Friday, 16 February 2018

వృథా నుంచి అదిరే దుస్తులు..

వృథా నుంచి అదిరే దుస్తులు..

కుర్తా... చొక్కా... లెహెంగా... అనార్కలీ... ఇలా ఏవి కుట్టినా.. ఎంతో కొంత వస్త్రం వృథా అయి చెత్తలోకి వెళ్తుంది. ఇంకా చెప్పాలంటే భారత్‌, చైనా, బంగ్లాదేశ్‌ కలిపి... దుస్తులు తయారు చేసే కంపెనీలన్నింటి నుంచీ ఏటా దాదాపు 80 బిలియన్‌ చదరపు మీటర్ల వస్త్రం వృథాగా మారుతోందట. ఇదంతా బయట చెత్త కుప్పలా పేరుకుపోయేదే. ఆ చెత్తనే మళ్లీ డిజైను చేసి ఏకంగా ఒక కొత్త బ్రాండ్‌ సృష్టించింది  కృతీ తుల. అంతేనా... ఆ దుస్తులను ల్యాక్మే ఫ్యాషన్‌ వీక్‌లోనూ ప్రదర్శించింది. వ్యాపార శిశువుగా ఉన్న తన సంస్థ అక్కడిదాకా చేరడానికి ఆమె చేసిన ప్రయాణం, ప్రయత్నం గురించి  ఇలా చెప్పుకొచ్చింది. 


పెద్ద పెద్ద సంస్థలు ప్రింట్లలో చిన్న తప్పులు దొర్లాయనీ, లేదంటే చిన్న రంధ్రాలున్నాయని 0.09 శాతం, కటింగుల్లో తేడాలొచ్చి 16.37 శాతం వస్త్రాన్ని పక్కన పెట్టేస్తాయి. దాంతోపాటే కొత్తగా ఆర్డర్లు రావచ్చని అవసరానికి మించి 5-10 శాతం అదనంగా దుస్తుల్ని సిద్ధం చేసుకుంటారు. ఒకవేళ ఆ ఆర్డరు రాకపోతే అవి నిరుపయోగమే. ఇంతకముందు కొన్ని ప్రింటింగ్‌ యూనిట్లలో, వస్త్ర పరిశ్రమల్లో ఉద్యోగం చేసినప్పుడు ఇదంతా ప్రత్యక్షంగా చూశా. ఒక షర్ట్‌ కుట్టాలంటే దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఫ్యాబ్రిక్‌ను ఎంచుకుంటాం. కానీ మనకు కావల్సింది కట్‌షర్ట్‌. అంటే దాదాపు మొత్తం వస్త్రం పరిమాణంలో ఇరవై శాతం అక్కడే వృథా అవుతుంది. అలాంటి షర్టులు రోజుకు లెక్కలేనన్ని తయారుచేస్తారు. ఇవే నా వ్యాపార ఆలోచనకు ఊతమిచ్చాయి. మాది దిల్లీ. పైగా నా చదువులు కూడా డిజైనింగ్‌కు సంబంధించినవే కావడంతో ఈ రంగంలోకి రావడం సులువైంది. నేను వేసుకున్న ఆ లెక్కలూ, పర్యావరణానికి మేలు చేయాలనే ఆలోచనలు.. నన్ను ఇటువైపు నడిపించాయి.

