మూడో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్
మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ మూడో వివాహం చేసుకున్నారు. మత బోధనలు చేసే బుష్రా మనేకాను ఆయన పెళ్లి చేసుకున్నట్లు ధ్రువీకరించారు. గత కొంతకాలంగా ఇమ్రాన్‌ఖాన్, బుష్రా మనేకాల పెళ్లి విషయంపై వార్తలు వస్తున్నాయి. లాహోర్‌లోని మనేకా సోదరుడి నివాసంలో కొద్ది మంది కుటుంబసభ్యుల మధ్య ఆదివారం వారి వివాహం జరిగినట్లు పీటీఐ అధికార ప్రతినిధి ఫవాద్ చౌదరి తెలిపారు. త్వరలో అతిథులతో సింపుల్‌గా వలీమా డిన్నర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పీటీఐ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ముఫ్తీ ముహమ్మద్ సయీద్ వారి నిఖా జరిపించారు. పీటీఐ పార్టీకి చెందిన మీడియా విభాగం వారి పెళ్లి ఫొటోను విడుదల చేసింది.
గతంలో ఇమ్రాన్ ఖాన్ ఇద్దరు భార్యలతో విడాకులు తీసుకున్నారు. 1995లో బ్రిటిష్‌కు చెందిన బిలియనీర్ కుమార్తె జెమీమా గోల్డ్‌స్మిత్‌ను వివాహం చేసుకున్నారు. తొమ్మిదేళ్లు వీళ్లు కలిసి ఉన్నారు. జెమీమాకు ఇద్దరు కుమారులు. తర్వాత 2015లో టీవీ యాంకర్ రెహామ్ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. వీరు కేవలం పది నెలలు మాత్రమే కలిసి ఉన్నారు. తర్వాత ఆమెతో కూడా విడాకులు తీసుకున్నారు. ఇమ్రాన్‌ఖాన్, బుష్రా మనేకాను జనవరి ఒకటో తేదీన వివాహం చేసుకున్నారని ఇటీవల పుకార్లు వచ్చాయి. ఖాన్ వీటిని ఖండించారు. కానీ గత కొన్ని రోజులుగా ఈ విషయమై వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో ఈ పుకార్ల ప్రభావం పార్టీపై పడుతోందని పలువురు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. తమ వివాహాన్ని అధికారికంగా తెలియజేయాలని ఇమ్రాన్‌కు పార్టీ పెద్దల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో ఆయన మనేకాను వివాహం చేసుకుని అధికారికంగా ప్రకటించినట్లు తెలుస్తోంది.
మనేకా వయసు 40కి పైగా ఉంటుంది. ఆమెకు మొదటి భర్తతో అయిదుగురు పిల్లలు ఉన్నారు. ఆమె మతబోధకురాలు. ఖాన్ గత ఏడాది కాలంగా ఆధ్యాత్మిక సూచనలు, సలహాలు కోసం ఆమె వద్దకు వెళ్తున్నారు. ఖాన్ విషయంలో రాజకీయపరంగా ఆమె అంచనాలు చాలా వరకు నిజమయ్యాయట. గత నెలలోనే మనేకా తన భర్తకు విడాకులు ఇచ్చింది. తర్వాత తాను బుష్రాను పెళ్లి చేసుకుంటానని అడిగానని గత నెలలోనే ఇమ్రాన్ వెల్లడించిన సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలోనే పుకార్లు షికార్లు చేశాయి. ఎట్టకేలకు వారి వివాహం జరిగింది.
No comments:
Post a Comment