Wednesday, 7 February 2018

నీకు నువ్వే సాటి! ఫోర్త్‌ అంపైర్‌

నీకు నువ్వే సాటి! 
ఫోర్త్‌ అంపైర్‌ 

కోహ్లి సెంచరీలు కొట్టడం కొత్త కాదు. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌లు ఆడటమూ కొత్త కాదు. సహచరులు విఫలమైనపుడు అతను నిలబడి ఇన్నింగ్స్‌ను నిలబెట్టడమూ కొత్త కాదు. కానీ మూడో వన్డేలో విరాట్‌ ఇన్నింగ్స్‌ను ఇప్పటిదాకా అతను సాధించిన సెంచరీల్లో ఒకటిగా మాత్రమే చూడలేం! ఇది ఒక యోధుడి శారీరక ధారుడ్యానికి.. ఒక మేటి క్రికెటర్‌ తెలివితేటలకు.. ఒక బ్యాటింగ్‌ మేధావి నైపుణ్యానికి.. ఒక కెప్టెన్‌ అంకితభావానికి నిదర్శనం!
పరిస్థితులకు తగ్గట్లు ఆటను అన్వయించుకోవడంలోనే ఒక క్రికెటర్‌ పరిణతి తెలుస్తుంది. సొంతగడ్డపై ఫ్లాట్‌ పిచ్‌ల మీద ఆడినట్లే అన్ని చోట్లా ఆడేస్తామంటే కుదరదు. ఎంతటి మేటి బ్యాట్స్‌మన్‌ అయినా పరిస్థితులు అంత అనుకూలంగా లేనపుడు కొంచెం తగ్గి ఆడాలి. బౌలర్లను గౌరవించాలి. విరాట్‌ అదే చేశాడు.
క్షిణాఫ్రికా పర్యటనకు ముందు రెండేళ్ల పాటు టీమ్‌ఇండియా జైత్రయాత్ర ఎలా సాగిందో తెలిసిందే. ఆ జైత్రయాత్రలో కోహ్లి సహా మిగతా ఆటగాళ్లందరూ కూడా కీలక పాత్ర పోషించారు. విరాట్‌ డబుల్‌ సెంచరీల మోత మోగించాడు. ఐతే సొంతగడ్డపై ఎలా ఆడితే ఏముంది? దక్షిణాఫ్రికాలో చూపించండి సత్తా అన్నారంతా. ఈ సవాలును నూటికి నూరు శాతం స్వీకరించి తన స్థాయి ఏంటో చాటిచెప్పాడు విరాట్‌. టెస్టు సిరీస్‌లో భారత్‌ ఓటమి పాలై ఉండొచ్చు. కానీ విరాట్‌ ఓడలేదు. వికెట్లు పేసర్ల స్వర్గధామాలైతేనేమి.. దక్షిణాఫ్రికా ఫాస్ట్‌బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో పరీక్ష పెడితేనేమి.. కోహ్లి మాత్రం తన ఆట తాను ఆడుతూ పోయాడు. సెంచూరియన్‌లో సహచరులంతా చేతులెత్తేసిన వేళ.. అతడి 153 పరుగుల ఇన్నింగ్స్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆపై జొహానెస్‌బర్గ్‌లో భారత్‌ అద్భుత విజయం సాధించిన మ్యాచ్‌లో రెండు విలువైన ఇన్నింగ్స్‌లతో మెరిశాడు కోహ్లి. ఇక తనకు అత్యంత ఇష్టమైన వన్డే ఫార్మాట్లోకి వచ్చేసరికి కోహ్లి పతాక స్థాయినే అందుకున్నాడు. ఆడుతున్నది భారత గడ్డ మీదా అని సందేహం కలిగేలా చెలరేగిపోతున్నాడు. మొన్న డర్బన్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ శతకం.. నిన్న సెంచూరియన్‌లో 46 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌.. ఇప్పుడు కేప్‌టౌన్‌లో కెరీర్లో ఒక మైలురాయిలా నిలిచిపోయే మేలిమి ఇన్నింగ్స్‌!
అతను ఎప్పుడూ చూపించే దూకుడు బుధవారం మూడో వన్డేలో కనిపించలేదు. ఈ పిచ్‌పై బ్యాటింగ్‌ అంత సులువుగా ఏమీ సాగలేదు. అతను ధనాధన్‌ షాట్లు ఆడేసి తేలిగ్గా సెంచరీ కొట్టేయలేదీసారి. దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ బలహీనపడి ఉండొచ్చు కానీ.. బౌలింగ్‌ మాత్రం ఇప్పటికీ ప్రమాదకరమే. ముఖ్యంగా రబాడ 145 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రతి బంతికీ పరీక్ష పెట్టాడు. మిగతా బౌలర్లూ సత్తా చాటారు. ఇలాంటి బౌలింగ్‌ను ఎంతో సంయమనంతో, పరిణతితో ఎదుర్కొన్నాడు విరాట్‌. షాట్లు కొట్టడానికి అన్నిసార్లూ అవకాశం లేకపోయినా.. వీలు చిక్కినపుడు మాత్రం అద్భుతమైన షాట్లు ఆడాడు. కొన్ని మంచి బంతులనూ అద్భుత రీతిలో బౌండరీలు రాబట్టిని తీరు అమోఘం.
