Monday, 29 January 2018

ముప్ఫై ఏళ్లుగా ఆయన రూపాయి డాక్టరే!

గిరిజన ప్రాంతాల్లో అరకొర వైద్యసదుపాయాలు చదువుకునే రోజుల్నుంచే ఆయన్ను బాధించేవి. దానికోసమే డాక్టర్‌ పట్టా అందుకున్నది మొదలు, ముప్ఫై ఏళ్లుగా మహారాష్ట్ర మారుమూల పల్లెల్లో వైద్యం అందిస్తూ రూపాయి డాక్టర్‌గా పేరు పొందారు రవీంద్ర కోల్హే. ఎంబీబీఎస్‌ తర్వాత ఇంకా పెద్ద చదువు చదివినా, అక్కడే వైద్య సేవలు అందించేలా తన భార్యాపిల్లల్లో స్ఫూర్తి నింపినా అదంతా గిరిపుత్రుల పట్ల ఆయనకున్న ప్రేమకు తార్కాణమే. 


దాదాపు ముప్ఫై ఏళ్ల కిందట నాగ్‌పుర్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్న రవీంద్ర కొల్హే కోర్సులో భాగంగా ఓ మారుమూల పల్లెలో ఏడాదిన్నరపాటు పనిచేశారు. అదే ఆయన జీవితం మరోలా మలుపు తిరగడానికి కారణమైంది. ఆ ఊరే మహారాష్ట్రలోని టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతమైన మెల్ఘాట్‌లో బైరాఘర్‌ అనే చిన్న గ్రామం. ప్రపంచానికి దూరంగా విసిరేసినట్లుండే ఈ ప్రాంతంలోనే వైద్యుడిగా స్థిరపడాలనుకున్నారు రవీంద్ర. 1989లో కోర్సు పూర్తయిన వెంటనే బైరాఘర్‌ గ్రామంలో ఒక చిన్న క్లినిక్‌ని ప్రారంభించారు. మెల్ఘాట్‌ పరిధిలో ఉన్న మూడొందల గ్రామాలకూ ఇదొక్కటే ఆసుపత్రి. కొత్త వ్యక్తి కావడంతో మొదట్లో రవీంద్రని చూసి వాళ్లు భయపడి పారిపోయేవారట. వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకున్న రవీంద్రే మెల్లిమెల్లిగా వారిలో నమ్మకాన్ని కలిగించారు. ఇప్పుడా గ్రామాల వారికి ఆయనే మార్గదర్శీ, గురువూ కూడా. వైద్యమైతే ఉచితంగా అందిస్తున్నారు కానీ, స్కానింగులూ, ఎక్స్‌రేలూ లాంటి వాటి కోసం రోజూ 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణానికి వెళ్లిరావల్సి వచ్చేది. దీన్ని గమనించిన రవీంద్ర ఎండీ కోర్సు పూర్తిచేయడం ద్వారా ఒక పరిష్కారాన్ని కనుక్కొన్నారు. ఈ ఆసుపత్రికి మొదటిసారి వచ్చిన వారి నుంచి రెండు రూపాయలూ, ఆ తర్వాత నుంచీ కేవలం ఒక్క రూపాయీ ఫీజుగా తీసుకుంటారు.

ఆ రిపోర్టే కారణం 
రవీంద్ర ఎండీ కోర్సు చేస్తున్న సమయంలోనే మెల్ఘాట్‌లో గిరిజనుల ప్రధాన శత్రువైన పోషకాహారలోపంమీద ఒక నివేదికను తయారు చేశారు. పోషకాహారలోపం, న్యూమోనియా, మలేరియాలాంటి వాటికే సరైన వైద్యం అందక ఇక్కడ ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని దానిలో పేర్కొన్నారు. పంటల సమయంలో తప్ప మిగతా ఏడాదంతా తిండి దొరక్కపోవడం వీరి జీవితాలను ఛిద్రం చేస్తోందని తెలిపారు. బీబీసీ రేడియో ఈ విషయాన్ని ప్రసారం చేసింది. దాంతో ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

