Tuesday, 20 February 2018

చాహల్‌.. కళ్లజోడు ఎందుకు పెట్టుకుంటున్నాడు?

చాహల్‌.. కళ్లజోడు ఎందుకు పెట్టుకుంటున్నాడు? 

 భారత మణికట్టు మాంత్రికుడు చాహల్‌ ఈ మధ్య మైదానంలో కళ్ల జోడు పెట్టుకుని దర్శనమిస్తున్నాడు. అయితే బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేస్తున్న సమయంలో పెట్టుకోని చాహల్‌ ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో మాత్రమే కళ్ల జోడు ధరిస్తున్నాడు. ఇందుకు కారణం ఏమిటి? చాహల్‌కు ఏమైఉంటుంది? అన్న అనుమానాలు సగటు అభిమాని మదిలో మెదులుతున్నాయి. స్టైల్‌గా కనిపించేందుకు కళ్ల జోడు పెట్టుకుంటున్నాడంటూ పలువురు నెట్టింట్లో కామెంట్లు పెట్టారు.

ఐతే.. దీనిపై చాహల్‌ తండ్రి వివరణ ఇచ్చారు.  చాహల్‌ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే ముందు కంటికి సంబంధించిన వైద్యులను సంప్రదించాడు. వారు అప్పుడప్పుడు కళ్లజోడు ధరించాలని సూచించారు. వైద్యుల సూచన మేరకు చాహల్‌ కళ్లజోడు ధరిస్తున్నాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసే సమయంలో కాకుండా ఫీల్డింగ్‌ చేస్తున్నప్పుడు పెట్టుకుంటున్నాడు. త్వరలో చాహల్‌ ఆదాయపు పన్ను శాఖ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇందులో భాగంగానే కంటి పరీక్షలు చేయించుకున్నాడు’ అని చాహల్‌ తండ్రి తెలిపారు. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి వచ్చిన అనంతరం చాహల్‌ దిల్లీలో ఐటీ  ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడని ఆయన చెప్పారు.
సఫారీ గడ్డపై భారత పర్యటన ఈ నెల 24తో ముగియనుంది. ఇరు జట్ల మధ్య బుధవారం రెండో టీ20 జరగనుంది.

