Tuesday, 6 February 2018

ఫొటో తీసుకోబోయాడని ఫోన్‌ పగలగొట్టిన అనసూయ? పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ

ఫొటో తీసుకోబోయాడని ఫోన్‌ పగలగొట్టిన అనసూయ?
పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ

యాంకర్‌ అనసూయ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. తనతో కలిసి ఫొటో తీసుకోవడానికి ప్రయత్నించిన బాలుడి ఫోన్‌ను పగలగొట్టారట. దీంతో బాలుడి తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తార్నాకలో నివాసం ఉంటున్న సదరు మహిళ అనసూయపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడు సెల్ఫీ తీసుకోబోయినందుకు యాంకర్‌ ఫోన్‌ను పగలగొట్టారని ఆరోపించారు. తార్నాకలో నివాసం ఉంటున్న తన తల్లి ఇంటికి అనసూయ సోమవారం వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. అనసూయపై కేసు నమోదు చేసిన విషయం నిజమేనని ఉస్మానియా యూనివర్శిటీ పోలీసు స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో (స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌) జి. జగన్‌ తెలిపారు. కేసు విచారణ జరుపుతున్నామని, ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం కాదని అభిప్రాయపడ్డారు. అనసూయ అక్కడి నుంచి వెంటనే వెళ్లాల్సిన తొందరలో సెల్ఫీ దిగడానికి విముఖత చూపారని, ఈ క్రమంలో ఫోన్‌ పగిలిందని చెప్పడం గమనార్హం.
ఈ సంఘటనకు సంబంధించి సోషల్‌మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. అందులో అనసూయపై ఫిర్యాదు చేసిన మహిళ తన కుమారుడితో కలిసి ఉన్నారు. సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అనసూయ తన కుమారుడి చేతిలోని ఫోన్‌ను తీసుకుని, నేలకు విసిరారని ఆమె అన్నారు. పగిలిన ఫోన్‌ను కెమెరాకు చూపుతూ.. నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.
అయితే ఈ వార్తల్ని అనసూయ తోసిపుచ్చారు. ‘ఇది పూర్తిగా తప్పు. ఆ మహిళ అబద్ధాల్ని ప్రచారం చేస్తోంది. మా అమ్మను చూడటానికి తార్నాకకు వెళ్లా. నేను బయటికి వస్తుండగా ఆమె తన కుమారుడితో కలిసి నా వీడియో తీశారు, నాతో సెల్ఫీకి ప్రయత్నించారు. నేను అప్పుడు సెల్ఫీ దిగే పరిస్థితిలో లేను, అందుకే తిరస్కరించా. కెమెరా దగ్గరికి పెట్టేసరికీ కంగారుపడ్డా. నా ముఖం కప్పుకున్నా, ఇక్కడి నుంచి వెళ్లండి అని వారికి చెప్పి కారులో కూర్చొన్నా. అప్పుడు ఫోన్‌ పగిలిందా? లేదా? అన్న విషయం నాకు గుర్తులేదు’ అని ఆమె ఓ వెబ్‌సైట్‌తో చెప్పారు. అనంతరం ఆమె ట్వీట్‌ కూడా చేశారు. ‘ఆమె ఫోన్‌ పగిలినందుకు క్షమాపణలు చెబుతున్నా. కానీ నేను చేయని తప్పుకు నన్ను నిందించడం సరికాదు. నా ప్రైవసీ నాకు ఉంటుంది’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇదే సందర్భంగా ఓ వ్యక్తి అనసూయను ఉద్దేశించి ట్విటర్‌లో కామెంట్‌ చేశారు. ఎందుకు ఫోన్‌ పగలగొట్టావు? అని ప్రశ్నించారు. అనసూయతోపాటు హైదరాబాద్‌ పోలీసులకు ఈ కామెంట్‌ను ట్యాగ్‌ చేశారు. దీంతో పోలీసులు స్పందించారు. పూర్తి వివరాలు చెప్పండి అని అతడికి బదులిచ్చారు. ఈ ట్వీట్లు చూసిన అనసూయ పోలీసులకు బదులిస్తూ.. తనను ట్వీట్‌లో ట్యాగ్‌ చేసే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని కోరారు.

No comments:

Post a Comment