Wednesday, 7 February 2018

లోపాలు కుప్పలు.. తప్పని తిప్పలు ఈ-పోస్‌ విధానంలో ఉత్పన్నమవుతున్న సమస్యలు మొరాయిస్తున్న యంత్రాలు దుకాణాల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణ

లోపాలు కుప్పలు.. తప్పని తిప్పలు 
ఈ-పోస్‌ విధానంలో ఉత్పన్నమవుతున్న సమస్యలు 
మొరాయిస్తున్న యంత్రాలు 
దుకాణాల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణ 

ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల నుంచి జిల్లాలో ఈ-పోస్‌ విధానాన్ని(పాయింట్‌ ఆఫ్‌ సేల్‌) ప్రవేశపెట్టింది. ఈ విధానంపై ఇప్పటికే డీలర్లకు శిక్షణ ఇచ్చింది. వీరికి ఈపాస్‌, ఎలక్ట్రానిక్‌ తూకంను అనుసంధానించిన యంత్రాలను పంపిణీ చేశారు. అయితే.. అంతర్జాలం సౌకర్యం లేక కొన్ని ప్రాంతాల్లో, అవగాహనా లోపంతో మరికొన్ని ప్రాంతాల్లో సరకుల పంపిణీ నిలిచిపోయింది. ఫలితంగా ప్రతి నెలా సరకులు పొందుతున్న లబ్ధిదారులు చౌకధరల దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
సాంకేతిక సమస్య.. పరిష్కారం లభించేనా
ఈ పోస్‌ విధానాన్ని ముందుగా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేశారు. అక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకపోవడంతో రెండో విడత జిల్లాలో అమలు చేశారు. దేవరకొండ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు మారుమూల ఉండటం, గుట్టలు, లోతట్టు ప్రదేశాలు ఉండడంతో అప్‌గ్రేడ్‌ చేసిన నూతన సాఫ్ట్‌వేర్‌తో కూడిన యంత్రాలు కూడా పనిచేయడంలేదు. ఉమ్మడి చందంపేట మండలాల పరిధిలో 55 ప్రభుత్వ రేషన్‌ దుకాణాల్లో 30 కేంద్రాలను సిగ్నల్‌ సమస్య వెంటాడుతోంది.
నాలుగు మండలాలకు ఒకరే ఇంజినీర్‌
ముబిన్‌, డీటీసీఎస్‌
ఈ పోస్‌ పరికరాల అమలు తీరుపై ఇప్పటికే డీలర్లకు రెండు సార్లు శిక్షణ తరగతులను నిర్వహించాం. మారుమూల గ్రామాల్లో ఈ యంత్రాలు మొరాయిస్తున్నాయని డీలర్లు సమాచారం ఇస్తున్నారు. యంత్రాలను అమర్చి, వాటి పనితీరు పర్యవేక్షించేందుకు దేవరకొండ, డిండి, చందంపేట, నేరడుగొమ్ము మండలాలకు ఒకరే ఇంజినీర్‌ ఎంపికయ్యారు. మంగళవారం నుంచి గ్రామాల వారిగా సందర్శించి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం ఈ విధానంలో తూకాల్లోనూ వ్యత్యాసాలు రావడంతో పలుచోట్ల సరకులు నిలిపివేయాలని డీలర్లకు సూచించాం.
ఇలా పని చేస్తాయి
సిమ్‌కార్డు ఆధారంగా ఈ పరికరం పనిచేస్తుంది. మారుమూల గ్రామాల్లో సిగ్నల్‌ సమస్య ఉత్పన్నం కాకుండా యాంటీనాలనూ అధికారులు పంపిణీ చేశారు. ఆయా ప్రాంతాల్లో సిగ్నల్‌ బాగా ఉన్న నెట్‌వర్క్‌కు  చెందిన సిమ్‌కార్డును ఉపయోగించి యాక్టివేట్‌ చేశారు.  ప్రతిరోజు లాగిన్‌ అవ్వాల్సి ఉండడంతో డీలర్‌ లేదా అతని కుటుంబసభ్యులు మరో ఇద్దరికి లాగిన్‌ అయ్యే అవకాశం కల్పిస్తారు. తూకంలో మోసాలు చేయకుండా ఎలక్ట్రానిక్‌ కాంటాలను ఈ పోస్‌కు అనుసంధానం చేస్తారు. ఆయా రేషన్‌దుకాణాల పరిధిలోని కార్డు నెంబర్‌ నమోదు చేయగానే యజమాని పేరు, యూనిట్‌ సభ్యుల పేర్లు, ఆధార్‌నెంబర్లు, వారి నెలవారి కోటా వివరాలు కనిపిస్తాయి. దీంతోపాటు లబ్ధిదారుని వేలిముద్ర తీసుకోవాల్సి ఉంటుంది. తూకం వేయగానే బరువు, ధర, పట్టిక ప్రింట్‌ రూపంలో వస్తుంది. ఫలితంగా తూకాల్లో అక్రమాలకు తావు లేకుండా ఉంటుంది.ఈ పరికరం వినియోగంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు పేర్కొంటున్నారు.

No comments:

Post a Comment