Monday, 19 February 2018

మూడో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్‌

మూడో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్‌

 మాజీ క్రికెటర్‌, పాకిస్థాన్‌ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీ చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ మూడో వివాహం చేసుకున్నారు. మత బోధనలు చేసే బుష్రా మనేకాను ఆయన పెళ్లి చేసుకున్నట్లు ధ్రువీకరించారు. గత కొంతకాలంగా ఇమ్రాన్‌ఖాన్‌, బుష్రా మనేకాల పెళ్లి విషయంపై వార్తలు వస్తున్నాయి. లాహోర్‌లోని మనేకా సోదరుడి నివాసంలో కొద్ది మంది కుటుంబసభ్యుల మధ్య ఆదివారం వారి వివాహం జరిగినట్లు పీటీఐ అధికార ప్రతినిధి ఫవాద్‌ చౌదరి తెలిపారు. త్వరలో అతిథులతో సింపుల్‌గా వలీమా డిన్నర్‌ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పీటీఐ సెంట్రల్‌  ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు ముఫ్తీ ముహమ్మద్‌ సయీద్‌ వారి నిఖా జరిపించారు. పీటీఐ పార్టీకి చెందిన మీడియా విభాగం వారి పెళ్లి ఫొటోను విడుదల చేసింది.
గతంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ఇద్దరు భార్యలతో విడాకులు తీసుకున్నారు. 1995లో బ్రిటిష్‌కు చెందిన బిలియనీర్‌ కుమార్తె జెమీమా గోల్డ్‌స్మిత్‌ను వివాహం చేసుకున్నారు. తొమ్మిదేళ్లు వీళ్లు కలిసి ఉన్నారు. జెమీమాకు ఇద్దరు కుమారులు. తర్వాత 2015లో టీవీ యాంకర్‌ రెహామ్‌ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. వీరు కేవలం పది నెలలు మాత్రమే కలిసి ఉన్నారు. తర్వాత ఆమెతో కూడా విడాకులు తీసుకున్నారు. ఇమ్రాన్‌ఖాన్‌, బుష్రా మనేకాను జనవరి ఒకటో తేదీన వివాహం చేసుకున్నారని ఇటీవల పుకార్లు వచ్చాయి. ఖాన్‌ వీటిని ఖండించారు. కానీ గత కొన్ని రోజులుగా ఈ విషయమై వార్తలు  వస్తూనే ఉన్నాయి. దీంతో ఈ పుకార్ల ప్రభావం పార్టీపై పడుతోందని పలువురు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. తమ వివాహాన్ని అధికారికంగా తెలియజేయాలని ఇమ్రాన్‌కు పార్టీ పెద్దల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో ఆయన మనేకాను వివాహం చేసుకుని అధికారికంగా ప్రకటించినట్లు తెలుస్తోంది.
 మనేకా వయసు 40కి పైగా ఉంటుంది. ఆమెకు మొదటి భర్తతో అయిదుగురు పిల్లలు ఉన్నారు. ఆమె మతబోధకురాలు. ఖాన్‌ గత ఏడాది కాలంగా ఆధ్యాత్మిక సూచనలు, సలహాలు కోసం ఆమె వద్దకు వెళ్తున్నారు. ఖాన్‌ విషయంలో రాజకీయపరంగా ఆమె అంచనాలు చాలా వరకు నిజమయ్యాయట. గత నెలలోనే మనేకా తన భర్తకు విడాకులు ఇచ్చింది. తర్వాత తాను బుష్రాను పెళ్లి చేసుకుంటానని అడిగానని గత నెలలోనే ఇమ్రాన్‌ వెల్లడించిన సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలోనే పుకార్లు షికార్లు చేశాయి. ఎట్టకేలకు వారి వివాహం జరిగింది.

Sunday, 18 February 2018

ఏపీ పోస్టల్‌ సర్కిల్‌ పోస్ట్‌మెన్‌, మెయిల్‌ గార్డ్‌ పోస్టుల నోటిఫికేషన్‌ ఒత్తిడి తక్కువ.. వేతనం ఎక్కువ!

ఏపీ పోస్టల్‌ సర్కిల్‌ పోస్ట్‌మెన్‌, మెయిల్‌ గార్డ్‌  పోస్టుల నోటిఫికేషన్‌ ఒత్తిడి తక్కువ.. వేతనం ఎక్కువ!

