Tuesday, 6 February 2018

నేతన్నలకే బతుకమ్మ

నేతన్నలకే బతుకమ్మ 
బతుకమ్మ చీరలన్నీ తెలంగాణలోనే తయారీ 
రంజాన్‌, క్రిస్మస్‌ చీరలు సైతం.. 
1.20 కోట్ల మంది మహిళలకు పంపిణీ 
నేతన్నలకు రూ.230 కోట్ల ఉపాధి 
వచ్చే నెల నుంచే ఉత్పత్తి ప్రారంభం 



రాష్ట్రంలోని మహిళలకు బతుకమ్మ, రంజాన్‌, క్రిస్మస్‌ల సందర్భంగా పంపిణీ చేయనున్న ఉచిత చీరలను ఈసారి పూర్తిగా తెలంగాణలోని నేత కార్మికులతోనే తయారు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.230 కోట్లతో 1.20 కోట్ల చీరలను ఉత్పత్తి చేయనున్నారు. గత సంవత్సరం సగం మాత్రమే తెలంగాణలో తయారు చేయగా, మిగిలిన సగాన్ని సూరత్‌ నుంచి కొనుగోలు చేశారు. అప్పట్లో సమయాభావం వల్ల సూరత్‌ వైపు మొగ్గు చూపిన ప్రభుత్వం ఈసారి ముందస్తు ప్రణాళికతో రాష్ట్రంలోనే మొత్తం ఉత్పత్తి చేయడానికి సన్నాహాలు చేయనుంది. తెలంగాణలోని ఆడపడచులకు ప్రీతిపాత్రమైన బతుకమ్మ పండగ కానుకగా, మరోవైపు నేత కార్మికులకు పని కల్పించే సంకల్పంతో ఉచిత చీరలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించగా, గత సంవత్సరం దీనిని ప్రారంభించారు. దీనికోసం రూ.222 కోట్లను విడుదల చేసింది. ఇందులో దాదాపు రూ.122 కోట్ల విలువైన 52 లక్షల పాలియెస్టర్‌ చీరల పంపిణీ అర్డర్లను సిరిసిల్లలోని నేత కార్మికులకు అప్పగించారు. మరో రూ. 100 కోట్ల తయారీ ఆర్డర్‌ను సూరత్‌లోని కంపెనీల నుంచి కొనుగోలు చేశారు. గత ఏడాది పథకం అమలు తీరును ఇటీవల మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు. లోటుపాట్లను సవరించి, పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు. ముందుగా నేత కార్మికులకు మొత్తం 1.20 కోట్ల చీరల తయారీకి పని ఉత్తర్వు (వర్క్‌ ఆర్డర్‌) ఇవ్వాలని ఆదేశించారు. చీరల ఉత్పత్తిని వచ్చే నెల నుంచి ప్రారంభించి సెప్టెంబరు 10 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. అక్టోబరు 9 నుంచి పంపిణీ జరగాలని నిర్దేశించారు. దాదాపు ఆరు నెలల సమయం ఉన్నందున ప్రతీ నెల 20 లక్షల చీరల ఉత్పత్తి చొప్పున మొత్తం చీరల తయారీకి ఈ గడువు సరిపోతుందని భావిస్తున్నారు. బతుకమ్మ తర్వాత రంజాన్‌, క్రిస్మస్‌ పండగల సందర్భంగా పంపిణీ చేయనున్న చీరలను గతంలో ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసేవారు. ఇప్పుడు వీటిని సైతం సిరిసిల్ల ఇతర ప్రాంతాల్లోని కార్మికులతో తయారు చేయించాలని మంత్రి సూచించారు. గత సెప్టెంబరులో బతుకమ్మ చీరల పంపిణీ అనంతరం కొన్ని వేల చీరలు మిగిలిపోగా వాటిని రంజాన్‌, క్రిస్మస్‌లకు ఇచ్చారు. వాటికి ఆదరణ లభించిందని అధికారులు చెప్పడంతో ఈసారి బతుకమ్మ చీరల ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించారు.
త్వరలో డిజైన్ల ఖరారు: బతుకమ్మ చీరల తయారీ సందర్భంగా డిజైన్లపై చేనేత, జౌళి శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. చీరల నాణ్యత, ప్రింటింగు, కొంగులు, అంచులు, రంగులు ఇతరత్రా సమస్యలు ఏమీ రాకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈసారి వేయి డిజైన్లను తయారు చేసి, వీటిని మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారిణులకు చూపించి, అందరి ఆమోదం పొందిన వాటిని ఎంపిక చేస్తారు. గతంలో బతుకమ్మ చీరల పంపిణీ సందర్భంగా సరైన ప్రచారం జరగక కొంత గందరగోళం ఏర్పడటంతో ఈసారి ముందస్తుగా ప్రచారం కల్పిస్తారు. మిల్లుల్లోనే చీరలు తయారవుతున్నందున వీటిపై ముందస్తు అవగాహన కల్పిస్తారు.

No comments:

Post a Comment