Sunday, 4 February 2018

ఫేస్‌బుక్‌ కీచకులు.. వాట్సాప్‌ రావణులు ఉన్నారు జాగ్రత్త!

ఫేస్‌బుక్‌ కీచకులు.. వాట్సాప్‌ రావణులు
ఉన్నారు జాగ్రత్త!
సరదాగా సెల్ఫీ దిగి.. వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టడం... ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాలో ఫొటోలు అప్‌లోడ్‌ చేయడం... మనలో ఎక్కువమంది రోజూ చేస్తున్నదే. మంచిదే. టెక్నాలజీని  వాడుకోవడం కూడా తప్పేమీ కాదు. కానీ మనకు సంబంధించిన విషయాలూ, ఫొటోలు దుర్వినియోగం అయి... మన పరిచయస్తులూ, సన్నిహితులకు కాకుండా... కొత్తవారికి తెలిసి.. బెదిరింపులు ఎదురైతేనే సమస్య. అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే... కొన్ని జాగ్రత్తలు తప్పవు. 

*కీర్తి హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతోంది. ఓరోజు ఉదయం ఫేస్‌బుక్‌ తెరిచింది. అకౌంట్‌నుంచి పదుల సంఖ్యలో ఫ్రెండ్‌ రిక్వెస్టులు వెళ్లాయి. ఫొటోలు, వీడియోలు ఫార్వర్డ్‌ అయ్యాయి. ఫోన్‌ హ్యాక్‌ అయిందని తెలిసింది. పోలీసులు ఆరా తీస్తే క్లాసులోని రోహిత్‌ ఇదంతా చేశాడని తెలిసింది. కీర్తి స్నేహితురాలు జెన్నీ ద్వారా పాస్‌వర్డ్‌ సంపాదించటంతో అతని పని సులువైంది. 
*స్వాతికి వాట్సప్‌లో అశ్లీల ఫొటోలు, వీడియోలు విపరీతంగా వచ్చేవి. నాలుగైదు రోజుల తరువాత సైబర్‌ క్రైమ్‌ ఆఫీసుకి వెళ్లి కంప్లయింట్‌ ఇచ్చింది. ఆరాతీస్తే.. యూపీ నుంచి అంకిత్‌ అనే మైనర్‌ ఇదంతా చేస్తున్నాడని తెలుసుకుని హైదరాబాద్‌కి పిలిపించారు. అంకిత్‌ అమాయకుడు. ఇంకా తీగలాగితే.. హైదరాబాద్‌లో స్వాతి ఇంటి దగ్గర ఉండే ఒకడు అంకిత్‌ సిమ్‌ నంబర్‌తో వాట్సప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని అలా వేధించాడని తేలింది. 
*ఫుడ్‌ డెలివరీ కంపెనీలో పని చేసే రంజిత్‌ వందలమంది మహిళల ఫోన్‌ నంబర్లు సంపాదించాడు. వారి వాట్సప్‌లకు అసభ్యకరమైన రాతలతో పాటు.. అశ్లీల ఫొటోలూ, వీడియోలు రోజూ పంపించేవాడు. ఎవరికీ చెప్పుకోలేక.. చాలామంది మహిళలు మానసికంగా కుంగిపోయారు. కొందరయితే సిమ్‌కార్డ్‌నే మార్చేశారు. ఓ ప్రొఫెసర్‌నూ ఇలానే వేధించాడు. ఆమె తన భర్తకు విషయం చెప్పి సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు చేసింది. కేస్‌ బుక్‌ అవుతూనే.. రంజిత్‌ను ట్రేస్‌ చేసి పోలీసులు పట్టుకున్నారు. అతని ఫోన్‌లో నూటయాభైకి పైగా మహిళల నంబర్లున్నాయి. ‘నాకిదో హాబీ’ అని రంజిత్‌ చెప్పుకొచ్చాడు. మరో ముగ్గురు మహిళలు రంజిత్‌పై రిపోర్ట్‌ చేయడంతో.. పోలీసులు పీడీయాక్ట్‌ ఫైల్‌  చేసి జైలుకి పంపించారు. 
ఇవన్నీ ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ సెల్‌కి వచ్చిన కేసులు. అదీ స్మార్ట్‌ఫోను వల్లే. మీ ఫోన్‌ మీ దగ్గరే ఉండొచ్చు. మీ వ్యక్తిగత అవసరాలకే వాడుకుంటూ ఉండొచ్చు. కానీ వీటి వినియోగం వల్ల ఎలా, ఎవరితో, ఏ నిమిషం.. వేధింపులకి గురికావల్సి వస్తుందో అర్థం కాని పరిస్థితి. అలాగని మహిళలు ఫోన్‌ వాడకుండా ఉండలేరు కదా! ‘ముఖ్యంగా ఈ డిజిటల్‌ కాలంలో ఫోన్‌లోనే మాటామంతీ. కొంతమందైతే ఎదురెదురుగా వచ్చినా పలకరించరు. వాట్సప్‌, ఫేస్‌బుక్‌లో మెసేజ్‌ చేస్తే చాలు.. ఇట్టే స్పందిస్తారు. వీళ్లు ఎక్కువగా వర్చువల్‌ ప్రపంచంలోనే ఉంటారు. ఆగంతుకుల బారిన పడేవారిలో ఇలాంటివాళ్లే ఎక్కువ...’ అంటారు మానసిక నిపుణులు.
ఓటీపీ సెట్‌ చేసుకోవాలి! 
* ఫోను చేసుకోవడానికో లేదా తమ ఫోనులో ఉన్న సమస్యను పరిష్కరించమంటూ అమ్మాయిలు ఫోన్‌ని తెలిసినవారికి ఇస్తారు. అతడే సైబర్‌ నేరగాడు అయి ఉండొచ్చు. ఫోను తీసుకున్న వెంటనే నిమిషాల వ్యవధిలోనే ఉచితంగా దొరికే స్పై అప్లికేషన్స్‌ను అందులో డౌన్‌లోడ్‌ చేయొచ్చు. అదే జరిగితే మీ ఫోను డ్యాష్‌బోర్డులా ఉపయోగపడుతుంది. మీరు పంపే మెసేజ్‌లు, వాట్సప్‌తో పాటు ఫేస్‌బుక్‌ ఛాట్‌, ఫొటోలు, వీడియోలు.. అన్నీ చూడగలుగుతాడు. బ్లాక్‌మెయిల్‌ చేసే ప్రమాదం ఉంటుంది. 
