Saturday, 17 February 2018

నా పేరు నరేంద్రమోదీ..! ప్రధాని కాదు ప్రొఫెసర్‌

నా పేరు నరేంద్రమోదీ..!
                                  ప్రధాని కాదు ప్రొఫెసర్‌

ఔరంగాబాద్‌: సాధారణ వ్యక్తుల పేర్లు సెలబ్రిటీ పేర్లతో పోలి ఉంటే వారిని కాస్త ప్రత్యేకంగా చూస్తుంటారు. అదే ఓ సాధారణ వ్యక్తి పేరు మన ప్రధాని నరేంద్ర మోదీ పేరే అయితే..? మరింత ప్రత్యేకంగా ఉంటుంది కదూ. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ నగరానికి చెందిన ఓ వ్యక్తి పేరు ‘నరేంద్ర మోదీ’. ఈ పేరుతో అతను ఎక్కడికి వెళ్లినా పాపులర్‌ అయిపోతున్నాడు. ఎంతగా అంటే ఏదన్నా ఆలయానికి వెళ్తే ఇతని పేరు తెలుసుకుని నిజంగానే ప్రధాని నరేంద్రమోదీ వచ్చారనుకుని పొరబడుతున్నారట.
‘40 ఏళ్ల క్రితం నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు నరేంద్ర చంద్రకాంత్‌ మోదీ. 20 ఏళ్ల క్రితం గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఎన్నికైనప్పటి నుంచి నాకు గుర్తింపు దక్కింది. ఔరంగాబాద్‌లోని బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. ఎక్కడికి వెళ్లినా ప్రజలు నన్ను ‘నమో’ అని పిలుస్తుంటారు. ఎవరైనా నా పేరు అడిగినప్పుడు ‘నరేంద్ర మోదీ’ అని చెబితే అసలు నమ్మేవారు కాదు. ఇలాంటి సందర్భాల్లో కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది కూడా. ఒక్కోసారి నా పేరు నరేంద్రమోదీ అని నిరూపించుకోవడానికి ఐడీ చూపించాల్సి వచ్చేది.’
‘అంతేకాదు నా పేరుతో ఫేస్‌బుక్‌ ఖాతా తెరిస్తే దాన్ని డీయాక్టివేట్‌ చేసేశారు. ఇక ఆధార్‌ కార్డుకి నమోదు చేసుకునేటప్పుడు పెద్ద సమస్యే ఎదురైంది. నా పేరు నరేంద్రమోదీ అని చెబితే అధికారులు నమ్మలేదు. ఆధార్‌ కార్డు రావడానికి చాలా సమయం పట్టింది. పెద్ద నోట్లు రద్దైనప్పుడు నా భార్య కొత్త నోట్ల కోసం బ్యాంక్‌కు వెళ్లింది. అక్కడి సిబ్బంది భర్త పేరు నరేంద్రమోదీ అని ఉండడం చూసి షాకయ్యారు.’
‘ఇక నా కూతురిని స్కూల్‌లో అందరూ ప్రధాని కూతురు వచ్చింది అంటూ ఆటపట్టిస్తుంటారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఔరంగాబాద్‌ వాసి పేరు ప్రధాని పేరు ఒకటే కావడంతో ఇక్కడి ప్రజలు గర్వపడటం మరోఎత్తు’ అని చెప్పుకొచ్చారు మోదీ.

థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ గురించి తెలుసా

వాహన సురక్ష
థర్డ్‌పార్టీ బీమా.. ఆదుకునే హస్తం
థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ గురించి చాలాసార్లు విన్నాం. దీని ఉపయోగాలేంటి? ఇది ఎందుకు అవసరం?


ప్రతి వాహనానికి బీమా తప్పనిసరి అనే నిబంధన ఉంది. అందులో ప్రధానమైంది థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌. వాహన యజమానిని ఫస్ట్‌ పార్టీ, బీమా కంపెనీని సెకండ్‌ పార్టీ అంటారు. వాహనానికి ఏ సంబంధం లేని బయటివారే థర్డ్‌ పార్టీ. ఈ బీమానే ‘ఎ’ పాలసీ లేదా ‘యాక్ట్‌ పాలసీ’ అంటారు. ఈ బీమా ఉన్న వాహనం ద్వారా ఏదైనా ప్రమాదం జరిగి.. ప్రమాదంలో వ్యక్తి గాయపడ్డా, మరణించినా, వస్తుసామగ్రి నష్టపోయినా పరిహారం దక్కుతుంది. అయితే వాహనంలో ప్రయాణించేవారికి జరిగే నష్టానికి ఎటువంటి పరిహారం అందదు. 
మామూలుగా థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ ప్రీమియం తక్కువే. టూవీలర్స్‌కి వందల్లో, నాలుగు చక్రాల వాహనానికి మూడు, నాలుగు వేల రూపాయలు మించదు. కానీ కొందరు డబ్బులు మిగుల్చుకునే ఉద్దేశంతో తక్కువ ప్రీమియం ఉన్న పాలసీ ఎంచుకుంటారు. ఇది సబబు కాదు. ఏదైనా ప్రమాదం జరిగి వస్తువులకు నష్టం జరిగితే బీమా కంపెనీల చట్టం నిర్దేశించినట్టుగా ఇలాంటి పాలసీలకు కేవలం ఆరువేల రూపాయలు మాత్రమే పరిహారం దక్కుతుంది. మిగతా నష్టాన్ని వాహనదారే భరించాలి. ప్రస్తుత గణాంకాల ప్రకారం ద్విచక్రవాహనదారులు యాభై నుంచి అరవైశాతం, నాలుగు చక్రాల వాహనదారులు ముప్పై నుంచి నలభైశాతం బీమా లేకుండానే వాహనాలు నడుపుతున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. పైగా థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ చేయించినట్లైతే మన కారణంగా ఎవరైనా ప్రమాదానికి గురైతే, చనిపోతే బీమా పరిహారం అందడంతో వారి కుటుంబాన్ని ఆ రకంగానైనా ఆదుకున్నామనే సంతృప్తి మిగులుతుంది. 