మళ్లీ చదివా...
ఆలోచన రాగానే సరిపోదు. దాన్ని ఆచరణలో ఎలా పెట్టాలో తెలుసుకోవడం ముఖ్యం. అసలు ఏ కంపెనీలకు వెళ్లాలి...? నా ఆలోచన ఎవరికి చెప్పాలన్న విషయం మొదట్లో నాకొక చిక్కుముడి. 2012లో నేను బ్రాండ్‌ పేరును డూడ్‌లేజ్‌గా రిజిస్టర్‌ చేయించా. కానీ.. నా పనులేవీ అంత సులువుగా మొదలుకాలేదు. కంపెనీలకు వెళ్లి.. మీ దగ్గర మిగిలిపోయిన వస్త్రం ఇవ్వమంటే సులువుగా ఇచ్చేయరు కదా.. వాళ్లకి నా ఆలోచన గురించి చెప్పి ఒప్పించడం పెద్ద సమస్యే. కానీ, కొన్ని రోజులకు నా ఆలోచన అర్థమై మంచి స్పందనే వచ్చింది. అయితే, వృథా దుస్తులు సేకరించినా కూడా... ఎలాంటి డిజైన్‌లు తయారు చేయాలీ... అతుకుల బొంతలా కాకుండా ఆధునికంగా, ట్రెండీగా ఉండేలా కనిపించాలంటే ఎలా డిజైను చేయాలి.. ఇలా ఎన్నో రకాలుగా ఆలోచించేదాన్ని. వాటన్నింటికీ పరిష్కారం దొరకడానికి నాకు ఏకంగా రెండు సంవత్సరాలు పట్టింది. ఆ సమయంలో ఖాళీగా ఉండకుండా డిజైనింగ్‌లోనే ఎంఏ పూర్తి చేసేశా.  2014 కల్లా... చిన్న స్థాయి పరిశ్రమల నుంచి వృథాగా ఉన్న వస్త్రాల్ని సేకరించడం మొదలుపెట్టా. ఇప్పుడు మా దగ్గరున్న దుస్తుల్లో తొంభైశాతం అలా సేకరించిన వాటి నుంచి తయారైనవే. ఇక వీటిని మార్కెటింగ్‌ చేయడం మరో సమస్య. మొదట్లో తక్కువ సంఖ్యలో దుస్తులు తయారుచేయడంతో ప్రత్యేకంగా ఒక దుకాణం అయితే ప్రారంభించలేం. అందుకే దగ్గర్లో ఉన్న బ్రాండ్‌ స్టోర్లతో ఒప్పందం కుదుర్చుకున్నా. అక్కడ ఒక్కసారి కొనుగోలు చేసిన వాళ్లు... మా బ్రాండ్‌ దుస్తుల గురించి మళ్లీ అడిగేవారు. దాంతో ఆర్డర్లు ఎక్కువగా రావడం మొదలైంది. ఇలా క్రమంగా చాలా నగరాల్లో బ్రాండ్‌ స్టోర్లతో ఒప్పందం కుదుర్చుకుని వ్యాపారం విస్తరించా. ఇప్పుడు దేశం మొత్తం దాదాపు నలభై స్టోర్లలో మా దుస్తులు అమ్ముతున్నాం. హైదరాబాద్‌లోనూ అనానిమ్‌, ఓగాన్‌, తామర, ది ప్రాజెక్ట్‌ లాంటి స్టోర్లలో ఇవి అందుబాటులో ఉంటాయి.
వాటినీ ఉపయోగిస్తున్నాం...
మేం సేకరించిన వృథా నుంచి దుస్తులు తయారుచేశాక కూడా చాలా వస్త్రమే వృథా అయ్యేది. దాన్నలా వదిలేస్తే నేను అనుకున్న లక్ష్యం మధ్యలో మిగిలిపోయినట్లే. అందుకే అలా మిగిలిన వాటితో బ్యాగులూ, యాక్సెసరీలూ, స్టేషనరీ తయారుచేస్తున్నాం. ఒక్కటని కాదు.. ఏం చేయడానికి వీలుంటే అది తయారు చేయడమే నా, నాతో పనిచేసే వారి లక్ష్యంగా మారింది. మొదట్లో కేవలం అమ్మాయిల దుస్తులే తయారుచేసేవాళ్లం. ఇప్పుడు అబ్బాయిల కోసం కూడా ప్రత్యేక శ్రేణిని అందుబాటులో ఉంచుతున్నాం. చాలా సంస్థలు పర్యావరణానికి మేలు చేయాలనే ఉద్దేశంతో అనేక మార్గాలు అనుసరిస్తున్నాయి. సహజ రంగులు వాడటం, కాటన్‌కు ప్రత్యామ్నాయాలు కనుక్కోవడం, తొందరగా భూమిలో కలిసిపోయే వస్త్రావిష్కరణలు... ఇలా చాలా చేస్తున్నాయి. పూర్తిగా వృథా అనుకున్న వస్త్రాల ముక్కల నుంచి దుస్తులు తయారుచేస్తున్నది మాత్రం కొందరే. ఇదొక్కటే కాదు అరటీ, వెదురు పీచుతో తయారుచేసిన వస్త్రాన్నే ఎక్కువగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నాం.