* అమ్మాయిల ఎఫ్‌బీ అకౌంట్స్‌కి ‘మీ ఫోన్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోండి, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్‌ ఉన్నాయి’ అంటూ మెసేజ్‌  చేస్తారు. దాన్ని నమ్మితే ఫేస్‌బుక్‌ హ్యాక్‌ కావచ్చు. మీ ఫోన్‌తో పాటు పీసీ కూడా హ్యాక్‌ అవుతుంది. 
* ఫోన్లలో లాక్‌లు తెరిచేప్పుడు మీ వేళ్ల కదలికను బట్టి సైబర్‌ నేరగాళ్లు వాటిని గుర్తుంచుకునే అవకాశం ఉంటుందనీ మరవకూడదు. 
* ఫేస్‌బుక్‌ను ఓపెన్‌ చేయాలంటే ఓటీపీ లాగిన్‌ను పెట్టుకోవాలి. సీక్రెట్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫోన్‌ నంబర్‌ను ఎంటర్‌ చేస్తే చాలు. ఎవరైనా మీ ఫేస్‌బుక్‌ను హ్యాక్‌ చేస్తే ఓటీపీ మీ ఫోన్‌కు వస్తుంది. అలా సులువుగా అర్థమవుతుంది. ఈమెయిల్‌కీ ఇదే వర్తిస్తుంది. 
* అమ్మాయిలు ఫొటో ఎడిటింగ్‌ యాప్స్‌ను థర్డ్‌పార్టీవి డౌన్‌లోడ్‌ చేయకూడదు. కొందరు ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేప్పుడు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు వాడుతుంటారు. ఈ థర్డ్‌పార్టీ యాప్స్‌ మీ కార్డుల చిట్టాను చెబుతాయి.
* ఈ మధ్యకాలంలో నేరగాళ్లు కొత్తపంథా అనుసరిస్తున్నారు. అమ్మాయిల ఫోన్‌ నెంబర్‌ తీసుకుని డీపీ ఫొటోను డౌన్‌లోడ్‌ చేసుకుంటారు. కొన్ని టూల్స్‌ ఉపయోగించి ఆ అమ్మాయితో నేరగాడు క్లోజ్‌గా చాట్‌ చేసినట్లు క్రియేట్‌ చేసి దాన్ని స్క్రీన్‌షాట్‌ తీసి వాళ్లకే పంపిస్తారు. అలా బ్లాక్‌మెయిల్‌ చేస్తారు. ఈ నియమాలు అమ్మాయిలకే కాదు స్మార్ట్‌ఫోన్‌ వాడే ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి. 
* ఒకవేళ ఫోను పోగొట్టుకుంటే వాట్సాప్‌ అకౌంట్‌ని తొలగించాలి.  ముఖపరిచయం లేని వ్యక్తుల నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ను అనుమతించకూడదు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో ఫొటో డౌన్‌లోడ్‌ చేయకుండా సెట్టింగ్‌లు పెట్టుకోవాలి. అనుమతించే ముందు ఒకటికి రెండు సార్లు గమనించుకోవడం మంచిది. పబ్లిక్‌ వైఫైలు వాడకుండా స్వీయ నియంత్రణ తప్పనిసరి. 
మన జీవితం ఇతరులకెందుకూ...?
‘‘కొందరమ్మాయిలు పొద్దస్తమానం వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో స్టేటస్‌లు అప్‌లోడ్‌ చేస్తుంటారు. ఫొటోను ఎవరెవరు చూశారో, ఎంతమంది లైక్‌ చేశారోనని పదే పదే గమనిస్తుంటారు. మరి కొందరైతే బ్యూటీ యాప్స్‌ కనిపిస్తే చాలు వాటి వివరాలేవీ తెలుసుకోకుండా డౌన్‌లోడ్‌ చేసుకుంటారు. వేధింపులకు గురయ్యేవారిలో ఇలాంటివారే ఎక్కువ. ‘దాదాపు ఎనభై ఐదు శాతం మంది సైబర్‌ నేరగాళ్లు 18 నుంచి 35 ఏళ్ల వయసువారే. ఏ వయసువాళ్లు ఎలాంటి యాప్స్‌కి ఆకర్షితులవుతారో, ఎలాంటి మెసేజ్‌లకు స్పందిస్తారో వాళ్లకు బాగా తెలుసు. ప్లేస్టోర్‌లో ఏదో యాప్‌ కనపడింది కదా అని డౌన్‌లోడ్‌ చేయకూడదు. ముందు వాటి నియమ నిబంధనలు చదవాలి. ఎక్కువ అనుమతులు అడుగుతుంటే ఆలోచించాల్సిందే. మీ జీవితంలోని ఆనందకరమైన సమయాలూ, బాధపడ్డ సందర్భాలూ, ఇష్టాయిష్టాలూ, వెళ్లిన రెస్టారంట్‌, చూసిన లేదా చూస్తోన్న సినిమా.. ఇలా ప్రతిదీ స్టేటస్‌ల రూపంలో పెట్టి.. మన వ్యక్తిగతాలు అపరిచితులకు  తెలియజేయడమెందుకూ? ఒక పోస్ట్‌ పెడితే ప్రపంచమంతా చూస్తుంది...సరే! ఆ ప్రపంచంలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న మేకవన్నె పులులూ పొంచి ఉంటాయనే విషయం ఎందుకు గుర్తించలేకపోతున్నారు. అవసరం మేరకే ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లను వినియోగించాలి. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా సోషల్‌ వెబ్‌సైట్స్‌లో స్వీయ నియంత్రణతో మెలగాలి’ అంటారు భరోసా టీమ్‌ ఏసీపీ కవిత.

