Tuesday, 6 February 2018

మారుతున్న మహానగర ముఖచిత్రం

  • శివార్లలో మెరుగవుతున్న మౌలిక వసతులు
  • రా.. రమ్మంటూ స్వాగతం పలుకుతున్న ఓఆర్‌ఆర్‌
  • పెరుగుతున్న గేటెడ్‌ కమ్యూనిటీలు
  • మనసుకు ఉల్లాసాన్నిచ్చే వాతావరణం
  • ఆసక్తిచూపుతున్న నగరవాసులు
  •  
    మహానగరంలో నివాసం అంటే సగటు జీవి ఇబ్బందులు పడాల్సిందే. ఇరుకిరుకు ఇళ్లు.. సరిపడా స్థలం లేని పరిస్థితుల్లో చిన్న రోడ్లు వాహనాలతో నిండిపోతున్నాయి. మనుషులతో పోటీ పడి వాహనాలు పెరుగుతున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు రోడ్డెక్కితే ట్రాఫిక్‌ కష్టాలు. వీటికి తోడు వాయు, శబ్ద కాలుష్యం... ప్రశాంతంగా రోడ్డుపై పాదచారి నడక సాగించలేని పరిస్థితులు. అక్కడక్కడ పుట్‌ఫాత్‌లు ఉన్నా అవన్నీ కబ్జా అవుతున్నాయి. అరకొరగా ఆట స్థలాలు... ఆరోగ్య రీత్యా ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌ చేయాలంటే పార్కులకు పరుగు పెట్టాల్సిందే. ఇలా పలు రకాలుగా సమస్యలు నగర వాసులను నిత్యం వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో సగటు నగర జీవికి హైదరాబాద్‌ మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్‌ రింగురోడ్డు ఎంతో ఊరటనిస్తోంది. అటు వైపు రా...రమ్మంటూ స్వాగతం పలుకుతోంది. రూ.6,696 కోట్లతో నగరం చుట్టూ 158 కి.మీ పొడువునా నిర్మించిన ఓఆర్‌ఆర్‌ మహానగరానికే ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఔటర్‌ చుట్టూ పచ్చదనం కళ్ల ముందు కదలాడుతోంది. విశాలమైన రహదారులు, నగరం నుంచి ఔటర్‌ను అనుసంధానం చేస్తూ 33 రేడియల్‌ రోడ్డు, నాలుగు జాతీయ రహదారులు, 8 రాష్ట్ర రహదారులు, పంచాయతీ రహదారులు, అంతర్గత రహదారులు.. ఓఆర్‌ఆర్‌ కేంద్రంగా శివార్లలో మౌలిక వసతులు రోజురోజుకు మెరుగుపడుతున్నాయి. అంతర్జాతీయ విద్యా సంస్థలు కేజీ టూ పీజీ వరకు పదులు, వందలాది ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ కళాశాలలు శివార్లలో విశాలమైన ప్రాంగణాల్లో కొలువుదీరాయి. ఇవన్నీ శివార్లలో అందుబాటులో ఉండడంతో నగరవాసులు అటువైపు తరలివెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.
  •  
    ఆకట్టుకుంటున్న ఔటర్‌..
    అంతర్జాతీయ ప్రమాణాలతో.. 8 లేన్లతో నిర్మించిన ఓఆర్‌ఆర్‌ ప్రధాన రహదారితోపాటు ఇరువైపులా 4 లేన్ల సర్వీసు రోడ్లు, వాటి మధ్యలో ఏపుగా పెరుగుతున్న పచ్చని చెట్లతో ఆ ప్రాంతమతా ఆకర్ణణీయంగా మారింది. ఒక్కసారి ఔటర్‌పైన, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రయాణించినా, కొంత సమయం గడిపినా చాలా బాగుంది అనే భావన కలుగుతోంది. ఇదే వారిని నగరం నుంచి శివార్లకు తరలివచ్చేలా చేస్తోంది. 25-30 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ మౌలిక వసతులను కల్పిస్తోంది. ఔటర్‌ పైన గంటకు 100 కి.మీ వేగంతోనే కాదు నగరానికి అనుసంధానంగా ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారులతోపాటు విశాలంగా 100 అడుగుల విస్తీర్ణంతో నిర్మించిన రేడియల్‌ రోడ్లపై చాలా సౌకర్యంగా, వేగంగా రాకపోకలు సాగించవచ్చు. ఈ పరిస్థితులు శివార్లలో నివాసాలు ఏర్పాటు చేసుకునేలా చేస్తున్నాయి.
     