లక్ష రుణానికీ యక్ష ప్రశ్నలు ఖాతా తెరవాలన్నా ఇబ్బందే ఇంటి రుణానికీ ఇక్కట్లే! బ్యాంకుల నిబంధనలు సామాన్యులకేనా..!


లక్ష రుణానికీ యక్ష ప్రశ్నలు 
ఖాతా తెరవాలన్నా ఇబ్బందే ఇంటి రుణానికీ ఇక్కట్లే! 
బ్యాంకుల నిబంధనలు సామాన్యులకేనా..! 
గత 15 ఏళ్లలో దాదాపు రెండున్నర లక్షల మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో చాలామంది ఆత్మహత్యల వెనుక కారణం.. అప్పులే. 2015లో 3000 మంది రైతులు ఆత్యహత్య చేసుకోగా.. వీరిలో 80 శాతం మంది రుణాలు చెల్లించలేక తనువు చాలించినట్లు ఒక అధ్యయనం వెల్లడించింది కూడా. వీళ్లందరి సగటు రుణం రూ.2 లక్షల్లోపే. మరి నీరవ్‌ మోదీ విషయానికొస్తే.. 
రూ.11,000 కోట్లు పైబడిన రుణం. అది కూడా ఓ బ్యాంకును తప్పుదారి పట్టించి.. ఎగ్గొట్టేయడం.. దేశం విడిచిపారిపోవడం.. తలుచుకుంటేనే రక్తం మరిగిపోదూ...సామాన్యుడి కోణంలో ఆలోచించినప్పుడు నీరవ్‌ ఉదంతం మాత్రం కచ్చితంగా మన బ్యాంకింగ్‌ వ్యవస్థ లోటుపాట్లను తెలియజెప్పేదే..
మా అబ్బాయికి ఓ జాతీయ బ్యాంకులో ఖాతా ఉంది. హైదరాబాద్‌లో ఉండగా ఆ ఖాతా ప్రారంభించాడు. ఇప్పుడు మేం బెంగళూరు వచ్చేశాం. అక్కడి ఖాతాను బెంగళూరుకు మార్చి యాక్టివేట్‌ చేయించాలన్నది మా ఉద్దేశం. ఇందుకోసం బ్యాంకు చుట్టూ తిరగడం ఇప్పటికిది పన్నెండోసారి. ఈరోజు కూడా పని పూర్తవుతుందన్న నమ్మకం మాత్రం లేదు. అన్ని డాక్యుమెంట్లూ పట్టుకునే వెళ్లా. దానిమీద మా అబ్బాయి సంతకాలు కూడా ఉన్నాయి.. అయితేనేం.. అయిదుసార్తు తిప్పించుకున్న తర్వాత వాళ్లు చెప్పిన మాట ఏమిటంటే.. మీ అబ్బాయి రావాల్సిందేనని. వాడికి సెలవు దొరకడం లేదు.. అందుకే రాలేకపోతున్నాడు. నేను అతని తండ్రినే. కావాలంటే చూడండి అంటూ ఆధారాలు కూడా చూపించాను. నాకు పాస్‌బుక్‌, ఏటీఏం కార్డు... ఏదీ ఇవ్వొద్దు. కేవలం ఖాతా యాక్టివేట్‌ చేయండి చాలు. వీలు చూసుకుని మా అబ్బాయి వచ్చి వాటిని తీసుకెళ్తాడు అని భరోసా ఇచ్చా. పట్టించుకుంటేగా.. పొద్దున వెళితే సాయంత్రం రమ్మంటారు.. సాయంత్రం వెళ్తే.. రేపు రమ్మంటారు. వెళ్లినప్పుడల్లా అరగంట కూర్చోబెడుతున్నారు. మా అబ్బాయి రావాల్సిందేనంటున్నారు.. నేను డబ్బు కాజేసే రకం కానందుకేనేమో ఈ ఇబ్బందులు అనిపిస్తోంది.. నీరవ్‌ మోదీకి రూ.11,400 కోట్లు ఇచ్చే విషయంలో ఇలాంటి నిబంధనలన్నీ ఏమయ్యాయో...’
- ఓ సగటు ఖాతాదారు ఆవేదన..