అమెరికాను వదిలేసి స్వదేశానికి వెళ్లిపోతానంటున్న ఓ భారతీయ మహిళ చెప్పిన నిజాలివి

అమెరికా.. అమెరికా.. అమెరికా.. అందమైన అమ్మాయిలాంటి అమెరికా.. ఎంత చూసినా తనివితీరని అమెరికా..’.. ఇది అగ్రరాజ్యం అమెరికా గురించి ఓ తెలుగు సినిమాలోని పాట. ఈ పాటలోని చరణాలకు తగ్గట్టే అమెరికా అంటే ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ మోజు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది విద్యావంతులు అమెరికాకు వలస వెళ్తున్నారు. ఉద్యోగం చేయడానికో, చదువుకోవడానికో.. ఏదో ఒక కారణంతో అమెరికా విమానం ఎక్కేస్తున్నారు. అక్కడి వాతావరణంపై ఇష్టం పెంచుకుని, అక్కడి జీవితంపై మక్కువ పెంచుకుని, ఆ దేశాన్ని విడిచి రాలేక.. అగ్రరాజ్యంలోనే సెటిలైపోతున్న భారతీయుల సంఖ్య తక్కువేమీ కాదు. ప్రతియేటా అమెరికా పౌరసత్వం పొందేందుకు ఇచ్చే గ్రీన్ కార్డు కోసం ఎన్నో లక్షల దరఖాస్తులు వస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. లగ్జరీ లైఫ్.. వేలాది డాలర్ల జీతం.. అమెరికాలో వీటిని వదులుకుని ఎవరైనా స్వదేశానికి వస్తారా..? ట్రంప్ ఇవాళ ఉంటారు.. రేపు మరొకరు అధ్యక్షుడిగా వస్తారు.. ఈ మాత్రం దానికే అగ్రరాజ్యాన్ని శాశ్వతంగా వదిలేసి వెళ్లిపోతారా..? అంటే ఓ ఎన్నారై మహిళ మాత్రం అవుననే సమాధానం చెబుతోంది. ట్రంప్ భయంతో కాకున్నా, వేలాది డాలర్ల జీతం వస్తున్నా, లగ్జరీ లైఫ్ ఉన్నా, పిల్లలకు ఉన్నత విద్యాభ్యాసం అందించే అవకాశం ఉన్నా.. తాము మాత్రం భారత్‌కు వెళ్లిపోతామని తేల్చిచెబుతోంది. ఆమె బాధ ఏంటో, ఆలోచన ఏంటో.. అమెరికాను వదిలేసి భారత్‌కు వెళ్లిపోయేందుకు కారణమైన తన మనసులోని భావాలు ఏంటో ఆమె మాటల్లోనే..
నా పేరు గౌరీ ధనీ, అమెరికాలోని ఫిలిప్స్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. మసాచ్చుయేట్స్ రాష్ట్రంలోని బోస్టన్‌లో భర్తతో కలిసి ఉంటున్నా. భారతీయులు అమెరికాను విడిచిపెట్టి స్వదేశానికి వెళ్లిపోతున్నారా..? అని చాలామంది స్నేహితులు నన్ను అడిగారు. వాళ్లకు నేను సమాధానం చెప్పదలచుకున్నాను. అందరు భారతీయుల సంగతి నేను చెప్పలేను కానీ.. నేను నా భర్త మాత్రం స్వదేశానికి వెళ్లాలనుకుంటున్నాము. ఇది ట్రంప్ భయంతోనో, జాత్యాహంకార దాడుల వల్లనో తీసుకున్న నిర్ణయం కాదు.. మా ఇద్దరి జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల తీసుకున్న నిర్ణయమిది. 
అమెరికాలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేయడానికి మేమిద్దరం అమెరికాకు వచ్చాం. అమెరికాలో చదువుకునేటప్పుడు డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాలి. విచ్చలవిడిగా ఖర్చు చేస్తే ఆ భారం కుటుంబంపై పడుతుంది. లోన్లు తీసుకుని చదువుకున్నా దాన్ని తీర్చేందుకు ఎంతో ప్రయాసపడాలి. ఖర్చుపెట్టే ప్రతి రూపాయి కూడా వృథా కాకుండా చూసుకోవాలి. ఓ రకంగా చెప్పాలంటే భారత్ నుంచి అమెరికాకు వచ్చిన విద్యార్థుల్లో ఎక్కువ శాతం ఆర్థికంగా సతమతమవుతుండేవాళ్లే. అమెరికా చదువుకు అయిన అప్పులు తీర్చి కొంత మొత్తాన్ని ఆదా చేయడానికి, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కనీసం నాలుగైదు ఏళ్లు పడుతుంది. అమెరికాలో ఉద్యోగం అనేది పర్మినెంట్ కాదు. ఎప్పుడు తీసేస్తారో తెలియదు. మనం సంపాదించే డబ్బును బట్టే అగ్రరాజ్యంలో మన జీవితం ఆధారపడి ఉంటుంది. పెళ్లి చేసుకున్నాక ఇక్కడే ఉండాలని నిర్ణయించుకుంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబంతో సంబంధం లేకుండా శ్రమజీవిలా మారాల్సి ఉంటుంది. భారత్‌లో సొంత ఇల్లు అంటే పెద్దకష్టమేమీ కాదు. మన పెద్దవాళ్లు రెండు కుటుంబాలు ఉండగలిగేలా ఇళ్లను నిర్మిస్తుంటారు. అదే ఇంట్లో కొడుకులు, కోడళ్లతో కలసి ఉంటుంటారు. కానీ అమెరికాలో సొంత ఇల్లు అంటే మాత్రం అంత సులభం కాదు.

అమెరికాలోని భారతీయుల ఇళ్లల్లో పనిచేసేందుకు పనిమనుషులు అంత సులభంగా దొరకరు. ఒకవేళ దొరికినా ఎవరు దొంగలో, ఎవరు నేరస్థులో తెలిసేనాటికి కొంపకొల్లేరవుతుంది. ఇంట్లో పనికి చేదోడు వాదోడుగా ఉంటారని భారత్ నుంచి తల్లిదండ్రులనో, అత్తమామలనో తెచ్చుకున్నా.. వారికి పర్మినెంట్ రెసిడెన్సీ కుదరదు. ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబంలో ఒక్కరు పనిచేస్తే అమెరికాలో బతకలేం. ఇద్దరూ పనిచేయాల్సిందే. పిల్లలు పుట్టాక పరిస్థితి మరీ ఘోరం. సాధారణంగా అయితే పిల్లలు పుట్టిన ఏడేళ్ల వరకూ తల్లి వారికి నిరంతరం తోడు ఉండాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా అమెరికాలో అది సాధ్యం కాదు. భారత్‌లో అయితే అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ, బాబాయి, పిన్ని, వదిన.. ఇలా ఒకరేమిటి.. ఊళ్లో అందరూ పిల్లల ఆలనా పాలనా చూసేందుకు ఎగబడతారు. కానీ అమెరికాలో ఆ పరిస్థితి అసలే లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరికి వారివే ఉరుకుల పరుగుల జీవితాలు. పిల్లల్ని డే కేర్ సెంటర్లో వదిలేయడం, సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు తీసుకు రావడం.. మళ్లీ లేవడం ఆఫీసుకు వెళ్లడం.. ఇదీ దైనందిన జీవితం. పిల్లలు ఎదుగుతున్న సమయంలో కూడా వాళ్లు ఏం చదువుతున్నారనే విషయాలపై ఆరా తీయడానికి సమయం ఉండదు. ఆఫీసుల్లో తల్లిదండ్రులు ఉంటే.. పిల్లలు ఎవరెవరితోనే స్నేహాల్లో మునిగితేలుతుంటారు. అవి ఒక్కోసారి కట్టుదాటి పోయేలా తయారయి.. జరగకూడని నష్టం జరిగేలా దారితీస్తాయి. కనీసం పిల్లలను భారత్‌కు పంపిద్దామనుకున్నా.. ఏ రెండేళ్లకో, మూడేళ్లకో ఒకసారి కుదురుతుంది కానీ.. మాటిమాటికి పంపించడం మాత్రం కుదిరే పనికాదు.