తన వికెట్‌ విలువేంటో విరాట్‌కు బాగా తెలుసు. అందుకే ఔటయ్యే ప్రమాదమున్న షాట్లు పెద్దగా ఆడలేదు. 50 ఓవర్ల పాటు క్రీజులో నిలిచి కూడా అతను ప్రత్యర్థి బౌలర్లకు పెద్దగా అవకాశం ఇవ్వలేదు. మూడు గంటలకు పైగా క్రీజులో నిలిచినా.. అలసట కనిపించనివ్వలేదు. ధోని, పాండ్య, జాదవ్‌ లాంటి వాళ్లు చేతులెత్తేయడంతో చివర్లో అతనే భారీ షాట్లు ఆడాడు. అసాధ్యం అనుకున్న 300 స్కోరును సాధించి పెట్టాడు. ఇన్నింగ్స్‌ చివరి రెండు బంతులకు కోహ్లి ఆడిన షాట్లు అతడి బ్యాటింగ్‌ మేధస్సుకు రుజువుగా నిలుస్తాయి. ఐదో బంతికి రబాడ షార్ట్‌ పిచ్‌ బంతి వేయబోతున్నాడని ముందే గ్రహించి బ్యాక్‌ పుట్‌ తీసుకుని పుల్‌ షాట్‌ ఆడటానికి ముందే సిద్ధమైపోవడం, 145 కి.మీకి పైగా వేగంతో వచ్చిన బంతిని అంతే వేగంతో స్టాండ్స్‌లోకి పంపించడం అమోఘం. ఇక చివరి బంతికి కూడా అడ్డదిడ్డంగా షాట్‌ ఆడకుండా లాంగాన్‌లో ఫీల్డర్‌ ముందుకున్న సంగతి గుర్తించి.. కళాత్మక స్ట్రెయిట్‌ డ్రైవ్‌తో బంతిని బౌండరీ బాట పట్టించిన వైనమూ అద్భుతమే. 50 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన బ్యాట్స్‌మన్‌ ఇన్నింగ్స్‌ చివర్లో అంత చురుగ్గా ఆలోచించడం, బౌలర్‌ మనసును చదివేసి షాట్లు ఆడటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇక్కడే కోహ్లి ప్రత్యేకత కనిపిస్తుంది.
కోహ్లి స్కోరు 160లో బౌండరీల ద్వారా వచ్చినవి 60 పరుగులే. మిగతా వందా కేవలం వికెట్ల మధ్య పరుగుతోనే సాధించాడు. అంతే కాదు.. మిగతా బ్యాట్స్‌మెన్‌ బౌండరీలతో కాకుండా సాధించిన 100 పరుగుల్లో అతడి భాగస్వామ్యం ఉంది. అంటే వికెట్ల మధ్య అతను 200 సార్లు పరుగెత్తాడన్నమాట. దాదాపు 50 ఓవర్ల పాటు క్రీజులో నిలిచి.. ఆద్యంతం ఏకాగ్రతతో, అత్యుత్తమంగా ఆడుతూ.. ఇంత శ్రమకు ఓర్చి ఇన్నింగ్స్‌ను నిర్మించడమంటే మాటలు కాదు. కోహ్లి ఫిట్‌నెస్‌ ప్రమాణాలు ఏ స్థాయివో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కఠినమైన పిచ్‌పై మేటి బౌలర్లను ఎదుర్కొంటూ కోహ్లి సాధించిన ఈ ఇన్నింగ్స్‌లో అతడి మార్కు బ్యాటింగ్‌ కళాత్మకతను చూడొచ్చు. అలాగే కెప్టెన్‌గా అతడి బాధ్యతను చూడొచ్చు. విరాట్‌ శారీరక, మానసిక దృఢత్వాన్ని కూడా ఈ ఇన్నింగ్స్‌లో చూడొచ్చు. పరిస్థితులకు తగ్గట్లుగా ఒక ఆటగాడు ఎలా అన్వయించుకుని ఆడాలో చూపించే ఒక పాఠంలా ఇన్నింగ్స్‌ నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.

- virat kohli fitness diet using herbalife and  hard work

No comments:

Post a Comment