ఎలా చేస్తామంటే...
మా దగ్గరికి పెద్ద మొత్తంలో ముడిసరుకు వచ్చి చేరుతుంది. వాటి నుంచి కాస్త ఒకే రకం, రంగులో ఉన్న వస్త్రాల్ని ఎంచుకోవడం కష్టమైన పనే.  వాటిని ఎంపిక చేశాక ఎలాంటి డిజైను రూపొందించొచ్చనేది చర్చిస్తాం. అవసరమైన వాటికి ఎంబ్రాయిడరీలూ, ప్యాచ్‌లు చేయిస్తాం.  మేం తయారు చేసే ఏ రెండు డ్రెస్సులు ఒకే రకంగా ఉండవు. అందుకే నా సంస్థ పేరు డూడ్‌లేజ్‌ అని ఎంపిక చేశా. మామూలుగా ఏ రెండు డూడుల్స్‌ ఒకేలా ఉండవు. కానీ వేటి ప్రత్యేకత వాటిదే. ఇదే మేం తయారుచేసే దుస్తులకూ వర్తిస్తుంది. ఆన్‌లైన్‌లోనూ వీటిని అందుబాటులో ఉంచితే ఎక్కువ మందిని చేరుకోవచ్చనే ఆలోచనతో ఈ మధ్యే వెబ్సైట్‌ను కూడా ప్రారంభించా. 1400 రూపాయల నుంచి 14000 రూపాయల వరకు యాక్సెసరీలూ, దుస్తులు అందుబాటులో ఉన్నాయి.
మా నాన్న బ్లేజర్‌తో మొదలు...
లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లోనూ మా దుస్తులను ప్రదర్శించే అవకాశం నాకు అనుకోకుండా వచ్చింది. ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేను. నా కష్టానికి వచ్చిన గుర్తింపది. నా ప్రయాణం మా నాన్నకు చాలా ఇష్టమైన ఒక లెదర్‌ బ్లేజర్‌తో ప్రారంభమైంది. అది ఆయన దాదాపు పది సంవత్సరాల నుంచి జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారు. ఇప్పుడాయనకు అది నప్పక.. వేసుకోలేక చాలా బాధ పడేవారు. దాన్ని నేను జాకెట్‌గా మార్చేసి వేసుకున్నా. అదే నేను మార్చిన మొదటి డ్రెస్‌. భవిష్యత్తులో ఒక వెడ్డింగ్‌ డ్రెస్‌ కూడా ఇలా మిగిలిన వస్త్రంతో తయారు చేయాలనేది నా కోరిక..!

Thursday, 15 February 2018

24గంటల విద్యుత్తు వద్దని ధర్నా

24గంటల విద్యుత్తు వద్దని ధర్నా

  ;రైతులకు అందిస్తున్న 24గంటల కరెంటు వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయంటూ వివిధ గ్రామాలకు చెందిన రైతు సంఘాల నాయకులు జనగామ.. సూర్యాపేట ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న రైతులు మాట్లాడుతూ 24గంటల కరెంటు కారణంగా బోరుబావులు పూర్తిగా ఎండిపోయాయని, మరికొన్ని రోజులు ఇదేవిధంగా జరిగితే తాగునీటి సమస్య ఏర్పడుతుందని తెలిపారు. ధర్నా కారణంగా రహదారిపై దాదాపు 2గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో టీమాస్‌ సభ్యులు, రైతు సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

కాపు కోటాకు 'తెలంగాణ పేరు ప్రస్తావనతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అభ్యంతరం గందరగోళం

కాపు కోటాకు 'తెలంగాణ పేరు ప్రస్తావనతో అభ్యంతరం 



కాపు కోటాకు అభ్యంతరం
కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన సిబ్బంది శాఖ
రిజర్వేషన్లు 50% మించరాదని సుప్రీం చెప్పిందని వెల్లడి
తెలంగాణ పేరు ప్రస్తావనతో గందరగోళం