        నాంపల్లి నుంచి సుమారు 30 కి.మీ దూరంలో చుట్టూ నిర్మాణం పూర్తిచేసుకున్న ఔటర్‌ రింగు రోడ్డు నగర వాసులకు కొత్త అనుభూతినిస్తోంది. ఓఆర్‌ఆర్‌ సమీపంలో కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో రెండేళ్ల కాలంలోనే 31 వరకు గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టులు అనుమతులు పొంది నిర్మాణాలు జరుగుతున్నాయి. హెచ్‌ఎండీఏ కల్పిస్తున్న మౌలిక వసతులు నగరవాసుల ఆలోచన విధానంలో మార్పు తీసుకొస్తున్నాయి. శివార్లకు వెళ్లి ప్రశాంతమైన వాతావరణం, విశాలమైన కాలనీలు, గెటేడ్‌ కమ్యూనిటీల్లో నివాసం ఉండాలన్న కోరికను ప్రజలు పెంచుకుంటున్నారు. దీనికి తగ్గట్టుగానే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఔటర్‌ కేంద్రంగా ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. శంషాబాద్‌ నుంచి గచ్చిబౌలి... అక్కడి నుంచి కోకాపేట, కొల్లూరు, తెల్లాపూర్‌, పటాన్‌చెరువు ప్రాంతాల్లోనే వందలాది ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోగా... మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. ఇలా.. 158 కి.మీ పొడవునా నివాస ప్రాంతాలు ప్రతియేటా పెరుగుతున్నాయి.

ఫొటో తీసుకోబోయాడని ఫోన్‌ పగలగొట్టిన అనసూయ? పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ

ఫొటో తీసుకోబోయాడని ఫోన్‌ పగలగొట్టిన అనసూయ?
పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ

యాంకర్‌ అనసూయ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. తనతో కలిసి ఫొటో తీసుకోవడానికి ప్రయత్నించిన బాలుడి ఫోన్‌ను పగలగొట్టారట. దీంతో బాలుడి తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తార్నాకలో నివాసం ఉంటున్న సదరు మహిళ అనసూయపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడు సెల్ఫీ తీసుకోబోయినందుకు యాంకర్‌ ఫోన్‌ను పగలగొట్టారని ఆరోపించారు. తార్నాకలో నివాసం ఉంటున్న తన తల్లి ఇంటికి అనసూయ సోమవారం వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. అనసూయపై కేసు నమోదు చేసిన విషయం నిజమేనని ఉస్మానియా యూనివర్శిటీ పోలీసు స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో (స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌) జి. జగన్‌ తెలిపారు. కేసు విచారణ జరుపుతున్నామని, ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం కాదని అభిప్రాయపడ్డారు. అనసూయ అక్కడి నుంచి వెంటనే వెళ్లాల్సిన తొందరలో సెల్ఫీ దిగడానికి విముఖత చూపారని, ఈ క్రమంలో ఫోన్‌ పగిలిందని చెప్పడం గమనార్హం.
ఈ సంఘటనకు సంబంధించి సోషల్‌మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. అందులో అనసూయపై ఫిర్యాదు చేసిన మహిళ తన కుమారుడితో కలిసి ఉన్నారు. సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అనసూయ తన కుమారుడి చేతిలోని ఫోన్‌ను తీసుకుని, నేలకు విసిరారని ఆమె అన్నారు. పగిలిన ఫోన్‌ను కెమెరాకు చూపుతూ.. నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.
అయితే ఈ వార్తల్ని అనసూయ తోసిపుచ్చారు. ‘ఇది పూర్తిగా తప్పు. ఆ మహిళ అబద్ధాల్ని ప్రచారం చేస్తోంది. మా అమ్మను చూడటానికి తార్నాకకు వెళ్లా. నేను బయటికి వస్తుండగా ఆమె తన కుమారుడితో కలిసి నా వీడియో తీశారు, నాతో సెల్ఫీకి ప్రయత్నించారు. నేను అప్పుడు సెల్ఫీ దిగే పరిస్థితిలో లేను, అందుకే తిరస్కరించా. కెమెరా దగ్గరికి పెట్టేసరికీ కంగారుపడ్డా. నా ముఖం కప్పుకున్నా, ఇక్కడి నుంచి వెళ్లండి అని వారికి చెప్పి కారులో కూర్చొన్నా. అప్పుడు ఫోన్‌ పగిలిందా? లేదా? అన్న విషయం నాకు గుర్తులేదు’ అని ఆమె ఓ వెబ్‌సైట్‌తో చెప్పారు. అనంతరం ఆమె ట్వీట్‌ కూడా చేశారు. ‘ఆమె ఫోన్‌ పగిలినందుకు క్షమాపణలు చెబుతున్నా. కానీ నేను చేయని తప్పుకు నన్ను నిందించడం సరికాదు. నా ప్రైవసీ నాకు ఉంటుంది’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇదే సందర్భంగా ఓ వ్యక్తి అనసూయను ఉద్దేశించి ట్విటర్‌లో కామెంట్‌ చేశారు. ఎందుకు ఫోన్‌ పగలగొట్టావు? అని ప్రశ్నించారు. అనసూయతోపాటు హైదరాబాద్‌ పోలీసులకు ఈ కామెంట్‌ను ట్యాగ్‌ చేశారు. దీంతో పోలీసులు స్పందించారు. పూర్తి వివరాలు చెప్పండి అని అతడికి బదులిచ్చారు. ఈ ట్వీట్లు చూసిన అనసూయ పోలీసులకు బదులిస్తూ.. తనను ట్వీట్‌లో ట్యాగ్‌ చేసే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని కోరారు.

నేతన్నలకే బతుకమ్మ

నేతన్నలకే బతుకమ్మ 
బతుకమ్మ చీరలన్నీ తెలంగాణలోనే తయారీ 
రంజాన్‌, క్రిస్మస్‌ చీరలు సైతం.. 
1.20 కోట్ల మంది మహిళలకు పంపిణీ 
నేతన్నలకు రూ.230 కోట్ల ఉపాధి 
వచ్చే నెల నుంచే ఉత్పత్తి ప్రారంభం 



