కట్నం కోసం నా కిడ్నీ దొంగిలించాడు
కోల్‌కతా: కట్నం కోసం తన భర్త కిడ్నీ దొంగిలించాడంటూ ఓ మహిళ పోలీసులతో మొరపెట్టుకుంది. పశ్చిమ్‌బంగాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. కోల్‌కతాకు చెందిన ఓ రీటా అనే యువతికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో వరుడి తల్లిదండ్రులు భారీగానే కట్నం అడిగారు. దాంతో పెళ్లికి ముందు కొంత కట్నం ఇచ్చారు. మిగతాది తర్వాత ఇస్తామని చెప్పారు.
పెళ్లై ఏడాది గడుస్తున్నా మిగిలిన కట్నం ఇవ్వలేదని అత్తింటివారు రీటాను వేధించేవారు. ఈ నేపథ్యంలో 2016లో రీటాకు తీవ్రంగా కడుపు నొప్పి వచ్చింది. పరీక్షల నిమిత్తం వైద్యులను సంప్రదించగా అపెండిసైటిస్ సర్జరీ చేయాలని చెప్పారు. ఆ తరువాత మాటిమాటికీ అనారోగ్యం పాలవుతుండడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంది. అక్కడి వైద్యులు రీటాకు ఒకే కిడ్నీ ఉందని తెలిసి షాకయ్యారు. 2016లో అపెండిసైటిస్ సర్జరీ చేసినప్పుడు రీటా భర్తే వైద్యులకు డబ్బు ఇచ్చి కిడ్నీ తొలగించేలా చేసినట్లు తెలిసింది.
‘కడుపు నొప్పి వచ్చినప్పుడు నా భర్త కోల్‌కతాలోని ఓ నర్సింగ్ హోంకు తీసుకువెళ్లాడు. అక్కడ వైద్యులు నాకు అపెండిసైటిస్ సర్జరీ చేస్తే అంతా బాగైపోతుందని చెప్పారు. కానీ సర్జరీ పేరు చెప్పి నా కిడ్నీ తొలగించారు. ఆ విషయం నాకు అప్పుడు తెలియలేదు. సర్జరీ అయ్యాక ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని నా భర్త కోరాడు. కొన్ని నెలల తరువాత అనారోగ్యం పాలవడంతో మళ్లీ వైద్యుల వద్దకు వెళ్లాను. వారు స్కానింగ్ నిర్వహించగా ఒకే కిడ్నీ ఉన్నట్లు తెలిసింది. అప్పుడే తెలిసింది కట్నం బాకీ తీర్చలేదన్న కారణంగా నా భర్త కిడ్నీ అమ్ముకున్నాడని’ అని పోలీసులకు తెలిపింది. దాంతో పోలీసులు రీటా భర్తను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు.
No comments:
Post a Comment