బాలీ: ఇదొక వింత. కోడి గుడ్డును మనిషి పెడుతున్నాడు. అదీ అందరూ చూస్తుండగానే. అసలు ఇది ఎలా జరుగుతోందో తెలియక వైద్యులు తలలు పట్టుకుంటున్నారు. దక్షిణ ఇండోనేసియాకు చెందిన 14ఏళ్ల అక్మల్‌లో దాగిన మర్మమిదీ..! ఇతడు రెండేళ్లలో 18 గుడ్లు పెట్టాడంటూ అంతర్జాలంలో వార్తలు హల్‌చల్‌చేశాయి. వీటిని అందరూ కొట్టిపారేశారు. అయితే గత సోమవారం తమ ముందే రెండు గుడ్లు పెట్టడంతో వైద్యులు నివ్వెరపోయారు. దీనిలో ఎలాంటి ఇంద్రజాలమూలేదని అక్మల్ తండ్రి రుస్లి చెబుతున్నారు. ‘ఇదివరకు అక్మల్ పెట్టిన ఓ గుడ్డును పగులగొట్టాను. లోపల అంతా పసుపుపచ్చ సొనే ఉంది. మరొక గుడ్డును అక్మల్ తల్లి పగులగొట్టింది. దానిలో పసుపుపచ్చ సొనే లేదు. అంతా తెల్లగా ఉంది. అసలు గుడ్డును అమాంతం ఎప్పుడూ అక్మల్ మింగలేదు’అని ఆయన వివరించారు. మరోవైపు అక్మల్ గుడ్డును వైద్యులు పరిశీలించారు. ఇవి కోడి గుడ్లలానే ఉన్నట్లు తేల్చారు. ఇవి అతడి కడుపులోకి ఎలా వెళ్లాయనేది అంతుచిక్కడం లేదు. వీటిని కావాలనే మలద్వారం గుండా శరీరంలోకి పంపించినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ‘మనిషి గుడ్డు పెట్టడం అసాధ్యం. మలద్వారం గుండా అక్మల్ వీటిని శరీరంలోకి పంపించి ఉండొచ్చు. ఇది మా అనుమానం మాత్రమే. అతణ్ని వారంపాటు మా పరిశీలనలో ఉంచి పరీక్షలు చేపడతాం. దీంతో నిజానిజాలు తేలిపోతాయి’అని సంబంధిత అసుపత్రి ప్రతినిధి తెలిపారు. ఇండోనేసియాలో మనిషి గుడ్డుపెట్టాడంటూ వార్తలు రావడం ఇదేమీ తొలిసారి కాదు. ఉత్తర జకార్తాకు చెందిన కాకెక్ సినిన్ 2015లోనూ ఇదే విషయంతో వార్తల్లోకెక్కారు.

No comments:
Post a Comment