రాష్ట్రంలోని మహిళలకు బతుకమ్మ, రంజాన్‌, క్రిస్మస్‌ల సందర్భంగా పంపిణీ చేయనున్న ఉచిత చీరలను ఈసారి పూర్తిగా తెలంగాణలోని నేత కార్మికులతోనే తయారు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.230 కోట్లతో 1.20 కోట్ల చీరలను ఉత్పత్తి చేయనున్నారు. గత సంవత్సరం సగం మాత్రమే తెలంగాణలో తయారు చేయగా, మిగిలిన సగాన్ని సూరత్‌ నుంచి కొనుగోలు చేశారు. అప్పట్లో సమయాభావం వల్ల సూరత్‌ వైపు మొగ్గు చూపిన ప్రభుత్వం ఈసారి ముందస్తు ప్రణాళికతో రాష్ట్రంలోనే మొత్తం ఉత్పత్తి చేయడానికి సన్నాహాలు చేయనుంది. తెలంగాణలోని ఆడపడచులకు ప్రీతిపాత్రమైన బతుకమ్మ పండగ కానుకగా, మరోవైపు నేత కార్మికులకు పని కల్పించే సంకల్పంతో ఉచిత చీరలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించగా, గత సంవత్సరం దీనిని ప్రారంభించారు. దీనికోసం రూ.222 కోట్లను విడుదల చేసింది. ఇందులో దాదాపు రూ.122 కోట్ల విలువైన 52 లక్షల పాలియెస్టర్‌ చీరల పంపిణీ అర్డర్లను సిరిసిల్లలోని నేత కార్మికులకు అప్పగించారు. మరో రూ. 100 కోట్ల తయారీ ఆర్డర్‌ను సూరత్‌లోని కంపెనీల నుంచి కొనుగోలు చేశారు. గత ఏడాది పథకం అమలు తీరును ఇటీవల మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు. లోటుపాట్లను సవరించి, పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు. ముందుగా నేత కార్మికులకు మొత్తం 1.20 కోట్ల చీరల తయారీకి పని ఉత్తర్వు (వర్క్‌ ఆర్డర్‌) ఇవ్వాలని ఆదేశించారు. చీరల ఉత్పత్తిని వచ్చే నెల నుంచి ప్రారంభించి సెప్టెంబరు 10 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. అక్టోబరు 9 నుంచి పంపిణీ జరగాలని నిర్దేశించారు. దాదాపు ఆరు నెలల సమయం ఉన్నందున ప్రతీ నెల 20 లక్షల చీరల ఉత్పత్తి చొప్పున మొత్తం చీరల తయారీకి ఈ గడువు సరిపోతుందని భావిస్తున్నారు. బతుకమ్మ తర్వాత రంజాన్‌, క్రిస్మస్‌ పండగల సందర్భంగా పంపిణీ చేయనున్న చీరలను గతంలో ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసేవారు. ఇప్పుడు వీటిని సైతం సిరిసిల్ల ఇతర ప్రాంతాల్లోని కార్మికులతో తయారు చేయించాలని మంత్రి సూచించారు. గత సెప్టెంబరులో బతుకమ్మ చీరల పంపిణీ అనంతరం కొన్ని వేల చీరలు మిగిలిపోగా వాటిని రంజాన్‌, క్రిస్మస్‌లకు ఇచ్చారు. వాటికి ఆదరణ లభించిందని అధికారులు చెప్పడంతో ఈసారి బతుకమ్మ చీరల ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించారు.
త్వరలో డిజైన్ల ఖరారు: బతుకమ్మ చీరల తయారీ సందర్భంగా డిజైన్లపై చేనేత, జౌళి శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. చీరల నాణ్యత, ప్రింటింగు, కొంగులు, అంచులు, రంగులు ఇతరత్రా సమస్యలు ఏమీ రాకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈసారి వేయి డిజైన్లను తయారు చేసి, వీటిని మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారిణులకు చూపించి, అందరి ఆమోదం పొందిన వాటిని ఎంపిక చేస్తారు. గతంలో బతుకమ్మ చీరల పంపిణీ సందర్భంగా సరైన ప్రచారం జరగక కొంత గందరగోళం ఏర్పడటంతో ఈసారి ముందస్తుగా ప్రచారం కల్పిస్తారు. మిల్లుల్లోనే చీరలు తయారవుతున్నందున వీటిపై ముందస్తు అవగాహన కల్పిస్తారు.