మంచి వేతనం.. పని ఒత్తిడి తక్కువ ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. అదీ పదోతరగతి విద్యార్హతతో.. అలాంటి అవకాశాన్ని మన ఏపీ పోస్టల్‌ సర్కిల్‌ పోస్ట్‌మెన్‌, మెయిల్‌ గార్డ్‌  పోస్టుల నోటిఫికేషన్‌ ద్వారా కల్పిస్తోంది.
ఏపీ పోస్టల్‌ సర్కిల్లో 245 పోస్టులు
- పోస్టుమెన్‌ 234  - మెయిల్‌ గార్డు 11
పదోతరగతి విద్యార్హతతోనే జీవితంలో స్థిరపడే అవకాశం కల్పిస్తోంది తపాలా శాఖ. పోస్టు మెన్‌, మెయిల్‌ గార్డు అంటే ఇవేవో చిన్న ఉద్యోగాలే అనుకోవడం పొరపాటే. ఎందుకంటే కొత్తగా అమల్లోకి వచ్చిన వేతన నిబంధనల ప్రకారం ఈ రెండు ఉద్యోగాలకూ 21700 మూలవేతనం దక్కుతుంది. దీనికి అదనంగా కరవుభత్యం, ఇంటిఅద్దె భత్యం... మొదలైనవన్నీ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి. కాబట్టి ఎలాంటి చిన్న గ్రామంలో పోస్టింగ్‌ వచ్చినప్పటికీ పాతికవేల రూపాయల నెల జీతం గ్యారెంటీ. అంతేకాకుండా ఒత్తిడి, పనివేళలు తక్కువగా ఉంటాయి. కొద్దిపాటి అనుభవంతో శాఖాపరమైన పరీక్షల ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయికీ చేరుకోవచ్చు. ఖాళీలను రాతపరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా భర్తీచేస్తారు. ప్రశ్నలు సైతం పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. కాబట్టి రైల్వే ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు వీటినీ ప్రయత్నించవచ్చు.
పరీక్ష ఇలా...
వంద మార్కులకు ఆప్టిట్యూడ్‌ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులోని ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు. పరీక్ష వ్యవధి 2 గంటలు.  ప్రశ్నపత్రంలో నాలుగు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి. అవి...
పార్ట్‌ - ఎ: జనరల్‌ నాలెడ్జ్‌, పార్ట్‌ - బి: మ్యాథమేటిక్స్‌
పార్ట్‌ - సి:  ఇందులో రెండు విభాగాలు ఉన్నాయి. విభాగం 1లో ఇంగ్లిష్‌, 2లో తెలుగు సబ్జెక్టు నుంచి ప్రశ్నలు వస్తాయి.
అర్హత సాధించాలంటే...
పార్ట్‌ ఎ, బిలు కలిపి ఓసీలైతే 10, ఓబీసీలు 9, ఎస్సీ, ఎస్టీలు 8 మార్కులు సాధించాలి. అలాగే పార్ట్‌ సిలో రెండు విభాగాలూ కలిపి ఓసీలైతే 10, ఓబీసీలు 9, ఎస్సీ, ఎస్టీలు 8 మార్కులు సాధించాలి. ఇలా విభాగాల వారీ మార్కులు సాధించడంతోపాటు మొత్తం ప్రశ్నపత్రం నుంచి ఓసీలు 40, ఓబీసీలు 37, ఎస్సీ, ఎస్టీలు 33 మార్కులు సాధిస్తేనే అర్హులుగా పరిగణిస్తారు. అనంతరం అర్హుల జాబితా నుంచి మెరిట్‌, రిజర్వేషన్ల ప్రాతిపదికన నియామకాలు చేపడతారు. ఎంపికైనవాళ్లు రెండేళ్లు ప్రొబేషన్‌లో కొనసాగుతారు. ఆ తర్వాత శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తారు. ఉద్యోగంలోకి చేరిన మొదటి నెల నుంచే రూ.21,700 మూలవేతనం చెల్లిస్తారు. ఇతర అన్ని అలవెన్సులూ కలుపుకుని ప్రారంభం నుంచే రూ.25 వేలకు తగ్గకుండా వేతనంగా పొందవచ్చు.
ఖాళీల వివరాలు: పోస్టుమ్యాన్‌ ఖాళీలు విజయవాడ రీజియన్లో 106, కర్నూలులో 60, విశాఖపట్నంలో 68 ఉన్నాయి. మెయిల్‌ గార్డు పోస్టులు విజయవాడ రీజియన్‌లో 6, కర్నూలులో 2, విశాఖపట్నంలో 3 ఉన్నాయి.
అర్హత:  పోస్టుమ్యాన్‌, మెయిల్‌ గార్డు రెండు పోస్టులకూ పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులు.
వయసు 18 - 27 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి.
నియామకం: పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా మెరిట్‌, రిజర్వేషన్ల ప్రాతిపదికన నియామకాలు చేపడతారు.
పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు .
పరీక్ష కేంద్రాలు:  విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు.
ఫీజు: అప్లికేషన్‌ ఫీజు రూ.వంద అందరు అభ్యర్థులూ చెల్లించాలి. పరీక్ష ఫీజు రూ.400. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఆన్‌లైన్‌లో ప్రాథమిక వివరాల నమోదుకు చివరితేదీ:  మార్చి 15 హెడ్‌ పోస్టాఫీసుల్లో ఫీజు చెల్లించడానికి చివరితేదీ: మార్చి 16
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 20
వెబ్‌సైట్‌: www.appost.in, www.indiapost.in

