Monday, 5 February 2018

బిట్‌కాయిన్‌పై ఆయన జోస్యం నిజమౌతుందా?




 బిట్‌కాయిన్‌.. ఇటీవల కాలంలో తరచూ వినపడుతున్న పేరు. కొద్ది నెలల క్రితం జీవనకాల గరిష్ఠాలకు చేరిన దీని విలువ.. మళ్లీ అదే స్థాయిలో పతనమవుతూ వార్తల్లో నిలుస్తోంది. ఈ పతనం తాత్కాలికమేనని కొందరు వాదిస్తుండగా.. మరికొందరు ఇవి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని హెచ్చరిస్తున్నారు. అయితే, 2008 ఆర్థిక మాంద్యాన్ని ముందుగానే ఊహించిన ప్రముఖ ఆర్థిక వేత్త కూడా ఇదే మాట చెబుతున్నారు! మానవ చరిత్రలో ఇదో పెద్ద బుడగ అని హెచ్చరిస్తున్నారు!!
అమెరికా సహా ప్రపంచ దేశాల్లో 2008లో ఆర్థిక సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. మనదేశంలో బ్యాంకింగ్‌ రంగం పటిష్ఠంగా ఉండడంతో అప్పట్లో దీని ప్రభావం పెద్దగా పడలేదు. అయితే, ఆ ముప్పును ముందుగానే ఊహించారు అమెరికాకు చెందిన రౌబిని మ్యాక్రో అసోసియేట్స్ ఛైర్మన్‌, ప్రముఖ ఆర్థికవేత్త నోరియెల్‌ రౌబిని. డాక్టర్‌ డూమ్‌గా ప్రసిద్ధికెక్కిన ఈయన అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌)లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ప్రమాదాన్ని ముందే హెచ్చరించారు. ఇప్పుడు అదే వ్యక్తి బిట్‌కాయిన్‌పై కూడా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
‘బిట్‌కాయిన్‌ విలువ 8 వేల డాలర్ల దిగువకు చేరి 7వేల డాలర్ల దిశగా పయనిస్తోంది. జీవనకాల గరిష్ఠాలతో పోలిస్తే దీనివిలువ 60 శాతం తగ్గింది. గత నెలలో 40 శాతం.. ఒక్కరోజులో 10 శాతం పడిపోయంది. మానవ చరిత్రలో ఇదో అతిపెద్ద బుడగ అని’ ట్విటర్‌లో పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా బిట్‌కాయిన్‌ పట్ల ఆందోళనలు వ్యక్తమవుతుండడంతో coinmarketcap.com వెబ్‌సైట్‌ ప్రకారం దీని విలువ శుక్రవారం 8వేల డాలర్ల దిగువకు చేరింది. 2013 డిసెంబర్‌ తర్వాత  వారంలో ఈ స్థాయిలో విలువ పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత వారం సుమారు 400 బిలియన్‌ డాలర్ల సొమ్ము ఆవిరైంది. జనవరిలో వీటి గరిష్ఠంతో పోలిస్తే ఇది సగం సంపదతో సమానం. 2017లో వీటి విలువ దాదాపు వెయ్యి శాతం పెరిగింది.బిట్‌కాయిన్‌ తర్వాత పేరుమోసిన వర్చువల్‌ కరెన్సీలైన ఈతరెమ్‌, రిపిల్‌ విలువ సైతం 20 శాతానికి పైగా పడిపోయాయి.
కాగా, బిట్‌కాయిన్‌పై ప్రపంచదేశాల్లోని వివిధ మార్కెట్‌ నియంత్రణ సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. వీటిలో పెట్టుబడి ఏమాత్రం సురక్షితం కాదని హెచ్చరిస్తున్నాయి. మరోవైపు క్రిప్టోకరెన్సీని చట్టబద్ధం చేసేదేమీ లేదని భారత్‌ ఇటీవల స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దక్షిణకొరియా, చైనా సైతం అదే బాటలో నడుస్తున్నాయి. వీటికి సంబంధించిన ప్రకటనలను నిషేధిస్తామని ఫేస్‌బుక్‌ సైతం ఇటీవల వెల్లడించింది. మరోవైపు బిట్‌కాయిన్‌ విలువ పడిపోవడం తాత్కాలికమేనని మరికొందరు అంటున్నారు.

No comments:

Post a Comment