న్యూదిల్లీ: పాకిస్థాన్ చేతికి చైనా నుంచి ప్రమాదకరమైన ఒక ఆయుధం అందినట్లు భారత నిఘా వర్గాలు ధ్రువీకరించాయి. చైనాకు చెందిన వింగ్‌లూంగ్-1 అనే ఆయుధ డ్రోన్ ఒకటి పాకిస్థాన్‌కు చెందిన ఎంఎం ఆలమ్ వాయుసేన స్థావరంలో ఉన్నట్లు నిఘావర్గాలు నిర్ధరించుకున్నాయి. ఈ మానవ రహిత విమానం ద్వార 100 కిలోలబరువైన బాంబులు, క్షిపణులను ప్రయోగించవచ్చు. 20 గంటలపాటు 5000 కిలోమీటర్ల మేరకు ప్రయాణించగలదు. దీంతో భారత రాడార్లు అప్రమత్తమయ్యాయి.
2017 నవంబర్‌లో ఎంఎం ఆలమ్ ఎయిర్‌పోర్టును ఒక ఉపగ్రహం చిత్రీకరించింది. ఈ సందర్భంగా అక్కడ నిలిపిఉన్న వింగ్‌లూంగ్ డ్రోన్‌ను కూడా చిత్రీకరించింది. ఈ చిత్రాన్ని అమెరికాకు చెందిన బార్డ్ కాలేజ్‌లోని డ్రోన్ అధ్యయన కేంద్రం విశ్లేషించింది. దాదాపు 14మీటర్ల పొడవున్న రెక్కలు.. వీఆకారంలోని తోక ప్రపంచంలో వింగ్ లూంగ్-1 డ్రోన్లకు తప్ప మరే ఇతర డ్రోన్లకు లేదు. 2016లో ఒక వింగ్‌లూంగ్ డ్రోన్ ఒకటి ఆలమ్ స్థావరం వద్ద కూలిపోయింది. దీంతో చైనాడ్రోన్లను పాక్ వినియోగిస్తున్నట్లు నిర్ధరించుకున్నారు.
చైనా అండతో పాకిస్థాన్ మూడు రకాల డ్రోన్లను వినియోగిస్తోంది. ఫాల్కో, షాఫార్, బుర్రాక్ శ్రేణి డ్రోన్లను వాడుతోంది. వీటిలో బుర్రాక్ డ్రోన్లు దాడులు కూడా చేయగలవు. ప్రస్తుతం చైనా ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారు. చైనా వద్ద వింగ్ లూంగ్-1, వింగ్‌లూంగ్-2, డబ్ల్యూజే-600ఏడీ, యాంగ్ క్లౌడ్ షాడో, రెయిన్‌బో వంటి డ్రోన్లు ఉన్నాయి.
మరోపక్క భారత్ కూడా ఆయుధ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అమెరికాకు చెందిన ప్రిడేటర్లు, రేపర్ల కోసం బేరసారాలను నిర్వహిస్తోంది. మరోపక్క నిఘా కోసం ఇజ్రాయిల్‌కు చెందిన హెరాన్లను వినియోగిస్తోంది
No comments:
Post a Comment