చిత్తూరులో యెమెన్‌ విద్యార్థి ఆత్మహత్య



చిత్తూరులో యెమెన్‌ విద్యార్థి ఆత్మహత్య 


చిత్తూరు నగర శివారులోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాలలో బి.టెక్‌ తృతీయ సంవత్సరం చదువుతున్న ఖలెద్‌ మహమద్‌ ఒత్‌మాన్‌ నయీఫ్‌ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యెమెన్‌ దేశానికి చెందిన ఇతడు 2014లో ఆ దేశ ప్రభుత్వం తరఫున ఉపకార వేతనంపెకిక్కడికి వచ్చాడు. అదే దేశానికి చెందిన హషీమ్‌ అల్‌-షబి అనే విద్యార్థితో కలసి స్థానికంగా గది అద్దెకు తీసుకుని చదువుకుంటున్నాడు. కొద్ది నెలల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని కేరళకు తీసుకెళ్లి అక్కడ వైద్య సేవలను అందించాడు. అతడి గదిలో ఉంటున్న మిత్రుడు సైతం కొన్ని నెలల నుంచి ఆరోగ్య సమస్యలపై కేరళలో వైద్య సేవలను పొందుతున్నాడు. ఇటీవలే మిత్రుడు కేరళకు వెళ్లగా.. తన తల్లికి సైతం అక్కడి నుంచి మందులు తీసుకురావాలని కోరాడు. శనివారం కేరళకు వెళ్లిన మిత్రుడు.. నయీఫ్‌కు ఫోన్‌ చేశాడు. ఎంతసేపటికీ అతడు స్పందించకపోవడంతో మరో మిత్రుడికి ఫోన్‌చేసి గదిని పరిశీలించాలని కోరాడు. మిత్రులు వెళ్లి గదిని పరిశీలించగా.. అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులకు ఏదైనా సమస్యలు.. లేక ఆర్థిక సమస్యలేదైనా ఉండొచ్చని తోటి విద్యార్థులు పోలీసులకు తెలిపారు.

ఇక మీదట సౌదీ భర్తల పనిలేదు..!

ఇక మీదట సౌదీలో  భర్తల అనుమతితో పనిలేదు..!

రియాద్‌: దశాబ్దాల కాలంగా మహిళలకు వ్యతిరేకంగా ఉన్న నిబంధనలను ఎత్తివేస్తూ సౌదీ అరేబియా నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ఇప్పటికే మహిళలు డ్రైవింగ్‌ చేసేందుకు అనుమతినిచ్చింది.. పురుషులతో పాటు స్టేడియంకు వెళ్లి సాకర్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు అనుమతి ఇచ్చింది. తాజాగా మహిళలు సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు అంగీకరించింది. ఈ మేరకు సౌదీ ప్రభుత్వం అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు అక్కడ మహిళలు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే అందుకు భర్త లేదా తండ్రి లేదా సోదరుడు అనుమతిని తీసుకురావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా నిబంధనలు ఎత్తివేసింది.
మహిళలు ఇకమీదట పురుషుల అనుమతి లేకుండా సొంతంగా వ్యాపారం చేసుకోవచ్చని ఆ దేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రైవేటు రంగంలో మహిళలు రాణించడాన్ని ప్రోత్సహించేందుకు ఈ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు.. సౌదీఅరేబియా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌ విభాగం  తొలిసారిగా మహిళా ఇన్వెస్టిగేటర్స్‌ను నియమించనుంది. విమానాశ్రయాలు, సరిహద్దుల్లో ఖాళీగా ఉన్న 140 పోస్టుల్లో మహిళలను నియమించుకునేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందుకోసం 1,07,000 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు.

