‘ప్రతిభ ఆధారిత వలస వ్యవస్థవైపు అడుగుల వేయాల్సిన తరుణమిది. మన దేశాన్ని ప్రేమించే వారు, గౌరవించేవారికి- మన సమాజం కోసం కృషి చేసేవారికి- నైపుణ్యవంతులకు.. ప్రతిభ ఆధారిత వలస వ్యవస్థను కల్పించనున్నాం’ అని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్రంప్ నిర్ణయానికి మద్దతుగా ఇల్లినాయిస్‌కు చెందిన ‘రిపబ్లికన్ హిందూ అలియన్స్’ ఆధ్వర్యంలో శనివారం శ్వేతసౌధం ఎదుట ర్యాలీ చేపట్టారు.
ప్రతిభ ఆధారిత వీసా వలస విధానానికి మద్దతు తెలుపుతూ ట్రంప్ చేసిన ప్రతిపాదనను అభినందిస్తూ ‘‘వి లవ్ ట్రంప్’’, ‘గ్రీన్‌కార్డు సమస్యలు పరిష్కరించండి’ అంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ‘ఎన్నో ఏళ్లుగా మేమంతా గ్రీన్‌కార్డు కోసం వేచి చూస్తున్నాం. ఏళ్లు గడుస్తున్నప్పటికీ మాకు గ్రీన్‌కార్డు రావడం లేదు. దీంతో మా పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారి విద్యకు ఆటంకం ఏర్పడుతోంది. గ్రీన్‌కార్డు సమస్యలను వెంటనే పరిష్కరించాల’ని కోరుతూ దాదాపు 200 మంది భారతీయులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
లాటరీ ఆధారిత వీసా విధానానికి స్వస్థి పలికి ప్రతిభ ఆధారిత వలస వ్యవస్థ వైపు అడుగులు వేయడంతో అమెరికాలో వలసదారులకు శాశ్వత నివాసం ఏర్పాటుచేసుకునే విషయంలో ఎదురయ్యే కష్టాలు తీరనున్నాయి. అమెరికా మొత్తం మీద దాదాపు 3.5 మిలియన్ల మంది భారతీయులు ఉన్నారు. ఒక్క వాషింగ్టన్ రీజియన్‌లోనే దాదాపు 1.37లక్షల మంది భారతీయులు ఉంటున్నట్లు యూఎస్ జనాభా లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు కుటుంబ ఆధారిత వలస విధానాన్ని నియంత్రించేందుకు ఉద్యోగుల జీవిత భాగస్వాములు, వారి మైనర్ పిల్లలకే వీసా స్పాన్సర్‌షిప్‌ను పరిమితం చేసే ఆలోచనల్లో ట్రంప్ ప్రభుత్వం ఉంది.
పిల్లల రాకను అనుమతిస్తూ చేపట్టిన కార్యక్రమం ద్వారా 6,90,000మంది ప్రయోజనం పొందునున్నారు. అయితే ఇందులో న్యాయపరంగా అన్ని రకాలుగా సరైన పత్రాలను కలిగి ఉన్నవారికే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే పిల్లల విషయంలోనూ సమన్యాయం పాటించాలని భారతీయ టెకీలు అభిప్రాయపడుతున్నారు. ‘‘మా పిల్లలు ఇక్కడికి రావాలని వారేమీ అనుకోలేదు. మేము వారికి మంచి భవిష్యత్ అందించాలనే ఆలోచనతో ఇక్కడికి తీసుకొచ్చాం’’ అని పిల్లలకు గ్రీన్‌కార్డు మంజూరీ విషయంలో ఆలోచించాలని భారతీయ టెకీలు అంటున్నారు.
‘నేను ఇక్కడికి వచ్చినపుడు నాకు ఆరేళ్ల కూతురు ఉంది. 2007 నుంచి నేను గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తునే ఉన్నాను’ అని ఉత్తర కరోలినాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న 45ఏళ్ల నందు కొండూరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘2011లో గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఇప్పటికీ రాలేదు. నాకు 13ఏళ్ల అక్షిత ఉంది. గ్రీన్‌కార్డు రాకపోవడంతో ఇక్కడ నా కూతురు విద్యనభ్యసించడం ఇబ్బందిగా మారింది’ అని ఫ్లోరిడాలోని గెయిన్స్‌విల్లేలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న రమేశ్ రామనాథన్ చెప్పుకొచ్చారు. వీళ్లే కాదు.. ఇలా ఎంతో మంది భారతీయులు గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
No comments:
Post a Comment