Sunday, 4 February 2018

పేదవాళ్లో, ధనికులో చెబుతానంటున్న ఫేస్‌బుక్‌


లండన్‌: ఇప్పటి వరకు మీ స్నేహితులకు ఫొటోలు పంపించేందుకు, వాళ్లతో చాటింగ్‌ చేసుకోవడానికి ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ను ఉపయోగించుకుంటున్నారు. తమ అనుభవాలను ఫేస్‌బుక్‌ వేదికగా ఇతరులతో పంచుకుంటున్నారు. ఇప్పుడు ఫేస్‌బుక్‌ మీరు పేదవాళ్లో, ధనికులో చెప్పేస్తుందట. ఇందుకు సంబంధించిన టెక్నాలజీని తీసుకొచ్చేందుకు పేటేంట్‌కు దరఖాస్తు చేసుకుంది. సామాజిక-ఆర్థిక స్థితిగతుల ద్వారా వినియోగదారులను మూడు విభాగాలుగా విభజించనుంది. యూజర్లను శ్రామిక వర్గం, మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతిగా పరిగణించనుంది. దీనికి సంబంధించిన కొత్త సిస్టమ్‌ను రూపొందిస్తోంది.

ఫేస్‌బుక్‌ యూజర్‌ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, ఇంటర్నెట్‌ డేటా వినియోగం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని పేదవాళ్లో, ధనికులో తేల్చనుంది. ఇలా చేయడం వల్ల వినియోగదారుడికి అవసరమైన ప్రకటనలు వాళ్లకు అందుబాటులో ఉండేలా చూడనుంది. థర్డ్‌ పార్టీ తమ వస్తువు, సేవల గురించి యూజర్లకు తెలియజేసేందుకు ఈ సోషియో-ఎకానమీ స్టేటస్‌ ఉపయోగపడుతుందని కంపెనీకి చెందిన వర్గాలు వెల్లడించాయి. యూజర్‌ వయసు 20ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉంటే.. వాళ్లు ఎంత ఇంటర్నెట్‌ డేటాను వినియోగిస్తున్నారో పరిగణలోకి తీసుకుంటుంది. అదే 30 ఏళ్ల నుంచి 40ఏళ్ల మధ్య వయసు వాళ్లయితే.. సొంత ఇళ్లు ఉందా లేదా అనే ప్రశ్నలను ఫేస్‌బుక్‌ అడుగుతుంది. మీ విద్యార్హతలు, మీరు ఎక్కడెక్కడికి ప్రయాణించారు, ఎంత ఇంటర్నెట్‌ వాడుతున్నారు తదితర వివరాలను సేకరించనుంది. కానీ ఎక్కడా యూజర్‌ ఆదాయం వివరాలను మాత్రం అడగదు. వీటన్నింటిని అంచనా వేసి పేదవాళ్లో, ధనికులో ఫేస్‌బుక్‌ చెప్పేస్తుందట. త్వరలోనే ఈ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

No comments:

Post a Comment