Monday, 29 January 2018

తలను వేరు చేసి.. నల్గొండలో మరో హత్య


నల్లొండ: వరుస హత్యలతో నల్గొండ పట్టణం వణికిపోతోంది. కొద్దిరోజుల క్రితమే నల్గొండ చైర్‌పర్సన్‌ భర్త శ్రీనివాస్‌ హత్యకు గురైన ఘటన మరువక ముందే పట్టణంలో మరో హత్య జరగడం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా ప్రకాశం బజార్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.  ప్రకాశం బజార్ సమీపంలో బొట్టుగూడలో ఓ దర్గా జెండా వద్ద తలను చూసి భయాందోళనకు గురైన స్థానికులు  పోలీసులకు సమాచారం ఇచ్చారు. నల్గొండ డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. డాగ్ స్కాడ్ ద్వారా పట్టణ శివారులోని భారత్ గ్యాస్ గోదాం సమీపంలో మొండాన్ని గుర్తించారు. మృతుడిని కనగల్‌కు చెందిన పాలకూరి రమేష్‌గా గుర్తించారు. మృతుడు డ్రైవర్‌గా పని చేస్తున్నాడని.. వివాహేతర సంబంధాలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హంతకులు మద్యం సేవించి హత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.

Sunday, 28 January 2018

హైదరాబాద్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన పొగమంచు

కాచిగూడ: పొగమంచు హైదరాబాద్‌ వాసులను ఉక్కిరిబిక్కిరిచేసింది. సోమవారం ఉదయం దట్టంగా అలుముకున్న పొగమంచు కారణంగా విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. కనుచూపు మేర ఏమీ కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అంబర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా అలుముకుంది. అంబర్‌పేటలోని ముసారాబాగ్‌ రహదారి వంతెనపై సోమవారం తెల్లవారు జామున కనిపించిన చిత్రాలివి.

పాక్‌ చేతికి చైనా ఆయుధ డ్రోన్‌..!

న్యూదిల్లీ: పాకిస్థాన్‌ చేతికి చైనా నుంచి ప్రమాదకరమైన ఒక ఆయుధం అందినట్లు భారత నిఘా వర్గాలు ధ్రువీకరించాయి. చైనాకు చెందిన వింగ్‌లూంగ్‌-1 అనే ఆయుధ డ్రోన్‌ ఒకటి పాకిస్థాన్‌కు చెందిన ఎంఎం ఆలమ్‌ వాయుసేన స్థావరంలో ఉన్నట్లు నిఘావర్గాలు నిర్ధరించుకున్నాయి. ఈ మానవ రహిత విమానం ద్వార 100 కిలోలబరువైన బాంబులు, క్షిపణులను ప్రయోగించవచ్చు. 20 గంటలపాటు 5000 కిలోమీటర్ల మేరకు ప్రయాణించగలదు. దీంతో భారత రాడార్లు అప్రమత్తమయ్యాయి.
 2017 నవంబర్‌లో ఎంఎం ఆలమ్‌ ఎయిర్‌పోర్టును ఒక ఉపగ్రహం చిత్రీకరించింది. ఈ సందర్భంగా అక్కడ నిలిపిఉన్న వింగ్‌లూంగ్‌ డ్రోన్‌ను కూడా చిత్రీకరించింది. ఈ చిత్రాన్ని అమెరికాకు చెందిన బార్డ్‌ కాలేజ్‌లోని డ్రోన్‌ అధ్యయన కేంద్రం విశ్లేషించింది. దాదాపు 14మీటర్ల  పొడవున్న రెక్కలు.. వీఆకారంలోని తోక ప్రపంచంలో వింగ్‌ లూంగ్‌-1 డ్రోన్లకు తప్ప మరే ఇతర డ్రోన్లకు లేదు. 2016లో ఒక వింగ్‌లూంగ్‌ డ్రోన్‌ ఒకటి ఆలమ్‌ స్థావరం వద్ద కూలిపోయింది. దీంతో చైనాడ్రోన్లను పాక్‌ వినియోగిస్తున్నట్లు నిర్ధరించుకున్నారు.
చైనా అండతో పాకిస్థాన్‌ మూడు రకాల డ్రోన్లను వినియోగిస్తోంది. ఫాల్కో, షాఫార్‌, బుర్రాక్‌ శ్రేణి డ్రోన్లను వాడుతోంది. వీటిలో బుర్రాక్‌ డ్రోన్లు దాడులు కూడా చేయగలవు. ప్రస్తుతం చైనా ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారు. చైనా వద్ద వింగ్‌ లూంగ్‌-1, వింగ్‌లూంగ్‌-2, డబ్ల్యూజే-600ఏడీ, యాంగ్‌ క్లౌడ్‌ షాడో, రెయిన్‌బో వంటి డ్రోన్లు ఉన్నాయి.
మరోపక్క భారత్‌ కూడా ఆయుధ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అమెరికాకు చెందిన ప్రిడేటర్లు, రేపర్ల కోసం బేరసారాలను నిర్వహిస్తోంది. మరోపక్క నిఘా కోసం ఇజ్రాయిల్‌కు చెందిన హెరాన్లను వినియోగిస్తోంది 

