Friday, 23 February 2018

మోసపూరిత పథకాలపై ఉక్కుపాదం


మోసపూరిత పథకాలపై ఉక్కుపాదం :   ప్రభుత్వం 

దిల్లీ: మోసపూరిత పథకాలతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసుకుని, పరారయ్యే వ్యాపారులకు అడ్డుకట్ట పడనుంది. స్థిరాస్తి, బంగారు ఆభరణాల వ్యాపారులు ‘కచ్చితమైన ప్రతిఫలం’ అందిస్తామని ప్రకటిస్తే, వాటిని సామూహిక మదుపు పథకాలుగా ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 
స్థిరాస్తి అభివృద్ధి సంస్థ కనుక, కొనుగోలుదార్లకు సదరు ఆస్తిని బదలాయించే వరకు ‘స్థిర ప్రతిఫలం అందిస్తామనే’ హామీపై నగదు వసూలు చేస్తే, వాటిని ‘అనియంత్రిత డిపాజిట్లు’గా పరిగణించనున్నారు. ఎక్కువమంది స్థిరాస్తి వ్యాపారులు 9-14 శాతం మొత్తం ప్రతిఫలం ఇస్తామని చెబుతూ, డిపాజిట్‌ రూపేణ నగదు జమ చేసుకుంటున్నారు. మరికొందరు అభివృద్ధిదారులు కూడా కనీసం 10 నెలల పాటు వాయిదాల్లో నగదు చెల్లించాలని కోరుతున్నారు. అనంతరం, డిపాజిట్ల కాలావధికి అనుగుణంగా, నెలవారీ మొత్తంపై 50 శాతం వరకు రాయితీ ఇస్తున్నారు. ఇవన్నీ అనియంత్రిత డిపాజిట్ల కిందకే వస్తాయి. అధిక కేసుల్లో స్థిరాస్తి అభివృద్ధి దారులు ప్రారంభంలో కొన్ని నెలల వాయిదాలు చెల్లిస్తారు. అనంతరం వారు చెల్లింపులు ఆపేస్తారు. ఇలాంటివి చట్టం ద్వారా నియంత్రించాల్సి ఉంది. 
ఇదేవిధంగా ఆభరణాల విక్రేతలు కూడా ‘11 నెలల పాటు నెలసరి వాయిదాలు చెల్లించండి, 12న వాయిదాను మా సంస్థ జమచేస్తుంది. ఈ 12 నెలల మొత్తాన్ని వినియోగించుకుని, మా విక్రయశాలోనే ఆభరణాలు కొనుగోలు చేసుకోవచ్చు’ అని ప్రకటిస్తున్నాయి. 
ఈ రెండు రకాల డిపాజిట్లు ‘అనియంత్రిత డిపాజిట్ల నిషేధ బిల్‌-2018’ పరిధిలోకి రానున్నాయి. మార్చి 5న ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశ పెట్టనున్నారు. మోసపూరిత సామూహిక మదుపు పథకాలపై ఉక్కుపాదం మోపడమే ఈ బిల్లు లక్ష్యం. నియంత్రణ, అనియంత్రణ పద్ధతుల్లో డిపాజిట్లు వసూలు చేసేవారంతా, సంబంధిత అధీకృత అధికారి వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేయకుండా పథకాల రూపేణ నగదు వసూలు చేస్తే, ఏడేళ్ల జైలు శిక్ష విధించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం లభించింది.


No comments:

Post a Comment