మేము అమెరికాలో ఉండటం వల్ల మూడు తరాలు నష్టపోతున్నాయి. ఓ వైపు మా తల్లిదండ్రులు, అత్తమామలు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. మేము డబ్బు సంపాదనలో పడి, అమెరికాలో ఉంటున్నామన్న పేరు కోసం వాళ్లకు దూరంగా ఉంటున్నాం. మరో వైపు పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమను దూరం చేస్తున్నాం. తప్పదు ఇక్కడ నామమాత్రంగానైనా బతకాలంటే ఇద్దరం పనిచేయాల్సిందే. మా జీవితాలను ఫణంగా పెట్టుకుంటూ మా పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమను దక్కకుండా చేయాల్సి వస్తోంది. ఇది జరగకూడదు. విద్య, ఉద్యోగం అంటూ ఓ రకంగా కుటుంబానికి మేము దూరం అయ్యాం. వాళ్ల వృద్ధాప్యంలో వారికి దగ్గర లేకుండా పోయాం. డబ్బు పంపించగలమేమో దగ్గర ఉండి ప్రేమతో చూసుకోలేకపోతున్నాం. డబ్బు సంపాదనలో పడి మాకు మేమే వాళ్ల ప్రేమకు దూరం అయ్యాం. ఆ పరిస్థితి మా పిల్లలకు రాకూడదు. నాయనమ్మ, అమ్మమ్మ ఆప్యాయత వాళ్లకు తెలియాలి. ప్రేమానుబంధాల విలువ వాళ్లు గుర్తెరగాలి. అందుకే మేము అమెరికాను వదిలేసి భారత్‌కు వెళ్లాలనుకుంటున్నాం ఇదీ ఓ ఎన్నారై మహిళ ఆవేదన.. గౌరి మాత్రమే కాదు.. ఎంతోమంది ఎన్నారైలు కుటుంబాన్ని వదిలేశామన్న బాధతో, తల్లిదండ్రులు, పిల్లల భవిష్యత్ కోసం అమెరికాను వదిలేసి భారత్‌కు వచ్చేశారు.. వచ్చేస్తున్నారు కూడా..

పేదవాళ్లో, ధనికులో చెబుతానంటున్న ఫేస్‌బుక్‌


లండన్‌: ఇప్పటి వరకు మీ స్నేహితులకు ఫొటోలు పంపించేందుకు, వాళ్లతో చాటింగ్‌ చేసుకోవడానికి ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ను ఉపయోగించుకుంటున్నారు. తమ అనుభవాలను ఫేస్‌బుక్‌ వేదికగా ఇతరులతో పంచుకుంటున్నారు. ఇప్పుడు ఫేస్‌బుక్‌ మీరు పేదవాళ్లో, ధనికులో చెప్పేస్తుందట. ఇందుకు సంబంధించిన టెక్నాలజీని తీసుకొచ్చేందుకు పేటేంట్‌కు దరఖాస్తు చేసుకుంది. సామాజిక-ఆర్థిక స్థితిగతుల ద్వారా వినియోగదారులను మూడు విభాగాలుగా విభజించనుంది. యూజర్లను శ్రామిక వర్గం, మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతిగా పరిగణించనుంది. దీనికి సంబంధించిన కొత్త సిస్టమ్‌ను రూపొందిస్తోంది.