అంటే బ్యాంకు అధికారులను నిబంధనలు ఉల్లంఘించమని కాదు. సామాన్యుల విషయంలో ఇంత కచ్చితంగా వ్యవహరించే బ్యాంకులు.. బడాబాబుల విషయానికొచ్చేసరికి.. ఎందుకు నీళ్లొదిలేస్తున్నారన్నది సామాన్యుడి ప్రశ్న. 
ఓ విజయ్‌ మాల్యా.. ఓ నీరవ్‌ మోదీ..నోట్ల రద్దు సమయంలో పెద్ద ఎత్తున దొరికిన కొత్త నగదు నిల్వలు.. వీటి గురించి విన్న సాధారణ ఖాతాదారులకు ఇలాంటి ఆవేదనే కలుగుతుంది... ఆ బాధలో కాస్త నిజం కూడా ఉందనిపిస్తుంది...
ప్రజాస్వామ్య దేశం.. ప్రజలే ప్రభువులు.. సామాన్యులకైనా.. అసామాన్యులకైనా.. నిబంధనలు ఒక్కటే... కానీ, కొంతమందికి ఇందులో కొన్ని సడలింపులు ఉంటున్నాయా..!!
బ్యాంకులో నగదు నిల్వ ఉంటుంది. అందులో నుంచి ఓ రూ.10వేలు తీసుకుందామంటే.. ఎక్కడా కుదరదు.. ఎన్ని ఏటీఎంలకు వెళ్లినా.. డబ్బే దొరకదు. బ్యాంకుకు వెళ్తే.. చాంతాండంత వరసలు. గట్టిగా రూ.20వేలు ఇవ్వాలంటే కూడా పాన్‌ కావాలి.. ఆధార్‌ కావాలంటూ ఆరాలు.. అదే.. బ్యాంకుకు కావాల్సిన వ్యక్తి రాగానే.. అడిగిన మొత్తం కట్టలుకట్టలుగా ఇచ్చేస్తుంటారు.. ఇక్కడ వారికి ఏ ‘రూలూ’ వర్తించదు.
సొంతిల్లు కలను నిజం చేసుకోవాలనుకొనే సగటు వేతన జీవి... గృహ రుణం కోసం వెళ్తాడు.. ఆస్తి విలువలో 80శాతం వరకూ వస్తుందని అనుకుంటారు.. కానీ, క్రెడిట్‌ స్కోరు.. రుణ చరిత్ర అంటూ మొదటే నిబంధనలు అడ్డుకుంటాయి.. పైగా ఇప్పటికి ఎన్నిసార్లు రుణం కోసం బ్యాంకులను అడిగారు.. ఏళ్ల తరబడి లెక్కలు... ఎప్పుడో ఏళ్ల క్రితం మనం మర్చిపోయిన క్రెడిట్‌ కార్డుకు రూ.100 బాకీ ఉన్నారు.. కాబట్టి, మీకు ఇప్పుడు రుణం ఇవ్వడం కుదరదు అంటూ.. ఓ వివరణ..
నిబంధనల మేరకు విద్యా రుణాలు దొరకవు.. రూ.4లక్షల్లోపు హామీ అక్కర్లేదని స్పష్టమైన ఉత్తర్వులున్నా.. ఏ బ్యాంకూ దాన్ని పట్టించుకోదు.. తనఖా లేకుంటే అప్పు పుట్టదు. ప్రభుత్వం ప్రకటించిన ‘ముద్ర’ అప్పు లభించడమూ కష్టమే.. ఏమన్నా అంటే.. ‘బ్యాంకుల విచక్షణ’, ప్రజల సొమ్ముకు భద్రత కల్పించడమే ప్రధాన లక్ష్యం అంటూ చెబుతుంటారు.. అర్హత లేకున్నా వేల కోట్ల రుణాలను ఇచ్చేప్పుడు ఈ నిబంధనలన్నీ ఎటు వెళ్తాయో బ్యాంకులకే తెలియాలి.
బ్యాంకు నిబంధనల మేరకు ఏదైనా రుణం తీసుకోవాలనుకున్నప్పుడు తనఖా పెట్టిన ఆస్తిని ఒకరు పరిశీలిస్తారు.. మరొకరు ధ్రువీకరిస్తారు. మధ్యలో ఎంతోమంది చేతుల నుంచి ఆ ప్రక్రియ ముందుకు వెళ్తుంది. చివరగా అన్నీ సరిగ్గా ఉన్నాయని తేలితేనే ఓ లక్ష రూపాయల రుణమైనా ఇస్తుంది. కానీ, కావాల్సిన వ్యక్తులు.. బడా పారిశ్రామికవేత్తలు.. కమీషన్లతో సిబ్బంది జేబులు నింపేందుకు వెనకాడని వారి విషయంలో ఈ పరిశీలనలూ.. ఇతర నిబంధనలూ ఓ ప్రహసనంగానే మారిపోతున్నాయన్నది సగటు వ్యక్తి ఆవేదన. ఒకే ఆస్తిపై రెండు బ్యాంకులు రుణాలు ఇవ్వడంలాంటి సంఘటనలు కూడా ఎన్నో..
ఇక సామాన్యుడికే రుణ చరిత్ర, క్రెడిట్‌ స్కోరులాంటి అడ్డంకులు.. అప్పటికే కోట్ల రూపాయలు బాకీ పడ్డా.. అవేవీ లెక్కలోకి తీసుకోకుండా.. కొత్తగా మరికొన్ని కోట్ల రూపాయలను ముట్టజెబుతూనే ఉంటాయి. ఇక్కడ ఏ స్కోరూ, చరిత్రా పరిశీలన జరగదా? జరిగినా.. బ్యాంకుల విచక్షణ.. అంటే.. కమీషన్లకు కక్కుర్తిపడ్డ ఓ ఉన్నతాధికారి లేదా అతన్ని ప్రభావితం చేసిన రాజకీయ నాయకుడి ఇష్టమేనా? చెప్పడం కష్టమే.
మానవీయ కోణాలను కూడా ప్రస్తుత బ్యాంకింగ్‌ వ్యవస్థ విస్మరిస్తోంది అనుకోవచ్చు. గతంలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా.. ఎలాంటి మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చినా బ్యాంకుకు వెళ్తే సరిపోయేది. యాంత్రీకరణ, డిజిటలీకరణ పెరిగిన నేపథ్యంలో బ్యాంకుకు వెళ్లినా.. వినియోగదారుల సేవాకేంద్రానికి ఫోన్‌ చేయడం మినహా వేరే మార్గం లేదు. నగదు రహిత బ్యాంకింగ్‌ వ్యవస్థలో వస్తున్న విప్లవాత్మక మార్పులు సామాన్యులను ‘భౌతిక’ బ్యాంకింగ్‌ వ్యవస్థకు దూరం చేస్తున్నాయనే భావించవచ్చు. సిబ్బందిని తగ్గించుకునే ప్రయత్నంలో బ్యాంకులు చేస్తున్న ప్రయత్నాలు.. ఎంతో మంది సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నాయనే స్వరాలు గట్టిగానే వినిపిస్తున్నాయి..
ఇతర వ్యాపారాలపై దృష్టి పెట్టి..: ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం.. వాటిని అవసరమైన వారికి రుణంగా ఇచ్చి, వడ్డీ వసూలు చేయడం.. సాధారణంగా బ్యాంకు ప్రాథమిక వ్యాపారం ఇదే.. కానీ, మారుతున్న పరిస్థితుల్లో బ్యాంకు కేవలం ఈ ఒక్కదానితోనే సంతృప్తి చెందడం లేదు.. బ్యాంకస్యూరెన్స్‌ పేరుతో అందిస్తోన్న బీమా పాలసీల విక్రయాలు బ్యాంకులకు ఇప్పుడు భారీ వ్యాపారం అయ్యింది. కచ్చితంగా ఇన్ని బీమా పాలసీలు అమ్మాల్సిందే అంటూ సిబ్బందికి లక్ష్యాలు విధిస్తున్నారు.. ఇక్కడే అవినీతికి బీజం పడుతోంది.. రూ.5లక్షలకు ఓ పాలసీ తీసుకోండి... రూ.25లక్షల రుణం ఇచ్చేస్తాం అంటూ కొత్త ‘ఆఫర్లు’ పుట్టుకొస్తున్నాయి. అంటే, బీమా తీసుకొని, తొలి ప్రీమియం చెల్లిస్తే చాలు.. మీ పత్రాలు కాస్త అటూఇటూగా ఉన్నా.. బ్యాంకు పెద్దగా పట్టించుకోదన్నమాట. రుణాల వసూలు కన్నా.. ప్రీమియాల వసూలుపైనే బ్యాంకు దృష్టి ఎక్కువగా పెడుతుండటంతో పారు బాకీలు పేరుకుపోయినా పట్టించుకోవడం లేదు.
రుసుములు వసూలు చేస్తూ...
బ్యాంకు ఖాతాలో కనీస నిల్వ ఉంచాల్సిందే. లేకపోతే రుసుములు భరించాలి.. అతి పెద్ద జాతీయ బ్యాంకు కనీస నిల్వ నిర్వహించని ఖాతాదారుల దగ్గర్నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ దాదాపు రూ.1,771 కోట్లను రుసుముగా వసూలు చేసింది. మిగతా బ్యాంకులు వసూలు చేసినవీ పెద్ద మొత్తంలోనే ఉంటాయి.
నమ్మకమైన పునాదిపై ఏర్పడిన బ్యాంకింగ్‌ వ్యవస్థ.. ఇప్పటికే సాధారణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతోందని తాజాగా ఎన్నో ఘటనలు గుర్తు చేస్తున్నాయి. ఇవి మున్ముందూ కొనసాగితే.. బ్యాంకులపై ప్రజలకు ఉండే నమ్మకం పోతే.. ఆర్థిక వ్యవస్థకూ ఇది పెద్ద శరాఘాతమే!