కాపుల రిజర్వేషన్ల అంశానికి కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఒక బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల అభిప్రాయాన్ని కోరింది. వాటిలో సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) కూడా ఒకటి. దీనిపై డీఓపీటీ తాజాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ- రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పును గుర్తు చేసింది. 1992 నవంబరు 16న ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం- రిజర్వేషన్లు 50 శాతానికి మించటానికి లేదనీ, ఒకవేళ అంతకు మించి కల్పించాలంటే అందుకు బలమైన ప్రాతిపదికగానీ, అసాధారణ పరిస్థితులు గానీ  అవసరమని పేర్కొంది. అయితే తాజా బిల్లు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అలాంటి బలమైన ప్రాతిపాదికలు ఏమిటో స్పష్టం చేయలేదని అభిప్రాయపడింది. అలాగే రిజర్వేషన్లనేవి ఆయా వర్గాలకు ‘సముచిత రీతిలో’ కల్పించాలే తప్ప జనాభా ప్రాతిపదికన కాదన్న రాజ్యాంగ నిబంధనను సుప్రీంకోర్టు ప్రస్తావించిన అంశాన్నీ గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో కాపుల రిజర్వేషన్ల బిల్లుపై ఆమోద ముద్ర వేయాల్సిన అవసరం లేదని హోం శాఖ రాష్ట్రపతికి సూచించొచ్చని అభిప్రాయపడింది. మరోవైపు ఇదే లేఖలో- ఓబీసీల్లో ఉపవర్గీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దిల్లీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో ఒక కమిషన్‌ను నియమించిన విషయాన్ని కూడా డీఓపీటీ గుర్తు చేసింది. ఆ కమిషన్‌ ఓబీసీల ఉపవర్గీకరణ శాస్త్రీయంగా చేయటానికి అవసరమైన విధివిధానాలను, ఇతర ఏర్పాట్లను ఖరారు చేసే పనిలో ఉందని పేర్కొంది.

లేఖలో తెలంగాణ ప్రస్తావన!
కాపుల రిజర్వేషన్‌కు సంబంధించిన ఈ లేఖలో ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం’ అని ఉండాల్సిన చోట ‘తెలంగాణ ప్రభుత్వం’ అని అచ్చు కావటంతో కొంత గందరగోళం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం గత ఏప్రిల్‌లో ముస్లిం రిజర్వేషన్లను 4 శాతం నుంచి 12 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచే బిల్లును శాసనసభలో ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. ఇంతవరకు దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి సమాచారం తెలంగాణ ప్రభుత్వానికి అందలేదు. 
తెలంగాణ గురించి కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లిన అధికారులు..
తాజా లేఖ నేపథ్యంలో తెలంగాణలో ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుదలకు సంబంధించి కేంద్రం ఆమోదంపైనా అనిశ్చితి నెలకొంది. కాపు రిజర్వేషన్ల అంశంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి పంపిన లేఖలో కోటా 50 శాతానికి పెంచకూడదన్న సుప్రీం తీర్పునే ప్రస్తావించడం.. రిజర్వేషన్లకు జనాభా ప్రాతిపదిక కాదని అభిప్రాయపడడంతో ఇవే నిబంధనలతో తెలంగాణ విన్నపానికి కూడా విఘాతంగా తయారవ్వచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలు పరచడం.. ఆ రాష్ట్రాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూలులో చేర్చడం వంటి అంశాలను కూడా  కేంద్రానికి పంపిన లేఖలో వివరించామని తెలంగాణ అధికార వర్గాలు చెప్పాయి. ఈ లేఖలోని విషయాలను తెలంగాణ అధికారులు దిల్లీలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీనిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి స్పష్టత తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర అధికారులను, ఎంపీలను ఆదేశించినట్లు సమాచారం. 

హైపర్‌ ఆది లవ్‌ ప్రపోజల్‌..?

హైపర్‌ ఆది లవ్‌ ప్రపోజల్‌..?



 హైపర్‌ ఆది, బుల్లితెరపై తనదైన శైలిలో సంచులకొద్ది పంచులతో కమెడియన్‌గా రాణిస్తున్న నటుడు. కామెడీ షోలతో పాటు, పలు టీవీ కార్యక్రమాలతో బుల్లితెర అభిమానులను అలరిస్తాడు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు.  సినిమాల్లోను తనదైన మార్క్‌ పంచులను ఏమాత్రం తగ్గించట్లేదు. తాజగా వరుణ్‌ తేజ్‌, రాశీఖన్నా నటించిన తొలిప్రేమ సినిమాలోను అలరించాడు. పంచ్‌లతో కామెడీ చేశాడు.
రీసెంట్‌గా ఆది ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఓ అమ్మాయికి తన ప్రేమను తెలుపుతున్నట్లుగా చేయి పట్టుకొని ఉన్నాడు. ప్రేమికుల రోజు సందర్భంగా ఆఫోటో పెడుతూ  అందరికీ వాలంటైన్స్‌ డే.. స్ప్రెడ్‌ లవ్‌ అంటూ పోస్టు చేశాడు. అయితే అది నిజంగా జరిగింది కాదు. తొలిప్రేమ షూటింగ్‌లో ఉన్నప్పుడు అక్కడ ఓ అమ్మాయిని కలిసి లవర్‌ బాయ్‌లా స్టిల్‌ ఇచ్చాడు. ఇప్పుడు అది కాస్తా సోషల్‌ మీడియా వైరల్‌ అయింది. దీంతో ఫాలోవర్స్‌ అందరూ ఆదికి పంచ్‌లతో పాటు ప్రేమించడం, ప్రపోజ్‌ చేయడం కూడా వచ్చే అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