Monday, 5 February 2018

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ మొ–క్యాష్‌


ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ మొ–క్యాష్‌


డబ్బులు అత్యవసరమా? అయితే ఇంకేం తక్షణమే పొందండి. అదేలా అనుకుంటున్నారా? ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ మొ–క్యాష్‌ మొబైల్‌ యాప్‌ సాయంతో. ఇన్‌స్టంట్‌ లోన్, క్రెడిట్‌ కార్డు ఫీచర్ల అనుసంధానంతో బ్యాంక్‌ ఈ యాప్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీన్ని గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.  
ప్రత్యేకతలు...
♦ ఇన్‌స్టంట్‌ అప్రూవల్‌: కేవలం మూడు నిమిషాల్లో క్రెడిట్‌ లిమిట్‌ను తెలుసుకోవచ్చు.  
♦  క్రెడిట్‌ లిమిట్‌లో ఎంత అవసరమో అంతే వాడుకోవచ్చు. ఈ విధంగా రుణంగా తీసుకున్న మొత్తానికి వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. అంటే క్రెడిట్‌ లిమిట్‌ రూ.5,00,000 ఉంటే దానిలో రూ.2,00,000 ఉపయోగించాం. అప్పుడు రూ.2 లక్షలను వడ్డతో సహా చెల్లించాలి.  
♦ ఎప్పుడు అవసరమనుకుంటే అప్పుడు డబ్బుల్ని బ్యాంక్‌ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. మొత్తం 100 శాతం క్రెడిట్‌ లిమిట్‌ను బ్యాంక్‌ అకౌంట్‌కు పంపుకోవచ్చు.  
♦ రుణాన్ని తిరిగి సరళమైన ఈఎంఐల రూపంలో చెల్లించొచ్చు.
♦ క్రెడిట్‌ కార్డు కూడా పొందొచ్చు. దీన్ని రిటైల్, ఆన్‌లైన్‌ షాపింగ్‌కు ఉపయోగించుకోవచ్చు. బ్యాంక్‌ ఈ క్రెడిట్‌ కార్డు ద్వారా కస్టమర్లకు పలు ప్రయోజనాలను, ఆఫర్లను అందిస్తోంది.  
గమనిక:  ఉద్యోగం చేసేవారు, స్వయం ఉపాధి పొందేవారు ఈ సేవలు పొందడానికి అర్హులు. నెలవారీజీతం రూ.25,000కు పైన ఉండాలి. 

బిట్‌కాయిన్‌పై ఆయన జోస్యం నిజమౌతుందా?