Saturday, 17 February 2018

లోకల్‌ శాస్త్రవేత్తలు

ఈ శాస్త్రవేత్తలు పక్కా లోకల్‌!
అనగనగా ఒక కాకి. దానికి దాహం వేసింది. వెదగ్గా వెదగ్గా ఓ కుండలో అడుగున కొద్దిగా నీరు కన్పించింది. కానీ అడుగున ఉన్న ఆ నీరు పైకి వచ్చేదెలా, తాగడమెలా? కాసేపు ఆలోచించిన కాకి దూరంగా ఉన్న గులక రాళ్లను ఒక్కోటిగా తెచ్చి కుండలో వేసింది. కాసేపటికి నీరు పైకి వచ్చింది. కాకి దాహం తీరింది. ఇది పాత కథ. అంత కష్టమెందుకు, సింపుల్‌గా స్ట్రా తెచ్చుకుని తాగెయ్యుచ్చుగా అంటుంది ఈ తరం. పాతదైనా కొత్తదైనా ఈ కథ... ఎందరో పల్లెటూరి శాస్త్రవేత్తలకు ప్రేరణ. అవసరం ఆలోచింపజేస్తుందనీ, ఆలోచన సరికొత్త ఆవిష్కరణకి దారిచూపుతుందనీ నిరూపిస్తున్నారు ఈ చదువులేని శాస్త్రవేత్తలు. 
ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది. పల్లె బిడ్డలు పట్టణానికి వెళ్లినా పల్లె కష్టాలని మరవరు. సమస్య ఉన్న చోటే పక్కాలోకల్‌ పరిష్కారమూ ఉంటుందని నమ్ముతారు. అందుకే చదివింది వానాకాలపు చదువులే అయినా, అందుబాటులో ఉన్న పరికరాలనే అవసరానికి తగ్గట్టు మలచుకుంటూ అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు. కఠినమైన సమస్యలకీ కత్తిలాంటి సమాధానాలు కనిపెడుతున్నారు. ఏళ్ల తరబడి తాము కష్టపడినా తోటివారి అవసరాలు తీరుస్తున్నారు. అవార్డులూ అందుకుంటున్నారు.

అమ్మకోసం... ఆ రిమోట్‌!

బొమ్మగాని మల్లేశం పేదింటి బిడ్డ. పదో తరగతిలోనే పని బాట పట్టాడు. అనారోగ్యంతో మంచం పట్టిన అమ్మకోసం అతడిలో మొదలైన ఆలోచన 15 కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోసింది. 20 అవార్డులూ పలు పేటెంట్లూ పొంది, సొంత కంపెనీ పెట్టుకునే స్థాయికి ఎదిగేలా చేసింది. మల్లేశానికి సొంత పొలం లేదు. అయినా అతడి ఆవిష్కరణలన్నీ వ్యవసాయం చుట్టూనే తిరుగుతాయి. పల్లెటూళ్లో రైతుల్నీ వారి కష్టాల్నీ చూస్తూ పెరిగాననీ దేశానికి అన్నం పెట్టే రైతు కష్టాలు తీర్చాలన్న ఆశే వారికోసం కొత్త వస్తువులు తయారుచేయిస్తోందనీ అంటాడు మల్లేశం. 
తండ్రీకొడుకులు పొద్దున్నే పనులకు వెళ్తే మళ్లీ రాత్రికే ఇంటికి వచ్చేవారు. తాము వచ్చి లైటు వేసేదాకా మంచంమీద తల్లి చీకట్లో ఉండడం అతడిని బాధించింది. అప్పటికే విద్యుత్తు పరికరాల మరమ్మతు దుకాణంలో పనిచేస్తున్నాడు మల్లేశం. తాను నేర్చిన పరిజ్ఞానంతో ప్రయోగాలు చేసి ఫ్యాను, లైట్లకు రిమోట్‌ తయారుచేశాడు. దాన్ని తల్లి చేతికిచ్చి లైట్‌ వేయించినప్పుడు ఆమె మొహంలో కన్పించిన ఆనందం మర్చిపోలేనంటాడు మల్లేశం. అప్పుడతని వయసు పదిహేనేళ్లు. మల్లేశం తయారుచేసిన రిమోట్‌ చూసి చాలామంది అలాంటివి తయారుచేసివ్వమని అడిగారు. అప్పటినుంచి చుట్టుపక్కల వారి అవసరాలను నిశితంగా పరిశీలించడం అలవాటైంది అతనికి. రిమోట్‌లు తయారుచేస్తూ వచ్చే డబ్బుతో ప్రయోగాలను కొనసాగించాడు. డీజిల్‌ లేదా పెట్రోలుతో పనిచేసే స్ప్రేయర్లు వాడుతున్న రైతుల ఖర్చు తగ్గించడానికి సూర్యరశ్మితో పనిచేసే స్ప్రేయర్ని తయారుచేశాడు. కరెంటు లేనప్పుడు ఇన్వర్టరుగానూ పనిచేస్తుందిది. కలుపు తీయడానికీ, విత్తనాలు నాటడానికీ, నీటి మోటార్లను మొబైల్‌తో నియంత్రించడానికీ... ఇలా పలు పరికరాలు తయారుచేశాడు. వస్తువు ప్రయోజనం ఏమిటో దాని పనితీరు ఎలా ఉండాలో తెలిస్తే దానికి రూపకల్పన చేయడం కష్టం కాదంటాడతను. మల్లేశం తయారుచేసిన ఓ పరికరం బిగిస్తే డ్రైవరు తాగి వస్తే ఆ వాహనం స్టార్ట్‌ అవదు. ఇలాంటి కొన్ని వస్తువులకు పేటెంట్లు రావాల్సి ఉంది. అవార్డుల ద్వారా వచ్చిన డబ్బుతోనూ, పల్లెసృజన లాంటి సంస్థల ప్రోత్సాహంతోనూ మల్లేశం తన ఆవిష్కరణల పర్వాన్ని కొనసాగిస్తున్నాడు.