ఆయన లాంటి ‘బాహుబలి’ మరొకరు లేరు నివేదా థామస్‌

ఆయన లాంటి ‘బాహుబలి’ మరొకరు లేరు
నివేదా థామస్‌

‘జెంటిల్‌మెన్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నివేదా థామస్‌. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నివేదా..ఆ తరువాత ‘నిన్నుకోరి’, ‘జై లవకుశ’ చిత్రాల్లో నటించింది. చిత్ర పరిశ్రమకు వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎన్టీఆర్‌ వంటి అగ్రకథానాయకుడికి జంటగా నటించే అవకాశం దక్కించుకుంది. తాజాగా తాను నటించబోయే చిత్రాల గురించి, తనకు నచ్చిన హీరోల గురించి నివేదా ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది.
ప్రశ్న: నచ్చిన కోస్టార్‌?
నివేదా: కమల్‌ హాసన్‌
తెలుగులో తర్వాతి సినిమా ఏంటి?
త్వరలో ప్రకటిస్తాను
తారక్‌ గురించి మీ అభిప్రాయమేంటి?
తారక్‌ది అద్భుతమైన పర్సనాలిటీ. ఆయన ఎనర్జీతో సెట్‌ మొత్తం వెలిగిపోతుంది. నిబద్ధతతో పనిచేసే వ్యక్తి.
మీరు చేసిన సినిమాల్లో ఏది బెస్ట్‌?
జెంటిల్‌మెన్‌, నిన్నుకోరి, పాపనాశం..ఎంపిక చేయాలంటే కొంచెం కష్టమే.
హీరోయిన్‌ కాకపోయుంటే ఏమై ఉండేవారు?
హీరోయిన్‌ కాకపోయినా సినిమాల్లోనే ఉండేదాన్ని. సినీమాటోగ్రఫర్‌గా కానీ దర్శకురాలిగా కానీ చేస్తుండేదాన్ని. ఒకవేళ సినిమా కాకపోతే ఆర్కిటెక్ట్‌ అయ్యుండేదాన్ని.
ప్రభాస్‌ గురించి ఒక్కమాటలో..
ఆయన్ని మించిన మరో ‘బాహుబలి’ ఉండడు. ప్రభాస్‌కి దేహదారుఢ్యం, సినిమాలు ఎంపికచేసుకునే విధానమే ఆయన్ని అగ్రకథానాయకుడిగా నిలబెట్టాయి.
మరి నాని గురించి..
నాని గురించి ఒక్కమాటలో చెప్పలేం. అతను కుటుంబంలో ఓ వ్యక్తిలాంటివాడు
ఎవరైనా మీకు ప్రపోజ్‌ చేస్తే ఏం చేస్తారు?
నవ్వి ఊరుకుంటా
ఇప్పటివరకు మీరు నటించిన పాత్రల్లో ఏది కష్టంగా అనిపించింది?
కష్టంగా అనిపించింది అని చెప్పలేను కానీ..నేను చేసిన పల్లవి, కేథరీన్‌ పాత్రలు నచ్చాయి.
ప్రపంచానికి ఏదన్నా చేయాలన్న కోరిక ఉందా?
ప్రస్తుతం ఉన్న ప్రపంచం సరిగ్గా లేదు. సమాజంలో అందరినీ సమానంగా చూసేలా నా వంతు ప్రయత్నం చేస్తాను.
ఎలాంటి సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నారు?
‘పద్మావత్‌’లాంటి సినిమా చేయాలని ఉంది. అందులో ఎలాంటి వివాదాస్పద అంశాలు లేవు.