ఫేస్‌బుక్‌ యూజర్‌ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, ఇంటర్నెట్‌ డేటా వినియోగం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని పేదవాళ్లో, ధనికులో తేల్చనుంది. ఇలా చేయడం వల్ల వినియోగదారుడికి అవసరమైన ప్రకటనలు వాళ్లకు అందుబాటులో ఉండేలా చూడనుంది. థర్డ్‌ పార్టీ తమ వస్తువు, సేవల గురించి యూజర్లకు తెలియజేసేందుకు ఈ సోషియో-ఎకానమీ స్టేటస్‌ ఉపయోగపడుతుందని కంపెనీకి చెందిన వర్గాలు వెల్లడించాయి. యూజర్‌ వయసు 20ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉంటే.. వాళ్లు ఎంత ఇంటర్నెట్‌ డేటాను వినియోగిస్తున్నారో పరిగణలోకి తీసుకుంటుంది. అదే 30 ఏళ్ల నుంచి 40ఏళ్ల మధ్య వయసు వాళ్లయితే.. సొంత ఇళ్లు ఉందా లేదా అనే ప్రశ్నలను ఫేస్‌బుక్‌ అడుగుతుంది. మీ విద్యార్హతలు, మీరు ఎక్కడెక్కడికి ప్రయాణించారు, ఎంత ఇంటర్నెట్‌ వాడుతున్నారు తదితర వివరాలను సేకరించనుంది. కానీ ఎక్కడా యూజర్‌ ఆదాయం వివరాలను మాత్రం అడగదు. వీటన్నింటిని అంచనా వేసి పేదవాళ్లో, ధనికులో ఫేస్‌బుక్‌ చెప్పేస్తుందట. త్వరలోనే ఈ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

బళ్లారి ఎంపీ శ్రీరాములుకు ట్రంప్‌ ఆహ్వానం

కర్ణాటకలోని బళ్లారి లోక్‌సభ సభ్యుడు శ్రీరాములును అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తమ దేశానికి ఆహ్వానించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎవరైనా గెలిచాక 130 దేశాల ప్రముఖులను ఆహ్వానించి ఆ దేశ సంప్రదాయాల ప్రకారం విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 7, 8 తేదీల్లో విందు ఏర్పాటు చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రముఖల జాబితాలో భారతదేశం నుంచి ఇద్దరు నేతలను ఎంపిక చేశారు.
వీరిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఒకరు కాగా, బళ్లారి ఎంపీ శ్రీరాములు మరొకరిగా ఉన్నారు. వీరిద్దరికీ ఇప్పటికే వైట్‌హౌస్‌ నుంచి ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు తనను ఆహ్వానించడం మరిచిపోలేని సంఘటన అని తెలిపారు.

నల్గొండలో నేటి నుంచి సీపీఎం రాష్ట్ర మహాసభలు

నల్గొండలో నేటి నుంచి సీపీఎం రాష్ట్ర మహాసభలు
                


 సీపీఎం తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఆదివారం నుంచి నల్గొండలో ప్రారంభం కానున్నాయి. పట్టణ శివారులోని లక్ష్మిగార్డెన్స్‌లో నాలుగు రోజుల పాటు సభలు కొనసాగనున్నాయి. అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యఅతిథిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, అతిథులుగా ప్రకాష్‌ కారాట్‌, బీవీ రాఘవులు, ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరు కానున్నారు. వామపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు మహాసభల్లో పాల్గొననున్నారు.