 బిట్‌కాయిన్‌.. ఇటీవల కాలంలో తరచూ వినపడుతున్న పేరు. కొద్ది నెలల క్రితం జీవనకాల గరిష్ఠాలకు చేరిన దీని విలువ.. మళ్లీ అదే స్థాయిలో పతనమవుతూ వార్తల్లో నిలుస్తోంది. ఈ పతనం తాత్కాలికమేనని కొందరు వాదిస్తుండగా.. మరికొందరు ఇవి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని హెచ్చరిస్తున్నారు. అయితే, 2008 ఆర్థిక మాంద్యాన్ని ముందుగానే ఊహించిన ప్రముఖ ఆర్థిక వేత్త కూడా ఇదే మాట చెబుతున్నారు! మానవ చరిత్రలో ఇదో పెద్ద బుడగ అని హెచ్చరిస్తున్నారు!!
అమెరికా సహా ప్రపంచ దేశాల్లో 2008లో ఆర్థిక సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. మనదేశంలో బ్యాంకింగ్‌ రంగం పటిష్ఠంగా ఉండడంతో అప్పట్లో దీని ప్రభావం పెద్దగా పడలేదు. అయితే, ఆ ముప్పును ముందుగానే ఊహించారు అమెరికాకు చెందిన రౌబిని మ్యాక్రో అసోసియేట్స్ ఛైర్మన్‌, ప్రముఖ ఆర్థికవేత్త నోరియెల్‌ రౌబిని. డాక్టర్‌ డూమ్‌గా ప్రసిద్ధికెక్కిన ఈయన అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌)లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ప్రమాదాన్ని ముందే హెచ్చరించారు. ఇప్పుడు అదే వ్యక్తి బిట్‌కాయిన్‌పై కూడా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
‘బిట్‌కాయిన్‌ విలువ 8 వేల డాలర్ల దిగువకు చేరి 7వేల డాలర్ల దిశగా పయనిస్తోంది. జీవనకాల గరిష్ఠాలతో పోలిస్తే దీనివిలువ 60 శాతం తగ్గింది. గత నెలలో 40 శాతం.. ఒక్కరోజులో 10 శాతం పడిపోయంది. మానవ చరిత్రలో ఇదో అతిపెద్ద బుడగ అని’ ట్విటర్‌లో పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా బిట్‌కాయిన్‌ పట్ల ఆందోళనలు వ్యక్తమవుతుండడంతో coinmarketcap.com వెబ్‌సైట్‌ ప్రకారం దీని విలువ శుక్రవారం 8వేల డాలర్ల దిగువకు చేరింది. 2013 డిసెంబర్‌ తర్వాత  వారంలో ఈ స్థాయిలో విలువ పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత వారం సుమారు 400 బిలియన్‌ డాలర్ల సొమ్ము ఆవిరైంది. జనవరిలో వీటి గరిష్ఠంతో పోలిస్తే ఇది సగం సంపదతో సమానం. 2017లో వీటి విలువ దాదాపు వెయ్యి శాతం పెరిగింది.బిట్‌కాయిన్‌ తర్వాత పేరుమోసిన వర్చువల్‌ కరెన్సీలైన ఈతరెమ్‌, రిపిల్‌ విలువ సైతం 20 శాతానికి పైగా పడిపోయాయి.
కాగా, బిట్‌కాయిన్‌పై ప్రపంచదేశాల్లోని వివిధ మార్కెట్‌ నియంత్రణ సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. వీటిలో పెట్టుబడి ఏమాత్రం సురక్షితం కాదని హెచ్చరిస్తున్నాయి. మరోవైపు క్రిప్టోకరెన్సీని చట్టబద్ధం చేసేదేమీ లేదని భారత్‌ ఇటీవల స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దక్షిణకొరియా, చైనా సైతం అదే బాటలో నడుస్తున్నాయి. వీటికి సంబంధించిన ప్రకటనలను నిషేధిస్తామని ఫేస్‌బుక్‌ సైతం ఇటీవల వెల్లడించింది. మరోవైపు బిట్‌కాయిన్‌ విలువ పడిపోవడం తాత్కాలికమేనని మరికొందరు అంటున్నారు.