          నాటి రిక్షావాలా... నేటి మార్గదర్శి
పాతికేళ్ల వయసులో దిల్లీలో రిక్షా తొక్కుతున్నప్పుడు లీలామాత్రంగానైనా ఊహించలేదు అతడు తానో రైతునీ, ఆవిష్కర్తనీ అవుతానని. దశాబ్దం తిరిగేసరికల్లా ధరమ్‌వీర్‌ అలా ఎలా అయ్యాడంటే... ఉన్నది రెండెకరాల పొలం. తల్లి మరణంతో చదువు అటకెక్కింది. కొంతకాలం తండ్రికి సాయంగా ఉన్న ధరమ్‌వీర్‌ భార్యాబిడ్డల్ని హరియాణాలోని ఊళ్లోనే వదిలి దిల్లీ బయల్దేరాడు. రిక్షా తొక్కి సంపాదించిన డబ్బుతో పిల్లల్ని చదివించాలనుకున్నాడు. రెండేళ్లు కష్టపడ్డాడు. ఔషధ మొక్కల ఉత్పత్తులకి అక్కడి మార్కెట్లో లభిస్తున్న ప్రాధాన్యం అతడిని ఆశ్చర్యపరిచింది. ఆ మొక్కలు తమ ఊళ్లో విచ్చలవిడిగా పెరగడం అతనికి తెలుసు. ఇంతలో రోడ్డుప్రమాదం. ఏడాది పాటు మనిషి మంచం మీదే. మనసు మాత్రం గతాన్నీ వర్తమానాన్నీ పెనవేస్తూ పెద్ద ఆలోచనలే చేసింది. కోలుకోగానే ఉన్న ఆ కొంచెం పొలంలోనే కలబంద, ఉసిరి, పుట్టగొడుగులు పండించాడు. ఇక ఇప్పుడు వాటితో రకరకాల ఉత్పత్తులు తయారుచేయాలి. కలబంద రసం తీసే మిషన్‌ కొందామని వెళ్తే కమిషన్‌ 5 లక్షలు అడిగారొకరు. దాంతో ఆ యంత్రాన్ని తానే తయారుచేయాలనుకున్నాడు ధరమ్‌వీర్‌. కొన్ని పరిశ్రమలను చూసివచ్చాడు. ఆ అవగాహనకి తన తెలివితేటలు జోడించి రెండేళ్లు కష్టపడి నమూనా యంత్రాన్ని తయారుచేశాడు. దానిమీద ప్రయోగాలు చేస్తూ మరింతగా అభివృద్ధి చేసి మొత్తానికి మల్ట్టీపర్పస్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మెషీన్‌ని తయారుచేసేశాడు. ఉష్ణోగ్రతల్ని వేర్వేరు స్థాయుల్లో నియంత్రించడం ద్వారా ఆ మెషీన్‌తో ఔషధ మొక్కల ఆకుల నుంచి రసం, జెల్‌, పొడి... ఇలా ఏది కావాలంటే అది తయారుచేయొచ్చు. అప్పటివరకూ ఉన్నవాటికన్నా మెరుగైన యంత్రాన్ని తయారుచేసినందుకు అతడికి జాతీయ అవార్డు లభించింది. దానికి పేటెంటు తీసుకుని వ్యాపారవేత్తగా మారినా ధరమ్‌వీర్‌ తన రెండెకరాల పొలంలో పంటలు పండించడం మాత్రం మానలేదు. ప్రయోగాలు చేస్తున్న అతడిని ఒకప్పుడు పిచ్చివాడని వెక్కిరించిన గ్రామస్థులకు ఇప్పుడు అతడే మార్గదర్శి.