‘ఇండియన్స్‌ లవ్‌ ట్రంప్’ గ్రీన్‌కార్డు సమస్యలు పరిష్కరించడంటూ భారతీయుల ర్యాలీ

‘ఇండియన్స్‌ లవ్‌ ట్రంప్’
గ్రీన్‌కార్డు సమస్యలు పరిష్కరించడంటూ భారతీయుల ర్యాలీ

‘ప్రతిభ ఆధారిత వలస వ్యవస్థవైపు అడుగుల వేయాల్సిన తరుణమిది. మన దేశాన్ని ప్రేమించే వారు, గౌరవించేవారికి- మన సమాజం కోసం కృషి చేసేవారికి- నైపుణ్యవంతులకు.. ప్రతిభ ఆధారిత వలస వ్యవస్థను కల్పించనున్నాం’ అని  ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్రంప్‌ నిర్ణయానికి మద్దతుగా ఇల్లినాయిస్‌కు చెందిన ‘రిపబ్లికన్‌ హిందూ అలియన్స్‌’ ఆధ్వర్యంలో శనివారం శ్వేతసౌధం ఎదుట ర్యాలీ చేపట్టారు.
ప్రతిభ ఆధారిత వీసా వలస విధానానికి మద్దతు తెలుపుతూ ట్రంప్‌ చేసిన ప్రతిపాదనను అభినందిస్తూ ‘‘వి లవ్‌ ట్రంప్’’, ‘గ్రీన్‌కార్డు సమస్యలు పరిష్కరించండి’ అంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ‘ఎన్నో ఏళ్లుగా మేమంతా గ్రీన్‌కార్డు కోసం వేచి చూస్తున్నాం. ఏళ్లు గడుస్తున్నప్పటికీ మాకు గ్రీన్‌కార్డు రావడం లేదు. దీంతో మా పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారి విద్యకు ఆటంకం ఏర్పడుతోంది. గ్రీన్‌కార్డు సమస్యలను వెంటనే పరిష్కరించాల’ని కోరుతూ దాదాపు 200 మంది భారతీయులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 
లాటరీ ఆధారిత వీసా విధానానికి స్వస్థి పలికి ప్రతిభ ఆధారిత వలస వ్యవస్థ వైపు అడుగులు వేయడంతో అమెరికాలో వలసదారులకు శాశ్వత నివాసం ఏర్పాటుచేసుకునే విషయంలో ఎదురయ్యే కష్టాలు తీరనున్నాయి. అమెరికా మొత్తం మీద దాదాపు 3.5 మిలియన్ల మంది భారతీయులు ఉన్నారు. ఒక్క వాషింగ్టన్‌ రీజియన్‌లోనే దాదాపు 1.37లక్షల మంది భారతీయులు ఉంటున్నట్లు యూఎస్‌ జనాభా లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు కుటుంబ ఆధారిత వలస విధానాన్ని నియంత్రించేందుకు ఉద్యోగుల జీవిత భాగస్వాములు, వారి మైనర్ పిల్లలకే వీసా స్పాన్సర్‌షిప్‌ను పరిమితం చేసే ఆలోచనల్లో ట్రంప్‌ ప్రభుత్వం ఉంది.
పిల్లల రాకను అనుమతిస్తూ చేపట్టిన కార్యక్రమం ద్వారా  6,90,000మంది ప్రయోజనం పొందునున్నారు. అయితే ఇందులో న్యాయపరంగా అన్ని రకాలుగా సరైన పత్రాలను కలిగి ఉన్నవారికే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే పిల్లల విషయంలోనూ సమన్యాయం పాటించాలని భారతీయ టెకీలు అభిప్రాయపడుతున్నారు. ‘‘మా పిల్లలు ఇక్కడికి రావాలని వారేమీ అనుకోలేదు. మేము వారికి మంచి భవిష్యత్‌ అందించాలనే ఆలోచనతో ఇక్కడికి తీసుకొచ్చాం’’ అని పిల్లలకు గ్రీన్‌కార్డు మంజూరీ విషయంలో ఆలోచించాలని భారతీయ టెకీలు అంటున్నారు.
‘నేను ఇక్కడికి వచ్చినపుడు నాకు ఆరేళ్ల కూతురు ఉంది. 2007 నుంచి నేను గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తునే ఉన్నాను’ అని ఉత్తర కరోలినాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్న 45ఏళ్ల నందు కొండూరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘2011లో గ్రీన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఇప్పటికీ రాలేదు. నాకు 13ఏళ్ల అక్షిత ఉంది. గ్రీన్‌కార్డు రాకపోవడంతో ఇక్కడ నా కూతురు విద్యనభ్యసించడం ఇబ్బందిగా మారింది’ అని ఫ్లోరిడాలోని గెయిన్స్‌విల్లేలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్న రమేశ్‌ రామనాథన్‌ చెప్పుకొచ్చారు. వీళ్లే కాదు.. ఇలా ఎంతో మంది భారతీయులు గ్రీన్‌ కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Saturday, 3 February 2018

బిట్‌ కాయిన్‌.. జర భద్రం బ్రదరూ

డిసెంబరులో రూ.10 లక్షలకు పైగా 
ఇప్పుడేమో రూ.5 లక్షల స్థాయికి 
ప్రభావం చూపిన జైట్లీ ప్రకటన!?