Wednesday, 14 February 2018

యమభటుల్ని ఓడిస్తున్న రక్షక భటులు! పునర్జన్మలు ప్రసాదిస్తున్న పహారా 73 రోజుల్లో 51 మందికి ప్రాణదానం సాగర్‌ చుట్టూ రక్షణ కవచం లేక్‌ పోలీస్‌



యమభటుల్ని ఓడిస్తున్న రక్షక భటులు! 
పునర్జన్మలు ప్రసాదిస్తున్న పహారా 
73 రోజుల్లో 51 మందికి ప్రాణదానం 
సాగర్‌ చుట్టూ రక్షణ కవచం లేక్‌ పోలీస్‌ 


నగరం నడిబొడ్డున విరాజిల్లుతున్న పర్యాటక కేంద్రం హుస్సేన్‌సాగర్‌. ప్రశాంతమూర్తి గౌతమబుద్ధుడు, తెలుగు తేజాల విగ్రహాలు, సాగర్‌ జలాలపై హొయలుపోయే అలలు..  ఆ మధురానుభూతి వర్ణనాతీతం. ఎంతోమంది ఇక్కడి ఆహ్లాదాన్ని కోరుకుంటారు. సాయంత్రం పర్యాటకుల తాకిడితో ఎంతో సందడిగా ఉంటుంది. కొందరు మాత్రం తీరని వేదనతో సాగర తీరాన్ని చేరుతుంటారు . చుట్టూ వందల మంది కేరింతల నడుమ ఆనందంగా గడుపుతున్నప్పటికీ వీరు మాత్రం జీవితంపై కనీస ఆశ లేకుండా బలవన్మరణాలకు ఒడిగట్టేందుకు యత్నిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ప్రేమ విఫలమైందని కొందరు, పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేదని ఇంకొందరు, వృద్ధాప్యం, అనారోగ్యం... ఇలా కారణమేదైనా తీవ్ర మానసిక వేదన, ఒత్తిడితో జీవితాన్నే ముగించేద్దామని నిర్ణయం తీసుకుంటున్నారు. సాగర్‌జలాల్లో దూకి ఆత్మహత్యలకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకుల రక్షణతోపాటు శాంతి భద్రతల విధులు నిర్వహిస్తున్న ఇక్కడి లేక్‌ పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ గడిచిన 73 రోజుల్లో 51 మందిని కాపాడారు. ఒక్కసారి గమనిస్తే హుస్సేన్‌సాగర్‌ జలాల్లో ఆత్మహత్యలకు పాల్పడేవారి సంఖ్య ఎంతలా ఉందో అర్థమవుతుంది.
16 ఏళ్లుగా సేవలు...
నగరంలో ప్రధాన పర్యాటక కేంద్రమైన హుస్సేన్‌సాగర్‌ను సందర్శించేందుకు ప్రతిరోజూ వేలాదిగా పర్యాటకులు, సందర్శకులు తరలివస్తుంటారు. పరిసర ప్రాంతాల ప్రజలు వ్యాయామం, ఉదయపు నడక కోసం ఇక్కడికి వస్తుంటారు. నిత్యం సందడి నెలకొని ఉంటుంది. పర్యాటకుల రక్షణ కోసం శాంతి భద్రతల పరిరక్షణతోపాటు సాగర్‌లో పడిపోయిన వారిని రక్షించేందుకు సెంట్రల్‌ జోన్‌ తొలి డీసీపీ సీవీ ఆనంద్‌ ఇక్కడ లేక్‌ ఠాణాను నెలకొల్పారు. హుస్సేన్‌సాగర్‌ పరిసరాలైన గాంధీనగర్‌, సైఫాబాద్‌, రాంగోపాల్‌పేటల సమన్వయంతో లేక్‌ఠాణా విధులు నిర్వహిస్తుంది. తొలినాళ్లలో పర్యాటక విభాగం నుంచి ప్రత్యేకంగా ఓ బోటు ఏర్పాటు చేసి గస్తీ నిర్వహించేవారు. రంపచోడవరం నుంచి గజ ఈతగాళ్లను తీసుకొచ్చి శిక్షణ ఇచ్చారు. గడచిన ఆరేళ్లలో 783 మందిని కాపాడారు.
కంచెలేని చోట అత్యంత ప్రమాదకరంగా...
ఆరు కిలోమీటర్ల మేర విస్తరించిన సాగర్‌ పరిసరాల్లో సుమారు రెండు కిలోమీటర్ల మేర ఎత్తైన కంచె లేదు. ఏళ్ల క్రితం సాగర్‌ చుట్టూ ఏర్పాటు చేసిన సుమారు రెండున్నర అడుగుల ఫెన్సింగ్‌  ఉంది. ఇటీవల అధికారులు సాగర్‌కు కొంతమేర చుట్టూ ఎత్తైన కంచెను ఏర్పాటు చేశారు. పూజస్థల్‌, పికాక్‌స్టాచ్‌, లేపాక్షి, ఓల్డ్‌ లవ్‌ హైదరాబాద్‌ స్పాట్‌ ప్రాంతాల్లోనే ఏళ్ల కాలంగా ఎక్కువ మంది ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. ఇక్కడ కంచె లేకపోవడం గమనార్హం. అందుకే పోలీసులు మరింత పటిష్ఠంగా గస్తీ చేపడుతున్నారు. ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ అక్కడక్కడా దెబ్బతింది. శిథిలావస్థకు చేరిన ఫెన్సింగ్‌ను మరమ్మతులు చేయడంతోపాటు కంచెలేని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే సమస్య కొంతమేర తగ్గే అవకాశం ఉంది.