*రంగంలోకి సెబీ, ఎక్స్ఛేంజీలు
రూ.11,400 కోట్ల కుంభకోణానికి సంబంధించి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, గీతాంజలి జెమ్స్‌ల ప్రమేయంపై సెబీ దర్యాప్తును ప్రారంభించింది. ట్రేడింగ్‌ లావాదేవీలను, వెల్లడి వివరాలను పరిశీలిస్తోంది. నీరవ్‌ మోదీతో సంబంధమున్న అన్ని సంస్థల స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ లావాదేవీలను విశ్లేషించే పనిని సెబీ, ఎక్స్ఛేంజీలు మొదలుపెట్టాయి. మరోవైపు మెహుల్‌ చోక్సి, ఆయన సంస్థ గీతాంజలి జెమ్స్‌ ఏమైనా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డాయా అనే విషయాన్ని కూడా సెబీ, ఎక్స్ఛేంజీలు దర్యాప్తు చేస్తున్నాయి.
తగిన చర్యలు తీసుకుంటాం: ఆర్‌బీఐ
పీఎన్‌బీలో నియంత్రణ వ్యవస్థల పరిశీలనను ఇప్పటికే ప్రారంభించామని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది. పరిశీలన అనంతరం తగువిధంగా చర్యలు చేపడతామని పేర్కొంది. మరోవైపు ఇతర బ్యాంకులకు జారీ చేసిన ఎల్‌ఓయూల ప్రకారం అవి ఇచ్చిన రుణాలకు నిధులు సర్దుబాటు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లు వస్తోన్న వార్తలను ఆర్‌బీఐ ఖండించింది.
నేడు బ్యాంకర్ల సంఘం భేటీ
పీఎన్‌బీలో వెలుగుచూసిన రూ.11,400 కోట్ల కుంభకోణంపై చర్చించేందుకు ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) నేడు సమావేశం కానుంది. ఇంతకుమునుపు పీఎన్‌బీకి మేనేజింగ్‌ డైరెక్టరుగా ఉన్న ఉషా అనంతసుబ్రమణియన్‌ ప్రస్తుతం ఐబీఏకు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తుండటం గమనార్హం. అలాగే ఈమె అలహాబాద్‌ బ్యాంక్‌కు ఎండీగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పీఎన్‌బీ కొన్ని ఎల్‌ఓయూలను అలహాబాద్‌ బ్యాంక్‌కు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎలాంటి మోసాలు జరగకుండా వ్యవస్థల పటిష్ఠంపై సమీక్ష నిర్వహించాలని బ్యాంకులకు ఆర్థిక శాఖ సూచించింది. ఒకవేళ ఏమైనా లోపాలు గుర్తిస్తే, తగువిధంగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని తెలిపింది.
ఆడిటర్ల పాత్రపై ఐసీఏఐ కమిటీ ఏర్పాటు
పీఎన్‌బీ రూ.11,400 కోట్ల కుంభకోణంలో ఆడిటర్ల పాత్రపై చార్టెడ్‌ అకౌంటెంట్ల అత్యున్నత సంఘం ఐసీఏఐ (ద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా) దృష్టి సారించింది. ఇందుకు వివిధ దర్యాప్తు సంస్థల నుంచి సమాచారాన్ని సేకరిస్తోంది. అలాగే కుంభకోణానికి దారితీసిన పరిణామాలు, వ్యవస్థీకృత లోపాలను అధ్యయనం చేసేందుకు కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఆడిటర్ల తరపున ఏమైనా అవకతవకలు చోటుచేసుకున్నాయా అనే విషయాన్ని పరిశీలించనుంది. పీఎన్‌బీ కుంభకోణం వ్యవహారాన్ని సుమోటో కేసుగా స్వీకరించినట్లు ఐసీఏఐ ప్రెసిడెంట్‌ నవీన్‌.ఎన్‌.డి.గుప్తా తెలిపారు.
150
డొల్ల కంపెనీలకు నీరవ్‌తో సంబంధం
నీరవ్‌ మోదీ, అతని సంబంధీకులతో 150 డొల్ల కంపెనీలకు సంబంధం ఉందని ప్రభుత్వ దర్యాప్తులో తేలింది. కార్పొరేట్‌ వ్యహారాల మంత్రిత్వ శాఖ ఆ మేరకు వెల్లడించింది. దర్యాప్తు సంస్థలు, ఆదాయ పన్ను అధికారుల దర్యాప్తుతో పాటు ఈ మంత్రిత్వ శాఖ కూడా దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. వ్యాపార కార్యకలాపాలు పెద్దగా లేనప్పటికీ కేవలం చట్టవ్యతిరేకంగా లావాదేవీలను జరపడం కోసం ఈ డొల్ల కంపెనీలకు ఉపయోగించుకుంటుంటారు.

Friday, 16 February 2018

వృథా నుంచి అదిరే దుస్తులు..

వృథా నుంచి అదిరే దుస్తులు..

కుర్తా... చొక్కా... లెహెంగా... అనార్కలీ... ఇలా ఏవి కుట్టినా.. ఎంతో కొంత వస్త్రం వృథా అయి చెత్తలోకి వెళ్తుంది. ఇంకా చెప్పాలంటే భారత్‌, చైనా, బంగ్లాదేశ్‌ కలిపి... దుస్తులు తయారు చేసే కంపెనీలన్నింటి నుంచీ ఏటా దాదాపు 80 బిలియన్‌ చదరపు మీటర్ల వస్త్రం వృథాగా మారుతోందట. ఇదంతా బయట చెత్త కుప్పలా పేరుకుపోయేదే. ఆ చెత్తనే మళ్లీ డిజైను చేసి ఏకంగా ఒక కొత్త బ్రాండ్‌ సృష్టించింది  కృతీ తుల. అంతేనా... ఆ దుస్తులను ల్యాక్మే ఫ్యాషన్‌ వీక్‌లోనూ ప్రదర్శించింది. వ్యాపార శిశువుగా ఉన్న తన సంస్థ అక్కడిదాకా చేరడానికి ఆమె చేసిన ప్రయాణం, ప్రయత్నం గురించి  ఇలా చెప్పుకొచ్చింది. 