క్రిప్టో కరెన్సీల్లో ప్రధానమైన బిట్‌కాయిన్‌ కొనుగోళ్లు, అమ్మకాలే దేశీయంగా అధికంగా జరుగుతున్నాయి. దీని విలువ గత డిసెంబరులో రూ.10 లక్షల (20,000 డాలర్ల వరకు) పైకి చేరగా, తాజాగా రూ.5 లక్షల స్థాయికి పడిపోవడంతో మదుపుదార్లు బెంబేలెత్తుతున్నారు. బిట్‌కాయిన్‌ సహా క్రిప్టోకరెన్సీలన్నీ చట్టవిరుద్ధమేనని, వాటిని వినియోగించకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో అరుణ్‌ జైట్లీ పేర్కొన్న సంగతి విదితమే. మరుసటి రోజే దేశీయంగా బిట్‌కాయిన్‌ విలువ భారీగా క్షీణించి, 8,000 అమెరికన్‌ డాలర్ల (సుమారు రూ.5.12 లక్షలు) కంటే దిగువకు చేరింది. ఈ విలువ ఎక్కడిదాకా పోతుందనేది ఎవరూ చెప్పలేని అంశం.
గిరాకీ, సరఫరా కనుగుణంగానే..
ఆయా దేశాల కరెన్సీలకు అక్కడి ప్రభుత్వాలు, కేంద్రీయ బ్యాంకులు విలువ నిర్థారిస్తుంటాయి. అంతర్జాతీయ విపణికి వచ్చేసరికి ఎగుమతి, దిగుమతి అవసరాల నిమిత్తం వినియోగించే తీరుకనుగుణంగా మారకపు విలువ ఉంటుంది. అయితే క్రిప్టోకరెన్సీలకు కేంద్రీయబ్యాంకుల ధ్రువీకరణ లేనందున, విలువ పూర్తిగా ఆన్‌లైన్‌ మదుపుదార్ల లావాదేవీలకు అనుగుణంగానే ఉంటుంది. వీటిపై సరైన అవగాహన లేకుండానే, ట్రేడింగ్‌ జరపుతున్న వారు ఎక్కువగా నష్టపోతున్నారని చెబుతున్నారు.
ఇన్ని రకాలున్నాయ్‌: బిట్‌కాయిన్‌ (బీటీసీ), రిపుల్‌ (ఎక్స్‌ఆర్‌పీ), ఇథెరిమ్‌, యూఎస్‌డీటీ, డైమండ్‌ (డీఎండీ), యాడ్‌టోకెన్‌ (ఏడీటీ), లుమెన్‌ (ఎక్స్‌ఎల్‌ఎన్‌), అడా (ఏడీఏ), వర్జ్‌ వంటి క్రిప్టోకరెన్సీల ట్రేడింగ్‌ దేశంలో జరుగుతోంది. దేశీయంగా జబ్‌పే (జడ్‌ఈబీపీఏవై), యూనోకాయిన్‌, కాయిన్‌ సెక్యూర్‌, కాయినెక్స్‌ వంటివి క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీల్లో వీటి ట్రేడింగ్‌ నడుస్తోంది. 24 గంటలూ ఈ లావాదేవీలు నడుస్తూనే ఉంటాయి.
విలువ తగ్గేందుకు ఇవీ కారణమా?
* దేశీయంగా  ఒక వ్యక్తి క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడి పెట్టాలంటే, మొబైల్‌ నెంబరు, బ్యాంక్‌ ఖాతా, పాన్‌ (శాశ్వత ఖాతా సంఖ్య), ఆధార్‌ ఉండాలి. బిటరెక్స్‌, బినాన్స్‌ వంటి అంతర్జాతీయ ఎక్స్ఛేంజీల్లో అయితే డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్ట్‌ వంటి వివరాలూ అందించాలి.
* ఒక బిట్‌కాయిన్‌ విలువ రూ.లక్షల్లో ఉండటంతో, తమ వద్ద ఉన్న నగదు మేరకు, అందులో భాగాన్ని (రూపాయల్లో పైసల్లా) కొనుగోలు చేసుకున్నారు. ‘మీరు వివరాలేమీ ఇవ్వనవసరం లేదు. మీరు పెట్టుబడి పెట్టండి, మీ తరఫున మేము లావాదేవీ నిర్వహించి, లాభాలు పంచుతాం’ అని డబ్బులు వసూలు చేసుకుని, బిచాణా ఎత్తేసి మోసగించిన వారు ఉన్నారు.
* క్రిప్టో కరెన్సీలు చట్ట విరుద్ధమని ప్రభుత్వం ప్రకటించినందున, ట్రేడర్లు, మదుపర్లకు వారి పాన్‌ ఆధారంగానే ఐటీ శాఖ నోటీసులు కూడా జారీచేస్తోంది. ఇవన్నీ కూడా మదుపర్లకు ఆందోళన కలిగిస్తున్న అంశాలే.
నీ కేవలం మన మొబైల్‌ వాలెట్‌లో ఉన్నట్లే, డిజిటల్‌ పరంగా మాత్రమే క్రిప్టో కరెన్సీలు ఉంటాయి కనుక, హ్యాకింగ్‌కూ చోటుంది. జపాన్‌లోని ఎంటీగాక్స్‌ ఎక్స్ఛేంజీలో 2014లో 480 మిలియన్‌ డాలర్ల విలువైన  క్రిప్టో కరెన్సీ హ్యాకింగ్‌ ద్వారా చోరీకి గురవ్వగా, ఈ ఏడాది జనవరి 26న జపాన్‌లోనే కాయిన్‌చెక్‌ ఎక్స్ఛేంజీలో 530 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.3,400 కోట్ల) విలువైన క్రిప్టో కరెన్సీ అపహరణకు గురయ్యింది. ఇవి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
* ఈ కరెన్సీల ప్రకటనలను ఫేస్‌బుక్‌ నిషేధించడం, దక్షిణకొరియా, చైనా, రష్యా వంటి దేశాలు క్రిప్టో కరెన్సీలకు నిబంధనలు రూపొందిస్తుండటంతో వీటి విలువలు క్షీణిస్తున్నాయి.
* కొత్తగా వీటిల్లో పెట్టుబడులు పెడదామనుకున్న వారు అప్రమత్తంగా ఉండాలి.