల్గారిథమ్స్‌ను ఉపయోగించి ‘తవ్వితీసేవే’ ఈ క్రిప్టోకరెన్సీలు. వీటిపై ఎవరికీ నియంత్రణ ఉండదు. ఇటీవలి కాలంలో భారీ లాభాలతో ఇవి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఫోర్బ్స్‌ ప్రకారం..  
చాలా ఎక్కువగా ఉపయోగించే బిట్‌కాయిన్‌, ఈథెరీమ్‌, ఎక్స్‌ఆర్‌పీల సగటు ధర గతేడాదిలో ఏకంగా 14,409 శాతం పెరిగింది. 
ప్రస్తుతం 1500 క్రిప్టోకరెన్సీలు ఉండగా.. వాటి విలువ 550 బిలియన్‌ డాలర్లు(రూ.35.75 లక్షల కోట్లు)గా ఉంది. 2017 ప్రారంభంతో పోలిస్తే ఈ విలువ 31 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. 
జోసెప్‌ లుబిన్‌(1-5 బి. డాలర్లు), చాంగెపెంగ్‌ జో(1.1-2 బిలియన్‌ డాలర్లు), కామరాన్‌ అండ టైలర్‌ వింక్‌లీవాస్‌(900 మి. డాలర్లు-1.1 బి. డాలర్లు)లు జాబితాలో చోటు దక్కించుకున్నారు. 
ఇంకా బ్రియాన్‌ ఆమ్‌స్ట్రాంగ్‌, మాథ్యూ రోజక్‌, ఆంటోనీ డి లారియో, బ్రోక్‌ పియర్స్‌, మైఖేల్‌ నోవోగ్రాజ్‌, బ్రెండన్‌ బ్లమర్‌, డాన్‌ లారిమర్‌, వాలరీ వావిలోవ్‌, ఛార్లెస్‌ హాస్కిన్సన్‌, బ్రాడ్‌ గార్లింగ్‌హౌస్‌, బారీ సిల్బర్ట్‌, విటాలిక్‌ బ్యూటరిన్‌, టిమ్‌ డ్రాపర్‌, సాంగ్‌ చి-హ్యుంగ్‌ తదితరులూ ఉన్నారు. 
క్రిప్టోకరెన్సీ కుబేరుల సగటు వయసు 42 కావడం గమనార్హం. అదే ఫోర్బ్స్‌ 400 అమెరికా కుబేరుల సగటు వయసు 67గా ఉంది. 
భారత్‌లో క్రిప్టోకరెన్సీ చట్టబద్ధం కాదని బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment