ఇది నా చెల్లి సమస్య. బీటెక్ రెండో ఏడాది హాస్టల్‌లో ఉండి చదువుతోంది. ఈ మధ్య ఇంటికి వచ్చినప్పుడు అనుకోకుండా తన ఫోను తీసుకున్నా. అన్నీ అభ్యంతరకరమైన సందేశాలూ, చిత్రాలే కనిపించాయి. అబ్బాయిలు మాత్రమే వాటిని చూస్తారని అనుకునే నేను తన ఫోన్‌చూసి ఒక్కసారి షాకయ్యా. తనెందుకు వాటికి అలవాటు పడిందో అర్థం కాలేదు. పైగా అమ్మానాన్నలకు ఈ విషయం చెప్పలేను. ఎందుకంటే వారు తను ఎంతో ఉన్నతంగా చదువుతోందని ఉద్యోగం చేసి తమ పేరు నిలబెడుతుందని ఆశలు పెంచుకున్నారు. అడిగితే నాతో గొడవ పెట్టుకుంది. తన మీద అభాండాలు వేస్తున్నాని చెబుతూ ఆ ఫోన్‌లోవన్నీ తీసేసింది. వెంటనే కాలేజీలో వచ్చేయమన్నారంటూ వెళ్లిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి.
అమ్మానాన్నలకు మీరు చెప్పలేకపోవడాన్ని అర్థం చేసుకోగలను. మీ చెల్లి తన విషయం బయటపడిందనీ, గొడవ పడి హాస్టల్‌కి వెళ్లిపోయిందని మీ ఉత్తరం ద్వారా అర్థమవుతుంది. అయితే కొన్ని రోజులాగి సందర్భాన్ని కల్పించుకునైనా, తనతో అనునయంగా మాట్లాడండి. టీనేజీలో శారీరకంగా, మానసికంగా ఎదురయ్యే మార్పులూ, లైంగిక విషయాలపై కలిగే తీవ్రమైన ఆసక్తి, దారి తీసే పరిస్థితులను గురించి అర్థమయ్యేలా చెప్పండి. మీరు చెప్పలేకపోయినా వారికి దగ్గరగా ఉండే ఎవరితోనైనా చెప్పించే ప్రయత్నం చేయండి. అలాగే ఆమెకు హాస్టల్‌లో స్నేహితులు ఉన్నారా? వారితో ఏ విధంగా వ్యవహరిస్తోందన్న విషయాలూ తెలుసుకోవడం తప్పనిసరి. కొన్నిసార్లు వారిలోని అభద్రతా, ఆత్మనూన్యతా, ఒంటరితనం వంటివన్నీ ఈ పరిస్థితికి కారణం అవుతాయి. వీటికి వయసుతో పాటు వచ్చే హార్మోన్ల హెచ్చుతగ్గులూ, స్నేహితుల ప్రభావం తోడవుతాయి. అందువల్లే మేం కూడా చేస్తే తప్పేంటని అనుకుంటారు. స్నేహితులే కారణమే అయితే, మంచి ఆలోచనలు, లక్ష్యాలున్న వారితో సాన్నిహిత్యం పెంపొందించుకునేలా చూడండి. అవసరమైతే ఈ సమయంలో అధ్యాపకుల సాయమూ తీసుకోండి. అలాగే ఒంటరితనమే ఈ పరిస్థితికి కారణమైతే, సామాజిక చొరవను పెంపొందించుకునేలా సాయం చేయండి. మంచి స్నేహితురాళ్లని ఏర్పరుచుకోవడం వల్ల ఇంతకంటే ఎక్కువ సరదాలూ, సంతోషాలు ఉంటాయని నచ్చచెప్పేందుకు ప్రయత్నించండి. అదే సమయంలో తల్లిదండ్రులకూ సున్నితంగా మీరీ విషయాన్ని తెలియజేయండి. అయినా ఆమెలో మార్పు రాకపోతే గనుక మానసిక నిపుణుల సాయం తీసుకోండి.
- ఓ సోదరి

No comments:
Post a Comment