చింతచెట్టు ఎంత పని చేసింది!
కర్ణాటకలోని ధార్‌వాడ్‌లో ఓ పల్లె అతనిది. పేరుకి అరవై ఎకరాల మెట్ట. తండ్రి ఇచ్చిన డబ్బుతో ఉత్సాహంగా డజను బోర్లు వేయించాడు ఖాదర్‌. ఒక్క దాంట్లోనే నీళ్లు పడ్డాయి. పెట్టిన ఖర్చంతా వృథా. అప్పుడు ఆలోచన మొదలైంది. తర్వాత ఏడాది పొలంలోనే చిన్న చిన్న కుంటలు తవ్వి వాన నీటిని ఒడిసిపట్టే ప్రయత్నం చేశాడు. మామిడీ, జామా, సపోటా, చింత లాంటి పండ్లమొక్కలు నాటాడు. మరుసటి ఏడాదీ వానల్లేక విపరీతమైన కరువు. చివరికి ఒక్క చింత తప్ప మరే చెట్లూ పెరగలేదు. ఎక్కడెక్కడినుంచో నీరు తెచ్చి కష్టపడి వాటినైనా కాపాడుకోగలిగాడు. ఆ కరవు సమయంలో చింత పండించడమే గొప్పని ఊరంతా అతడిని ప్రశంసించింది. చెట్లనిండా కాసిన చింతకాయలు అతడిలోని ఆవిష్కర్తను తట్టిలేపాయి. చిన్నప్పుడు అలారం మోగినా నిద్ర లేవడంలేదని తండ్రి తిడుతోంటే ఖాదర్‌ ఒక ప్రత్యేక ఏర్పాటు చేసుకున్నాడు. అలారం మోగినపుడు సీసా వంగి నీరు అతని ముఖంపై పడేలా గడియారానికి నీటిసీసాని అనుసంధానించాడు. అది చూసి తండ్రి నవ్వుకున్నాడే కానీ కొడుకుని చదివిస్తే గొప్ప శాస్త్రవేత్త కాగలడేమోనన్న ఆలోచన రాలేదు. ఆ సంఘటన గుర్తొచ్చిన ఖాదర్‌ మళ్లీ బుర్రకి పనిచెప్పాడు. చింతకాయలన్నీ అప్పటికప్పుడు అమ్మేస్తే గిట్టుబాటు కాదు. అందుకని రంగూ, నాణ్యతా దెబ్బతినకుండా వాటిని నిల్వ చేయడానికి ఇంట్లోనే నేలమాళిగ కట్టించాడు. భార్యాబిడ్డల చేత చింతపండు గుజ్జూ పచ్చళ్ల లాంటివి తయారుచేయించాడు. ఈ క్రమంలో పండు నుంచి గింజ తీయడానికి చాలా సమయం పట్టడం గమనించిన ఖాదర్‌ చింతకాయల నుంచి గింజలు వేరుచేసే యంత్రాన్ని తయారుచేశాడు. కాయలు అందులో వేస్తే చింతపండూ గింజలూ విడివిడిగా వచ్చేస్తాయి. 500 మంది చేసే పనిని ఆ మెషీన్‌ ఒక్కరోజులో చేయగలదు. పచ్చళ్లకోసం పచ్చి చింతకాయల్ని ముక్కలుగా కోయడం మరో పెద్ద పని. దానికోసమూ, చెట్టునుంచిచింతకాయలు కోయడానికీ కూడా ప్రత్యేక యంత్రాలను తయారుచేశాడు. వీటివల్ల ఎంతో సమయంతో పాటు కూలీల ఖర్చూ కలిసొచ్చేది. ఖాదర్‌ ఆవిష్కరణల్ని చూసిన తోటి రైతులు తమ అవసరాలనూ అతని దగ్గర చెప్పుకునేవారు. దాంతో ఎన్నిసార్లు దున్నినా పదును తగ్గని నాగలి కర్రునీ, అన్ని రకాల విత్తనాలనూ నాటేందుకు పనికొచ్చే సీడర్‌నీ... ఇలా రకరకాల యంత్రాలను తయారుచేశాడు. వాటన్నిటికీ పేటెంట్లు తీసుకున్నాడు. ఆయా వస్తువులకు ఉన్న గిరాకీని చూసి పెద్దఎత్తున తయారుచేసి అమ్మేందుకు కంపెనీ పెట్టాడు ఖాదర్‌. సమాజానికి పనికివచ్చే యంత్రాలను వరసగా ఆవిష్కరిస్తూ వచ్చిన అబ్దుల్‌ఖాదర్‌ నదకట్టిన్‌ను నేషనల్‌ ఇన్నొవేషన్‌ ఫౌండేషన్‌ తరఫున జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ.
ఆ ఒక్క సంఘటన...