నల్లగొండ జిల్లాలో కాల్‌డేటా’తో కలకలం కాల్‌డేటా’తో కలకలం


బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య కేసుపై ‘సాక్షి’ కథనంతో కదలిక
 హైదరాబాద్‌: నల్లగొండ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య కేసులో ‘కాల్‌డేటా’కలకలం రేపుతోంది. నిందితుల కాల్‌డేటా, పోలీసుల తీరుపై సందేహాలతో ‘సాక్షి’ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. శ్రీనివాస్‌ హత్య జరిగి 11 రోజులైనా నిందితుల కాల్‌డేటాను విశ్లేషించకపోవడం, కుట్రకు సూత్రధారులను గుర్తించకపోవడంపై ఉన్నతాధికారుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.  
తొక్కిపెట్టారా? 
శ్రీనివాస్‌ హత్య జరిగిన మరుసటిరోజు కొంత మందిని అరెస్టు చేయడం, తర్వాతిరోజు మరో ముగ్గురిని కటకటాల్లోని నెట్టడం జరిగింది. అంతటితో కేసు క్లోజ్‌ అయిందనేలా కథ నడిపించారు. కానీ హత్యకు కుట్ర ఎవరిది, నిందితులు ఎవరి ప్రోద్బలంతో హత్య కు పాల్పడ్డారన్నది పట్టించుకోలేదు. వాస్తవానికి ఏదైనా తీవ్రస్థాయి నేరం జరిగితే.. నిందితులు, వారికి సహకరించినవారు, ఆర్థిక సాయం చేసిన వారు, షెల్టర్‌ ఇచ్చిన వారు.. ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాల్సి ఉంటుంది. నిందితుల ‘కాల్‌డేటా’ను విశ్లేషించి కేసును కుట్ర దగ్గరి నుంచి పెకలించాల్సి ఉంటుంది. 
కానీ నల్లగొండలో బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యకు సంబంధించి పోలీసులు ఈ తరహా చర్యలేవీ చేపట్టకపోవడంపై అటు రాజకీయవర్గాల్లో, ఇటు పోలీసువర్గాల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాల్‌డేటాను సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలని హైకోర్టు ఆదేశించడంతో.. దర్యాప్తు అధికారుల్లో వణుకు మొదలైందని, అందుకే పారిపోవడం దాకా వెళ్లిందని చర్చ జరుగుతోంది. అయితే కాల్‌డేటాను బయటకు రాకుండా చేసిందెవరు, ఎస్పీతో పాటు డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్లపై ఒత్తిళ్లు పనిచేశాయి, కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తున్నట్లుగా దీని వెనుక అధికార పార్టీ నేతలున్నారా.. అన్న అనుమానాలు వస్తున్నాయి. 
ఈ ప్రెస్‌నోట్‌ అర్థమేంటి?
శ్రీనివాస్‌ హత్య కేసు నిందితుల ఫోన్‌కాల్‌ డేటాలో ఉన్న అనుమానితులను విచారిస్తామని, వారు కుట్ర లో భాగస్వాములైతే అరెస్టు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంటూ నల్లగొండ జిల్లా ఎస్పీ ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే కోర్టులో కస్టడీ పిటిషన్‌ వేసి, నిందితులను లోతుగా విచారిస్తామని అందులో తెలిపారు. ఇక ఈ కేసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పారదర్శకంగా జరుగుతుందని పేర్కొన్నారు. అంటే ఇప్పటివరకు జరిగిన విచారణ, దర్యాప్తు అంతా డొల్లేనని పరోక్షం గా అంగీకరించినట్లేనా అన్న విమర్శ వస్తోంది. ఇక ఎస్పీ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన సంతకం లేకపోవడంపైనా చర్చ జరుగుతోంది. 
ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర చేతికి..! 
ఉన్నతాధికారులు బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య కేసును ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర చేతికి అప్పగించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎస్పీ, ఇతర అధికారులు ఈ కేసు దర్యాప్తును గందరగోళంలో పడేయడంతో.. పారదర్శకంగా దర్యాప్తు చేసేలా ఈ చర్య చేపట్టినట్లు సమాచారం.  
అసలేం జరుగుతోంది?
నల్లగొండ జిల్లాలో ఇటీవలే వరుసగా రెండు హత్యలు, వాటి దర్యాప్తులో పోలీసు అధికారులు, సిబ్బంది వ్యవహరించిన తీరుపై పోలీసువర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. పోలీసు శాఖ ప్రజలకు జవాబుదారీగా ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు చేపడుతుంటే.. జిల్లాల్లో అధికారుల తీరు అందుకు భిన్నంగా పోలీసు శాఖ మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా కనిపిస్తోందని వ్యాఖ్యలు వస్తున్నాయి. 

భీకర శబ్దానికి బెంబేలు ఉనికి చాటుకుంటున్న తేనె కుక్క కావేరి వన్యధామంలో అరుదైన అతిథి


భీకర శబ్దానికి బెంబేలు 
ఉనికి చాటుకుంటున్న తేనె కుక్క 
కావేరి వన్యధామంలో అరుదైన అతిథి 