ఆత్మహత్యలు పరిష్కారం కాదు
- ధనలక్ష్మి, సీఐ, లేక్‌ ఠాణా
జీవితం ఎంతో విలువైనది. నిండు జీవితాన్ని అర్ధంతరంగా ముగించొద్దు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి. మానసిక ఒత్తిడి కలిగినా కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో పంచుకోవాలి. ఆత్మహత్య కోసం కాకుండా పరిష్కారం కోసం ఆలోచించాలి, ప్రయత్నించాలి. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలి. పిల్లల ప్రవర్తనలో కొంచెం మార్పు వచ్చినా తల్లిదండ్రులు గమనించి స్నేహపూర్వకంగా నడుచుకోవాలి. ఇక్కడి సిబ్బంది ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రతి ఒక్కరూ చురుకుగా, బాధ్యతగా నిధులు నిర్వహిస్తారు. రాత్రి, పగలు తేడా లేకుండా సమాచారం వచ్చినప్పుడు ఎంతో బాధ్యతగా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉన్నతాధికారుల ప్రోత్సాహం మరింత ఉత్సాహాన్నిస్తుంది.

ప్రతిక్షణం అప్రమత్తంగా..
లేక్‌ ఠాణా పరిధిలోని నెక్లెస్‌రోడ్డు, ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ గార్డెన్‌ ప్రధాన పర్యాటక ప్రాంతాలతోపాటు ఠాణా పరిధిలోని ప్రాంతాల్లో విధులు నిర్వహించడం ఓ విధంగా కత్తిమీద సాము లాంటిదే. ఓ పక్క పర్యాటకుల రక్షణ చూస్తూనే... బలవన్మరణాలకు పాల్పడే వారిని గమనిస్తూ అప్రమత్తంగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో సాగర్‌ చుట్టూ పోలీసులు ప్రతిక్షణం మరింత అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. ఆరు కిలోమీటర్ల పరిధిలో కొనసాగుతున్న ఇక్కడి ఠాణాలో సుమారు 35 మంది సిబ్బంది విడతల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. మూడు ద్విచక్రవాహనాలతో ఆరుగురు సిబ్బంది, గస్తీ నిర్వహించే ఓ కారు, సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు గుర్రాలపై సిబ్బంది, హుస్సేన్‌సాగర్‌ చుట్టూ కొంత మంది సిబ్బంది, ఓ ఏఎస్సై ఎప్పటికప్పుడు ఠాణా సీఐతో సమన్వయం చేస్తూ ఇక్కడి పరిసరాలను గమనిస్తుంటారు. అనుమానం వస్తే వెంటనే ఠాణాకు తీసుకెళ్లి వివరాలు తెలుసుకుని కౌన్సెలింగ్‌ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఎవరైనా నీళ్లలో దూకితే ప్రాణాలకు తెగించి ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. లేక్‌పోలీసుల అప్రమత్తతతో గడిచిన 73 రోజుల్లో 51 మందిని రక్షించారు. ఒక్కోసారి నిమిషం ఆలస్యమైనా ఒక వ్యక్తి ప్రాణం కోల్పోయినట్లే. ఇక్కడి పరసరాల్లో గస్తీ నిత్యం కంచెను తలపిస్తుంది.