వైద్యుడి వ్యవసాయం...
మెల్ఘాట్‌ ప్రాంత గిరిజనుల జీవన ప్రమాణాలు పెరగాలంటే వ్యవసాయమే సరైన మార్గమని భావించి, ఆధునిక వ్యవసాయం ఎలా చేయాలో నేర్చుకోవాలనుకున్నారు. అందుకోసం పంజాబ్‌లోని కృషీ విద్యాపీఠ్‌లో అగ్రికల్చరల్‌ కోర్సు పూర్తి చేశారు. రవీంద్ర నేర్పిన సరికొత్త వ్యవసాయంతో తమ అవసరాలు తీర్చుకోగా మిగిలిన ఉత్పత్తులను అమ్మే స్థాయికి గిరిజనులు చేరుకున్నారు. దీంతో వారి జీవన ప్రమాణస్థాయీ పెరిగింది. ఫలితంగా మొదట్లో 200గా ఉండే శిశుమరణాల రేటు ఇప్పుడు 60కి చేరింది.
అవార్డుతో థియేటర్‌
రవీంద్ర సేవలను గుర్తించిన లోక్‌మత్‌ దినపత్రిక 2011లో లోక్‌మత్‌ మహరాష్ట్రియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుతోపాటు రూ.15 లక్షల నగదునీ అందించింది. దానితోనే మొదటి ఆపరేషన్‌ థియేటర్‌ నిర్మించాడు. ఇక్కడ కంటి సమస్యలు అధికంగా ఉండటంతో తన స్నేహితుడితో కలిసి కంటి ఆసుపత్రిని ప్రారంభించారు.

కుటుంబమంతా....
రవీంద్ర ఎండీ చేస్తున్న సమయంలోనే నాగ్‌పుర్‌కి చెందిన డాక్టర్‌ స్మితను ఇష్టపడ్డారు. అయితే, పెళ్లికి ముందే తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఆమెకు స్పష్టం చేశారు. స్మితకి కూడా ఇది నచ్చడంతో లక్షలు అందిస్తున్న ఉద్యోగాన్ని వదిలి, నెలకు కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే సంపాదించే రవీంద్ర వెంటనడిచారు. అంతేకాదు, వారి పెద్ద కుమారుడు రోహిత్‌ అగ్రికల్చరల్‌ కోర్సు పూర్తిచేసి అదే ఊరిలో గిరిజనులతో కలిసి వ్యవసాయం చేస్తూ, వారికి మెలకువలు నేర్పుతున్నాడు. ఇక, ఎంబీబీఎస్‌ చదువుతున్న రెండో అబ్బాయి కోర్సు పూర్తయ్యాక ఆ ఆసుపత్రిలోనే సర్జన్‌గా సేవలందించనున్నాడు.
ఒక్క అడుగు చాలు...
ఇప్పుడిప్పుడే ఈయన్ను ఆదర్శంగా తీసుకుంటున్న మూడొందల గ్రామాల యువతా ఆయన అడుగుజాడల్లో నడక సాగిస్తోంది. రవీంద్ర పిలుపు మేరకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, యూత్‌ క్యాంపుల్లాంటి కార్యక్రమాల్లో మెల్ఘాట్‌తోపాటు ఇతర ప్రాంతాలకు చెందినవారూ పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. మెల్ఘాట్‌లోని ప్రస్తుత ఆసుపత్రిని అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దడమే కాకుండా, గిరిజన యువతను సర్కారు కొలువులు అందుకునేలా సంసిద్ధం చేసేందుకు ఉచితంగా కోచింగ్‌ సెంటర్లను ఏర్పరచడమే ప్రస్తుతం తన ముందున్న లక్ష్యాలంటున్నారు రవీంద్ర.

No comments:

Post a Comment