పెద్ద పెద్ద సంస్థలు ప్రింట్లలో చిన్న తప్పులు దొర్లాయనీ, లేదంటే చిన్న రంధ్రాలున్నాయని 0.09 శాతం, కటింగుల్లో తేడాలొచ్చి 16.37 శాతం వస్త్రాన్ని పక్కన పెట్టేస్తాయి. దాంతోపాటే కొత్తగా ఆర్డర్లు రావచ్చని అవసరానికి మించి 5-10 శాతం అదనంగా దుస్తుల్ని సిద్ధం చేసుకుంటారు. ఒకవేళ ఆ ఆర్డరు రాకపోతే అవి నిరుపయోగమే. ఇంతకముందు కొన్ని ప్రింటింగ్‌ యూనిట్లలో, వస్త్ర పరిశ్రమల్లో ఉద్యోగం చేసినప్పుడు ఇదంతా ప్రత్యక్షంగా చూశా. ఒక షర్ట్‌ కుట్టాలంటే దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఫ్యాబ్రిక్‌ను ఎంచుకుంటాం. కానీ మనకు కావల్సింది కట్‌షర్ట్‌. అంటే దాదాపు మొత్తం వస్త్రం పరిమాణంలో ఇరవై శాతం అక్కడే వృథా అవుతుంది. అలాంటి షర్టులు రోజుకు లెక్కలేనన్ని తయారుచేస్తారు. ఇవే నా వ్యాపార ఆలోచనకు ఊతమిచ్చాయి. మాది దిల్లీ. పైగా నా చదువులు కూడా డిజైనింగ్‌కు సంబంధించినవే కావడంతో ఈ రంగంలోకి రావడం సులువైంది. నేను వేసుకున్న ఆ లెక్కలూ, పర్యావరణానికి మేలు చేయాలనే ఆలోచనలు.. నన్ను ఇటువైపు నడిపించాయి.

మళ్లీ చదివా...
ఆలోచన రాగానే సరిపోదు. దాన్ని ఆచరణలో ఎలా పెట్టాలో తెలుసుకోవడం ముఖ్యం. అసలు ఏ కంపెనీలకు వెళ్లాలి...? నా ఆలోచన ఎవరికి చెప్పాలన్న విషయం మొదట్లో నాకొక చిక్కుముడి. 2012లో నేను బ్రాండ్‌ పేరును డూడ్‌లేజ్‌గా రిజిస్టర్‌ చేయించా. కానీ.. నా పనులేవీ అంత సులువుగా మొదలుకాలేదు. కంపెనీలకు వెళ్లి.. మీ దగ్గర మిగిలిపోయిన వస్త్రం ఇవ్వమంటే సులువుగా ఇచ్చేయరు కదా.. వాళ్లకి నా ఆలోచన గురించి చెప్పి ఒప్పించడం పెద్ద సమస్యే. కానీ, కొన్ని రోజులకు నా ఆలోచన అర్థమై మంచి స్పందనే వచ్చింది. అయితే, వృథా దుస్తులు సేకరించినా కూడా... ఎలాంటి డిజైన్‌లు తయారు చేయాలీ... అతుకుల బొంతలా కాకుండా ఆధునికంగా, ట్రెండీగా ఉండేలా కనిపించాలంటే ఎలా డిజైను చేయాలి.. ఇలా ఎన్నో రకాలుగా ఆలోచించేదాన్ని. వాటన్నింటికీ పరిష్కారం దొరకడానికి నాకు ఏకంగా రెండు సంవత్సరాలు పట్టింది. ఆ సమయంలో ఖాళీగా ఉండకుండా డిజైనింగ్‌లోనే ఎంఏ పూర్తి చేసేశా.  2014 కల్లా... చిన్న స్థాయి పరిశ్రమల నుంచి వృథాగా ఉన్న వస్త్రాల్ని సేకరించడం మొదలుపెట్టా. ఇప్పుడు మా దగ్గరున్న దుస్తుల్లో తొంభైశాతం అలా సేకరించిన వాటి నుంచి తయారైనవే. ఇక వీటిని మార్కెటింగ్‌ చేయడం మరో సమస్య. మొదట్లో తక్కువ సంఖ్యలో దుస్తులు తయారుచేయడంతో ప్రత్యేకంగా ఒక దుకాణం అయితే ప్రారంభించలేం. అందుకే దగ్గర్లో ఉన్న బ్రాండ్‌ స్టోర్లతో ఒప్పందం కుదుర్చుకున్నా. అక్కడ ఒక్కసారి కొనుగోలు చేసిన వాళ్లు... మా బ్రాండ్‌ దుస్తుల గురించి మళ్లీ అడిగేవారు. దాంతో ఆర్డర్లు ఎక్కువగా రావడం మొదలైంది. ఇలా క్రమంగా చాలా నగరాల్లో బ్రాండ్‌ స్టోర్లతో ఒప్పందం కుదుర్చుకుని వ్యాపారం విస్తరించా. ఇప్పుడు దేశం మొత్తం దాదాపు నలభై స్టోర్లలో మా దుస్తులు అమ్ముతున్నాం. హైదరాబాద్‌లోనూ అనానిమ్‌, ఓగాన్‌, తామర, ది ప్రాజెక్ట్‌ లాంటి స్టోర్లలో ఇవి అందుబాటులో ఉంటాయి.
వాటినీ ఉపయోగిస్తున్నాం...
మేం సేకరించిన వృథా నుంచి దుస్తులు తయారుచేశాక కూడా చాలా వస్త్రమే వృథా అయ్యేది. దాన్నలా వదిలేస్తే నేను అనుకున్న లక్ష్యం మధ్యలో మిగిలిపోయినట్లే. అందుకే అలా మిగిలిన వాటితో బ్యాగులూ, యాక్సెసరీలూ, స్టేషనరీ తయారుచేస్తున్నాం. ఒక్కటని కాదు.. ఏం చేయడానికి వీలుంటే అది తయారు చేయడమే నా, నాతో పనిచేసే వారి లక్ష్యంగా మారింది. మొదట్లో కేవలం అమ్మాయిల దుస్తులే తయారుచేసేవాళ్లం. ఇప్పుడు అబ్బాయిల కోసం కూడా ప్రత్యేక శ్రేణిని అందుబాటులో ఉంచుతున్నాం. చాలా సంస్థలు పర్యావరణానికి మేలు చేయాలనే ఉద్దేశంతో అనేక మార్గాలు అనుసరిస్తున్నాయి. సహజ రంగులు వాడటం, కాటన్‌కు ప్రత్యామ్నాయాలు కనుక్కోవడం, తొందరగా భూమిలో కలిసిపోయే వస్త్రావిష్కరణలు... ఇలా చాలా చేస్తున్నాయి. పూర్తిగా వృథా అనుకున్న వస్త్రాల ముక్కల నుంచి దుస్తులు తయారుచేస్తున్నది మాత్రం కొందరే. ఇదొక్కటే కాదు అరటీ, వెదురు పీచుతో తయారుచేసిన వస్త్రాన్నే ఎక్కువగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నాం.

