ఆకట్టుకుంటున్న ఔటర్..
అంతర్జాతీయ ప్రమాణాలతో.. 8 లేన్లతో నిర్మించిన ఓఆర్‌ఆర్ ప్రధాన రహదారితోపాటు ఇరువైపులా 4 లేన్ల సర్వీసు రోడ్లు, వాటి మధ్యలో ఏపుగా పెరుగుతున్న పచ్చని చెట్లతో ఆ ప్రాంతమతా ఆకర్ణణీయంగా మారింది. ఒక్కసారి ఔటర్‌పైన, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రయాణించినా, కొంత సమయం గడిపినా చాలా బాగుంది అనే భావన కలుగుతోంది. ఇదే వారిని నగరం నుంచి శివార్లకు తరలివచ్చేలా చేస్తోంది. 25-30 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ మౌలిక వసతులను కల్పిస్తోంది. ఔటర్ పైన గంటకు 100 కి.మీ వేగంతోనే కాదు నగరానికి అనుసంధానంగా ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారులతోపాటు విశాలంగా 100 అడుగుల విస్తీర్ణంతో నిర్మించిన రేడియల్ రోడ్లపై చాలా సౌకర్యంగా, వేగంగా రాకపోకలు సాగించవచ్చు. ఈ పరిస్థితులు శివార్లలో నివాసాలు ఏర్పాటు చేసుకునేలా చేస్తున్నాయి.
నాంపల్లి నుంచి సుమారు 30 కి.మీ దూరంలో చుట్టూ నిర్మాణం పూర్తిచేసుకున్న ఔటర్ రింగు రోడ్డు నగర వాసులకు కొత్త అనుభూతినిస్తోంది. ఓఆర్‌ఆర్ సమీపంలో కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో రెండేళ్ల కాలంలోనే 31 వరకు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు అనుమతులు పొంది నిర్మాణాలు జరుగుతున్నాయి. హెచ్‌ఎండీఏ కల్పిస్తున్న మౌలిక వసతులు నగరవాసుల ఆలోచన విధానంలో మార్పు తీసుకొస్తున్నాయి. శివార్లకు వెళ్లి ప్రశాంతమైన వాతావరణం, విశాలమైన కాలనీలు, గెటేడ్ కమ్యూనిటీల్లో నివాసం ఉండాలన్న కోరికను ప్రజలు పెంచుకుంటున్నారు. దీనికి తగ్గట్టుగానే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఔటర్ కేంద్రంగా ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి... అక్కడి నుంచి కోకాపేట, కొల్లూరు, తెల్లాపూర్, పటాన్‌చెరువు ప్రాంతాల్లోనే వందలాది ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోగా... మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. ఇలా.. 158 కి.మీ పొడవునా నివాస ప్రాంతాలు ప్రతియేటా పెరుగుతున్నాయి.
No comments:
Post a Comment