5 మిలియన్ డాలర్లు బడ్జెట్‌కు 50 రెట్లు పైగానే వసూళ్లు సాధించిన సినిమా .........
ఒక సినిమా బడ్జెట్‌కు 50 రెట్లు పైగానే వసూళ్లు సాధించడమంటే మాటలా..?. అదీ ఓ తొలి చిత్ర దర్శకుడు పెద్దగా పేరు లేని నటులతో అతి తక్కువ వ్యయంతో తెరకెక్కించిన సినిమా అంతటి విజయం అందుకుందంటే ఎంత ఆశ్చర్యం! అంతేకాదు, గతేడాది వచ్చిన పది అత్యుత్తమ చిత్రాల జాబితాలో స్థానం సంపాదించుకుంది. అంతటితో అయిపోలేదు... ఆస్కార్ బరిలోనూ నాలుగు ప్రధాన నామినేషన్లు అందుకుని సత్తా చాటింది. ఆస్కార్ చరిత్రలో ఓ హారర్ సినిమా ఉత్తమ చిత్రం పురస్కారం కోసం పోటీపడటం చాలా అరుదు. ఆ ఘనత అందుకున్న చిత్రమే ‘గెటవుట్’. ఆఫ్రికన్ అమెరికన్ దర్శకుడు జోర్డాన్ పీలె తెరకెక్కించిన ఈ చిత్రంలో డేనియల్ కలూయ, అలిసన్ విలియమ్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆ విశేషాలివీ.హాలీవుడ్‌లో 5 మిలియన్ డాలర్లు అంటే చాలా తక్కువ బడ్జెట్ కిందే లెక్క. అంతే వ్యయంతో కేవలం 23 రోజుల్లో ‘గెటవుట్’ను తెరకెక్కించాడు దర్శకుడు జోర్డాన్. అయితే విడుదలయ్యాక మాత్రం బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించిందీ చిత్రం. సుమారు 255 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. గతేడాది వచ్చిన పది అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా టైమ్ మ్యాగజైన్, అమెరికన్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్, నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ ఈ సినిమాను ఎంపిక చేశాయి. గోల్డెన్ గ్లోబ్, బాఫ్టా లాంటి చిత్రోత్సవాల్లో ఈ చిత్రానికి నామినేషన్లు, ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఆస్కార్ బరిలోనూ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే లాంటి ప్రధాన విభాగాల్లో పోటీపడుతోంది. ఓ హారర్ సినిమా ఈ విభాగాల్లో నామినేషన్లు దక్కించుకోవడం విశేషమే.
కథేంటి: నల్లజాతీయుడైన ఫొటోగ్రాఫర్ క్రిస్ వాషింగ్టన్(డేనియల్), శ్వేతజాతీయురాలైన తన ప్రియురాలు రోజ్(అలిసన్)తో కలసి ఓ మారుమూల ఉన్న వాళ్ల ఇంటికి వెళ్తాడు. నల్లజాతీయులను ద్వేషించే రోజ్ తల్లిదండ్రులు, సోదరుడు క్రిస్‌తో సరిగా మాట్లాడరు. ఇంట్లో పనిచేసే నల్లవారూ విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. క్రిస్ పొగతాగే అలవాటును హిప్నోథెరపీ ద్వారా పోగొడతానని చెప్పి రోజ్ తల్లి అతనిపై హిప్నాటిజం చేస్తుంది. దీంతో అతడు ఓ శూన్య ప్రపంచంలోకి జారిపోతాడు. అక్కడ అతనికి బాల్యంలో జరిగిన ఓ దుర్ఘటన కనిపిస్తుంది. పీడకల నుంచి తేరుకున్నట్లుగా మేల్కొన్న క్రిస్‌కు సిగరెట్లపై విరక్తి ఏర్పడుతుంది. కానీ ఇంట్లో వాతావరణం విచిత్రంగా కనిపిస్తుంటుంది. ఆ ఇంటికి ఓ పార్టీకి వచ్చిన కొందరు శ్వేతజాతీయులు, క్రిస్ ఫొటోగ్రఫీ ప్రతిభ చూసి అబ్బురపడతారు. అంధుడైన జిమ్ హుడ్సన్, లోగన్ కింగ్ అనే నల్లజాతీయుడు కూడా పార్టీకి వచ్చిఉంటారు. లోగన్‌ను క్రిస్ ఫొటో తీస్తే పిచ్చివాడిలా కేకలు వేస్తూ గెటవుట్ అని అరుస్తాడు. ఇంట్లో వారి విచిత్ర ప్రవర్తన చూసి అనుమానంతో వారి ఫొటోలను తన స్నేహితుడికి పంపుతాడు క్రిస్. వాటిలో లోగన్‌ను చూసి అతడు కొన్నిరోజుల క్రితం కనిపించకుండా పోయిన ఆండ్రె అని వ్యక్తి అని, అక్కడేదో ప్రమాదం పొంచి ఉందని చెబుతాడు స్నేహితుడు. దీంతో అక్కణ్నంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతాడు క్రిస్. ఆ విషయం పసిగట్టిన రోజ్ కుటుంబ సభ్యులు గేట్లు మూసేస్తారు. రోజ్ తల్లి మళ్లీ అతణ్ని హిప్నటైజ్ చేసి ఇంటి బేస్‌మెంట్‌లో కుర్చీలో బంధిస్తుంది. అక్కడ అతనికి ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది. రోజ్ కుటుంబం తెల్లజాతీయుల మెదళ్లను నల్లజాతీయుల శరీరాల్లోకి ప్రవేశపెడ్తుంటారని, ఇంట్లో ఉన్న పనిమనుషుల శరీరార్లో రోజ్ పూర్వీకుల ఆత్మలున్నాయని అర్థమవుతుంది. ఇప్పుడు క్రిస్ శరీరంలోకి అంధుడైన జిమ్ మెదడును ప్రవేశపెట్టడానికి చూస్తుంటారు. దాంతో తనకు చూపుతో పాటు క్రిస్‌లోని ఫొటోగ్రఫీ నైపుణ్యం లభిస్తాయని జిమ్ ఆశపడ్తుంటాడు. మరి ఆ ఇంటి నుంచి క్రిస్ బయటపడ్డాడా? ప్రాణాలు కాపాడుకున్నాడా? అన్నది ‘గెటవుట్’లో చూడాలి.
విశేషాలు :
* ర్యాప్ సింగర్ చాన్స్‌కు ఈ సినిమా తెగ నచ్చేసింది. ఎంతలా అంటే ఒకరోజు షికాగోలోని అన్ని థియేటర్లలోని అన్ని టికెట్లనూ అతనే కొని జనాలకు ఉచితంగా సినిమా చూసే అవకాశాన్ని కల్పించాడు.
* తొలి చిత్రంతోనే వంద మిలియన్ డాలర్లు వసూళ్లు సాధించిన తొలి నల్లజాతీయుడైన దర్శకుడిగా జోర్డాన్ రికార్డు సాధించాడు.
* ర్యాప్ సింగర్ చాన్స్‌కు ఈ సినిమా తెగ నచ్చేసింది. ఎంతలా అంటే ఒకరోజు షికాగోలోని అన్ని థియేటర్లలోని అన్ని టికెట్లనూ అతనే కొని జనాలకు ఉచితంగా సినిమా చూసే అవకాశాన్ని కల్పించాడు.
* తొలి చిత్రంతోనే వంద మిలియన్ డాలర్లు వసూళ్లు సాధించిన తొలి నల్లజాతీయుడైన దర్శకుడిగా జోర్డాన్ రికార్డు సాధించాడు.

No comments:
Post a Comment