Tuesday, 13 February 2018

భారత్‌ పై ట్రంప్‌ అసంతృప్తి

భారత్‌ పై ట్రంప్‌ అసంతృప్తి

వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన హార్లీ-డేవిడ్‌సన్‌ మోటారుసైకిళ్ల దిగుమతిపై భారత్‌ అధిక సుంకం వసూలు చేస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇది అంత మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఇలాగే ఉంటే భారత్‌ నుంచి అమెరికాకు దిగుమతయ్యే మోటార్‌సైకిళ్లపైనా సుంకాన్ని పెంచుతామని హెచ్చరించారు. స్టీల్‌ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్‌ సభ్యులతో సమావేశమైన ట్రంప్‌ భారత్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు.  
 అయితే తాజాగా భారత్‌ వీటిపై కస్టమ్స్‌ సుంకాన్ని మరింత తగ్గించింది. విదేశాల్లోనే పూర్తిగా తయారై దిగుమతి చేసుకునే ఈ బైక్‌లపై  ప్రాథమిక సుంకాన్ని 50 శాతానికే పరిమితం చేసింది. గతంలో ఇది 800సీసీ అంతకన్నా తక్కువ సామర్థ్యం గల బైక్‌లపై 60శాతం, 800సీసీ అంతకన్నా ఎక్కువ సామర్థ్యం గల బైక్‌లపై 75శాతం సుంకం ఉంది. అయితే దీన్ని 50 శాతానికి తగ్గించిన తర్వాత ట్రంప్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇటీవల భారత ప్రభుత్వం హార్లీడేవిడ్‌సన్‌ బైక్‌లపై టారిఫ్‌ను 75శాతం నుంచి 50శాతానికి తగ్గించింది. కానీ ఇది సరిపోదు అని ట్రంప్‌ అన్నారు. అమెరికా భారత్‌ నుంచి దిగుమతి చేసుకునే బైక్‌లకు సుంకాన్ని విధించడంలేదని, భారత్‌ మాత్రం అధిక సుంకం వేస్తోందన్నారు. ఇలా ఉండకూడదని.. పరస్పరం ఒకేలా ఉండాలని పేర్కొన్నారు. చాలా దేశాలతో ఇలాగే జరుగుతోందన్నారు. తమ బైక్‌లు ఇతర దేశాల్లోకి వెళ్లాలంటే పెద్ద మొత్తంలో సుంకం చెల్లించాల్సి వస్తోందన్నారు. ఇరు వైపులా ఒకేలా సుంకాలు చెల్లించేలా ‘రెసిప్రోకల్‌ ట్యాక్స్‌’ విధానం ఉండాలని వెల్లడించారు.
ట్రంప్‌ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయినప్పుడు జరిగిన సంభాషణను కూడా పరోక్షంగా ప్రస్తావించారు. ‘భారత్‌ నుంచి ఓ గొప్ప జెంటిల్‌మెన్‌ ఫోన్‌ చేశారు.. మోటార్‌సైకిళ్లపై టారిఫ్‌ను 75శాతం, 100శాతం నుంచి కేవలం 50శాతానికి తగ్గించేశామని చెప్పారు. అయితే అమెరికాకు భారత్‌ నుంచి వేల సంఖ్యలో బైక్‌లు దిగుమతి అవుతున్నాయి.. కానీ వీటికి మనం విధించే సుంకం ఎంతో తెలుసా.. సున్నా ’అని శాసనకర్తలనుద్దేశించి ట్రంప్‌ అన్నారు. అందుకే తాను రెసిప్రోకల్‌ ట్యాక్స్‌ ఉండాలని అంటున్నానని చెప్పారు. తాను భారత్‌ను నిదించట్లేదని.. ఉదాహరణ కోసం చెప్పానని చెప్పుకొచ్చారు. అమెరికా విధానాన్ని అవకాశంగా తీసుకుని ఇతర దేశాలు లాభపడుతున్నాయి. . అలా కాకుండా ఇరు దేశాల నుంచి పరస్పరం ఒకేలా సుంకాలు వసూలు చేసుకునే విధానం ఉండాలని ట్రంప్‌ అభిప్రాయ పడ్డారు.