ఎలా చేస్తామంటే...
మా దగ్గరికి పెద్ద మొత్తంలో ముడిసరుకు వచ్చి చేరుతుంది. వాటి నుంచి కాస్త ఒకే రకం, రంగులో ఉన్న వస్త్రాల్ని ఎంచుకోవడం కష్టమైన పనే.  వాటిని ఎంపిక చేశాక ఎలాంటి డిజైను రూపొందించొచ్చనేది చర్చిస్తాం. అవసరమైన వాటికి ఎంబ్రాయిడరీలూ, ప్యాచ్‌లు చేయిస్తాం.  మేం తయారు చేసే ఏ రెండు డ్రెస్సులు ఒకే రకంగా ఉండవు. అందుకే నా సంస్థ పేరు డూడ్‌లేజ్‌ అని ఎంపిక చేశా. మామూలుగా ఏ రెండు డూడుల్స్‌ ఒకేలా ఉండవు. కానీ వేటి ప్రత్యేకత వాటిదే. ఇదే మేం తయారుచేసే దుస్తులకూ వర్తిస్తుంది. ఆన్‌లైన్‌లోనూ వీటిని అందుబాటులో ఉంచితే ఎక్కువ మందిని చేరుకోవచ్చనే ఆలోచనతో ఈ మధ్యే వెబ్సైట్‌ను కూడా ప్రారంభించా. 1400 రూపాయల నుంచి 14000 రూపాయల వరకు యాక్సెసరీలూ, దుస్తులు అందుబాటులో ఉన్నాయి.
మా నాన్న బ్లేజర్‌తో మొదలు...
లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లోనూ మా దుస్తులను ప్రదర్శించే అవకాశం నాకు అనుకోకుండా వచ్చింది. ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేను. నా కష్టానికి వచ్చిన గుర్తింపది. నా ప్రయాణం మా నాన్నకు చాలా ఇష్టమైన ఒక లెదర్‌ బ్లేజర్‌తో ప్రారంభమైంది. అది ఆయన దాదాపు పది సంవత్సరాల నుంచి జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారు. ఇప్పుడాయనకు అది నప్పక.. వేసుకోలేక చాలా బాధ పడేవారు. దాన్ని నేను జాకెట్‌గా మార్చేసి వేసుకున్నా. అదే నేను మార్చిన మొదటి డ్రెస్‌. భవిష్యత్తులో ఒక వెడ్డింగ్‌ డ్రెస్‌ కూడా ఇలా మిగిలిన వస్త్రంతో తయారు చేయాలనేది నా కోరిక..!

Thursday, 15 February 2018

24గంటల విద్యుత్తు వద్దని ధర్నా

24గంటల విద్యుత్తు వద్దని ధర్నా

  ;రైతులకు అందిస్తున్న 24గంటల కరెంటు వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయంటూ వివిధ గ్రామాలకు చెందిన రైతు సంఘాల నాయకులు జనగామ.. సూర్యాపేట ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న రైతులు మాట్లాడుతూ 24గంటల కరెంటు కారణంగా బోరుబావులు పూర్తిగా ఎండిపోయాయని, మరికొన్ని రోజులు ఇదేవిధంగా జరిగితే తాగునీటి సమస్య ఏర్పడుతుందని తెలిపారు. ధర్నా కారణంగా రహదారిపై దాదాపు 2గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో టీమాస్‌ సభ్యులు, రైతు సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

కాపు కోటాకు 'తెలంగాణ పేరు ప్రస్తావనతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అభ్యంతరం గందరగోళం

కాపు కోటాకు 'తెలంగాణ పేరు ప్రస్తావనతో అభ్యంతరం 



కాపు కోటాకు అభ్యంతరం
కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన సిబ్బంది శాఖ
రిజర్వేషన్లు 50% మించరాదని సుప్రీం చెప్పిందని వెల్లడి
తెలంగాణ పేరు ప్రస్తావనతో గందరగోళం