ఎంఆర్‌ఐ మెషిన్‌లో చిక్కుకుని యువకుడి మృతి

ముంబయి: ముంబయిలో దారుణం జరిగింది. ఎంఆర్‌ఐ మెషిన్‌లో చిక్కుకుని ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు రాజేశ్‌ మురు తల్లి నాయర్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఆమెను చూడటానికి శనివారం సాయంత్రం రాజేశ్‌ ఆసుపత్రికి వెళ్లాడు. ఈ సమయంలో వార్డ్‌బాయ్‌ ఆక్సిజన్‌ సిలిండర్‌ను ఎంఆర్‌ఐ గదికి తీసుకురమ్మని అతడ్ని కోరాడు. సిలిండర్‌తో రాజేశ్‌ వెళ్లిన వెంటనే స్కానింగ్‌ రూమ్‌లో ఎంఆర్‌ఐ మెషిన్‌కు ఉన్న అయస్కాంత శక్తి ఒక్కసారిగా అతడ్ని లాగింది. ఈ ప్రమాదంలో రాజేశ్‌ మెషిన్‌లో చిక్కుకుని, 2 నిమిషాల వ్యవధిలో మృతి చెందాడు.

Friday, 26 January 2018

EARN MONEY CLICK HERE


దాని వినియోగం అణుబాంబు కంటే ప్రమాదకరం

ప్లాస్టిక్‌ వినియోగం ప్రమాదకరం






జూబ్లీహిల్స్‌: విచ్చలవిడి ప్లాస్టిక్‌ వినియోగం అణుబాంబు కంటే ప్రమాదకరమని ప్రముఖ నటి, మాజీ మిస్‌ ఇండియా జూహీచావ్లా అన్నారు.  ఫిక్కీ యంగ్‌లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (వైఎఫ్‌ఎల్‌వో ) ఆద్వర్యంలో శుక్రవారం బంజారాహిల్స్‌ పార్క్‌ హయత్‌ హోటల్‌లో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్లాస్టిక్‌ బాటిల్‌లో నీరు తాగడం కేన్సర్‌కు దారితీస్తుందని గుర్తు చేసారు. వైఎఫ్‌ఎల్‌వో చైర్‌పర్సన్‌ సంద్యారాజు, మోడల్‌ శిల్పారెడ్డి సహ పలువురు సభ్యులు పాల్గొన్నారు. 

శ్రీనివాస్‌ హత్యకేసులో నిందితుల లొంగుబాటు

నల్గొండ : బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో పరారీలో ఉన్న ముగ్గురు నిందితులు రాంబాబు, మల్లేష్, శరత్‌లు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను వెనక అధికార పార్టీ నాయకులు ఉన్నారని ఆరోపణలు రావడంతో పోలీసులు జాగ్రత్తగా విచారిస్తున్నారు. సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు, నల్లగొండ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొడ్డుపల్లి లక్ష్మీ భర్త శ్రీనివాస్‌ (42) బుధవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురైన సంగతి తెల్సిందే. నల్లగొండలోని గాంధీనగర్‌ హనుమాన్‌ టెంపుల్‌ దగ్గర మిర్చి బండి విషయంలో స్థానిక వార్డు కౌన్సిలర్‌ మెరుగు కౌసల్య తనయుడు మెరుగు గోపికి.. చింతకుంట్ల రాంబాబు అనుచరుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
 తనపై రాంబాబు దాడి చేశాడని గోపి ఏడుస్తూ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ భర్త శ్రీనివాస్‌కు ఫోన్‌ చేశాడు. తాను వస్తున్నానని, ఎన్జీకాలేజీ వద్ద ఉండాలని చెప్పి అర్ధరాత్రి 11.45 గంటల సమయంలో శ్రీనివాస్‌ ఇంటి నుంచి బయలుదేరారు. మార్గమధ్యలో రాంబాబు, అతని అనుచరులు మల్లేశ్, శరత్‌లు తారస పడ్డారు. దీంతో రాంబాబు, శ్రీనివాస్‌ల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. పెనుగులాటలో శ్రీనివాస్‌ డ్రైనేజీలో పడిపోయారు. డ్రైనేజీ పక్కనే ఉన్న బండరాళ్లతో తలపై బలంగా మోదగా.. శ్రీనివాస్‌ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. నిందితులు రాంబాబు, మల్లేశ్, శరత్‌లు పరారీలో ఉండగా.. ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న చక్రి, దుర్గయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

x