గువహటి: యాప్ ఆధారిత ట్యాక్సీ సేవల సంస్థ ఓలా భారత్‌లో తొలిసారి పడవ సర్వీసును ప్రారంభించింది. అసోం రాజధాని గువహటి నగరంలో ఈ ఓలా పడవ ప్రారంభమైంది. నగరంలో ఫ్యాన్సీ బజార్ మార్కెట్ ప్రాంతంలోని లచిత్ ఘాట్ నుంచి గువహటి అంతర్జాతీయ విమానాశ్రయానికి ఓలా ‘రివర్ ట్యాక్సీ’ సర్వీసును ప్రారంభించింది. ఈ మార్గంలో విమానాశ్రయానికి పడవలో పదిహేను నిమిషాల సమయం పడుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి సోనోవాల్ పడవ సర్వీసును ప్రారంభించి అందులో ప్రయాణించారు. మెషీన్‌తో నడిచే బోట్లను ఇందుకోసం ఉపయోగిస్తున్నారు. గంటకు 30కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. వర్షాకాలంలో ఓలా ఈ పడవ సేవలను నిలిపేస్తుంది. అలాగే మచ్‌కోవా ఘాట్ నుంచి గువహటి ఉత్తర ప్రాంతానికి ఓలా హైస్పీడ్ బోట్లను నడపనుంది. దీంతో ప్రయాణ సమయం బాగా తగ్గనుంది. స్టీమ్ బోట్లలో 45నిమిషాలు పడుతుండగా హైస్పీడ్ బోట్‌లో పది నిమిషాలు పడుతుంది. ఇటీవల అసోం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో రాష్ట్ర రవాణా మంత్రి చంద్ర మోహన్ పటోవారీ, ఓలా ఆపరేషనల్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ ఘాడ్గే రివర్ ట్యాక్సీ సేవల ఒప్పందంపై సంతకం చేశారు. అసోంలో 2014లో ఓలా ట్యాక్సీ సేవలను ప్రారంభించింది.
No comments:
Post a Comment