కాపుల రిజర్వేషన్ల అంశానికి కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఒక బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల అభిప్రాయాన్ని కోరింది. వాటిలో సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) కూడా ఒకటి. దీనిపై డీఓపీటీ తాజాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ- రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పును గుర్తు చేసింది. 1992 నవంబరు 16న ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం- రిజర్వేషన్లు 50 శాతానికి మించటానికి లేదనీ, ఒకవేళ అంతకు మించి కల్పించాలంటే అందుకు బలమైన ప్రాతిపదికగానీ, అసాధారణ పరిస్థితులు గానీ  అవసరమని పేర్కొంది. అయితే తాజా బిల్లు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అలాంటి బలమైన ప్రాతిపాదికలు ఏమిటో స్పష్టం చేయలేదని అభిప్రాయపడింది. అలాగే రిజర్వేషన్లనేవి ఆయా వర్గాలకు ‘సముచిత రీతిలో’ కల్పించాలే తప్ప జనాభా ప్రాతిపదికన కాదన్న రాజ్యాంగ నిబంధనను సుప్రీంకోర్టు ప్రస్తావించిన అంశాన్నీ గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో కాపుల రిజర్వేషన్ల బిల్లుపై ఆమోద ముద్ర వేయాల్సిన అవసరం లేదని హోం శాఖ రాష్ట్రపతికి సూచించొచ్చని అభిప్రాయపడింది. మరోవైపు ఇదే లేఖలో- ఓబీసీల్లో ఉపవర్గీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దిల్లీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో ఒక కమిషన్‌ను నియమించిన విషయాన్ని కూడా డీఓపీటీ గుర్తు చేసింది. ఆ కమిషన్‌ ఓబీసీల ఉపవర్గీకరణ శాస్త్రీయంగా చేయటానికి అవసరమైన విధివిధానాలను, ఇతర ఏర్పాట్లను ఖరారు చేసే పనిలో ఉందని పేర్కొంది.

లేఖలో తెలంగాణ ప్రస్తావన!
కాపుల రిజర్వేషన్‌కు సంబంధించిన ఈ లేఖలో ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం’ అని ఉండాల్సిన చోట ‘తెలంగాణ ప్రభుత్వం’ అని అచ్చు కావటంతో కొంత గందరగోళం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం గత ఏప్రిల్‌లో ముస్లిం రిజర్వేషన్లను 4 శాతం నుంచి 12 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచే బిల్లును శాసనసభలో ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. ఇంతవరకు దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి సమాచారం తెలంగాణ ప్రభుత్వానికి అందలేదు. 
తెలంగాణ గురించి కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లిన అధికారులు..
తాజా లేఖ నేపథ్యంలో తెలంగాణలో ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుదలకు సంబంధించి కేంద్రం ఆమోదంపైనా అనిశ్చితి నెలకొంది. కాపు రిజర్వేషన్ల అంశంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి పంపిన లేఖలో కోటా 50 శాతానికి పెంచకూడదన్న సుప్రీం తీర్పునే ప్రస్తావించడం.. రిజర్వేషన్లకు జనాభా ప్రాతిపదిక కాదని అభిప్రాయపడడంతో ఇవే నిబంధనలతో తెలంగాణ విన్నపానికి కూడా విఘాతంగా తయారవ్వచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలు పరచడం.. ఆ రాష్ట్రాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూలులో చేర్చడం వంటి అంశాలను కూడా  కేంద్రానికి పంపిన లేఖలో వివరించామని తెలంగాణ అధికార వర్గాలు చెప్పాయి. ఈ లేఖలోని విషయాలను తెలంగాణ అధికారులు దిల్లీలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీనిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి స్పష్టత తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర అధికారులను, ఎంపీలను ఆదేశించినట్లు సమాచారం. 

హైపర్‌ ఆది లవ్‌ ప్రపోజల్‌..?

హైపర్‌ ఆది లవ్‌ ప్రపోజల్‌..?



 హైపర్‌ ఆది, బుల్లితెరపై తనదైన శైలిలో సంచులకొద్ది పంచులతో కమెడియన్‌గా రాణిస్తున్న నటుడు. కామెడీ షోలతో పాటు, పలు టీవీ కార్యక్రమాలతో బుల్లితెర అభిమానులను అలరిస్తాడు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు.  సినిమాల్లోను తనదైన మార్క్‌ పంచులను ఏమాత్రం తగ్గించట్లేదు. తాజగా వరుణ్‌ తేజ్‌, రాశీఖన్నా నటించిన తొలిప్రేమ సినిమాలోను అలరించాడు. పంచ్‌లతో కామెడీ చేశాడు.
రీసెంట్‌గా ఆది ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఓ అమ్మాయికి తన ప్రేమను తెలుపుతున్నట్లుగా చేయి పట్టుకొని ఉన్నాడు. ప్రేమికుల రోజు సందర్భంగా ఆఫోటో పెడుతూ  అందరికీ వాలంటైన్స్‌ డే.. స్ప్రెడ్‌ లవ్‌ అంటూ పోస్టు చేశాడు. అయితే అది నిజంగా జరిగింది కాదు. తొలిప్రేమ షూటింగ్‌లో ఉన్నప్పుడు అక్కడ ఓ అమ్మాయిని కలిసి లవర్‌ బాయ్‌లా స్టిల్‌ ఇచ్చాడు. ఇప్పుడు అది కాస్తా సోషల్‌ మీడియా వైరల్‌ అయింది. దీంతో ఫాలోవర్స్‌ అందరూ ఆదికి పంచ్‌లతో పాటు ప్రేమించడం, ప్రపోజ్‌ చేయడం కూడా వచ్చే అంటూ కామెంట్‌ చేస్తున్నారు.