అత్యంత అరుదుగా కనిపిస్తూ..అరుపులతో దాదాపు 30 కి.మీ.ల మేర దద్దరిల్లే భీకరమైన శబ్దాలు చేసే అరుదైన జీవి హనీ బ్యాడ్జర్‌ (తేనె కుక్క). ప్రస్తుతం కావేరి వన్యధామంలో సంచరిస్తోంది. ఈ జీవి సంచారం వన్యజీవి అధ్యయనకర్తలకు, అటవీ శాఖకు ఒకింత ఉత్సాహం నింపింది. ఎందుకంటే 25 ఏళ్ల క్రితం దక్షిణాఫ్రియా అడవుల్లోనే గుర్తించిన ఈ జీవి ప్రస్తుతం కర్ణాటకలో కనువిందు చేస్తోంది. రెండేళ్ల క్రితం మల మహదేశ్వర, హలగూరు పరిసరాల్లోని బసవన బెట్ట కొండల్లో మాత్రమే కనిపించిన చిన్నపాటి ఎలుగుబంటిని పోలినట్టుండే తేనె కుక్క ఇటీవలి కాలంలో కావేరి వన్య ధామంలో కనిపించింది. ఈ జీవి సంచారంతో రాష్ట్ర జీవ వైవిధ్యం మరింత పెంచినట్లయిందని అటవీ శాఖ ప్రకటించింది. ఇంతకీ అరుదుగా చెప్పుకొనే ఈ జీవి ప్రత్యేకతలు ఓసారి తెలుసుకుందాం.
పులి, సింహాల్ని కూడా  అడ్డుకునే తెగువ
చూసేందుకు చిన్నపాటి ఎలుగుబంటి, పెద్దగా ఉండే ముంగిసలా కనిపిస్తుంది. నడకలో కుక్కను పోలి ఉంటుంది. వీపుపై తెల్లని ఛాయలుండే నల్లని ఈ జీవి చూసేందుకు భీతి గొలిపేలా ఉంటుంది. తాను నివసించే పరిసరాల నుంచి ఆడ జీవి అయితే గరిష్ఠంగా 10 కి.మీ.లు, మగ జంతువైతే 30 కి.మీ.ల వరకు సంచరించగలదు. విష సర్పాలను ప్రధాన ఆహారంగా తినే ఈ జీవి కలుగులో ఉన్న కొండ ఎలుకల్ని ఎంతో ఇష్టంగా తింటుందని ప్రముఖ వన్యజీవి పరిరక్షకులు సంజయ్‌ గుబ్పి చెబుతున్నారు. మాంసాహారి అయిన ఈ జంతువుకు పులి, చిరుత, సింహాలను సైతం తన అరుపులు, భయంకరమైన సంజ్ఞలతో నిలువరించే సత్తా ఉందని ఆయన తెలిపారు. నక్కలు, తోడేళ్లు, ఎలుగుబంట్లు, ఏనుగులు దీన్ని చూడగానే దారి తప్పుకొని వెళ్తాయి. నేలపై ఆహారం అందని సమయంలో చెట్లపై ఉండే తేనె తుట్టెల్ని తింటూ జీవనం సాగిస్తుంది.
లాంఛనంగా కూడా..
ఈ జంతువు సంచారాన్ని గుర్తించిన అటవీ శాఖ అధికారులు కావేరి వన్య ధామానికి ఇదే జీవి చిత్రంతో లాంఛనాన్ని తయారు చేశారు. తర్వాత ఎక్కువ సంఖ్యలో ఉండి మనుగడ కోసం పోరాడే జీవుల గురించి ఆలోచన మొదలు పెట్టారు.  ఈ జీవి సంతతిని మరింత పెంచుతూ వాటిని పరిరక్షించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు కావేరి ఆర్‌ఎఫ్‌ఓ రమేష్‌ రాజు చెప్పారు. ఈ జీవుల జీవన విధానాన్ని మరింత సునిశితంగా పరిశీలించి వాటి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టనున్నాం. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రెండు, మూడు అటవీ ప్రాంతాల్లోనే కనిపించే ఈ జీవి అనధికారికంగా ఎన్ని చోట్ల ఉన్నాయో ఇంకా తెలియాల్సి ఉందన్నారు. కేంద్ర పర్యావరణ శాఖ సహకారంతో దేశ వ్యాప్తంగా చేపట్టే సమీక్షల్లో ప్రస్తుతం కావేరి వన్యధామంతో పాటు మల మహదేశ్వర కొండలను చేర్చి ఈ జీవి వివరాలు సేకరిస్తామన్నారు.