ఆర్థిక పరిస్థితులు అనుకూలించక బడి మానేసి ఇంట్లో ఉంది షాజియా జాన్‌. తల్లి పనిమీద ఎక్కడికో వెళ్లింది. అప్పుడు అతిథులు వచ్చారు. షాజియాకు సమోవర్‌లో టీ తయారుచేయడం రాదు. దాంతో వారికి టీ చేసి ఇవ్వలేకపోయింది. ఇంట్లో పెద్దవాళ్లు లేనప్పుడు తాను బాధ్యతగా వ్యవహరించలేకపోయానన్న ఆలోచన ఆమెలో ఆవిష్కర్తను నిద్ర లేపింది. ఫలితంగా సమోవర్‌ని బొగ్గులతో కాక గ్యాస్‌తో పనిచేసేలా తయారుచేసి నేషనల్‌ ఇన్నొవేషన్‌ ఫౌండేషన్‌ అవార్డుని అందుకుంది షాజియా. 
టీ తయారుచేసుకోవడం మనకు నిమిషాల్లో పని. కానీ కశ్మీరీలకు చాలా పెద్ద పని. సమోవర్‌ అనే ప్రత్యేక పాత్రలో బొగ్గుల మీద కాయాలి. అందుకు ఎప్పుడూ బొగ్గులు సిద్ధంగా ఉండాలి. ఆ పాత్రలోనే టీ చేయడం వారి సంస్కృతిలో విడదీయరాని భాగం. ఎవరింటికన్నా వెళ్లినప్పుడు టీ ఇవ్వలేదంటే అది అతిథులను అవమానపరిచినట్లే. అందుకే అలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటారు సాధ్యమైనంతవరకూ. షాజియా తండ్రికి విద్యుత్తు ఉపకరణాలు మరమ్మతు చేసే దుకాణం ఉంది. ఇంట్లో అమ్మకు సాయం చేయడం, తండ్రి బయటకు వెళ్లినప్పుడు దుకాణంలో కూర్చోడం షాజియా పని. అక్కడ ఖాళీగా కూర్చోక చిన్న చిన్న మరమ్మతు పనులూ చేసేది. అలాంటప్పుడే పై సంఘటన జరిగింది. బొగ్గుల పని లేకుండా సమోవర్‌కి గ్యాస్‌ కనెక్షన్‌ ఇస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన వచ్చింది. ముందు ఇంట్లో ఉన్న సమోవర్‌ భాగాలన్నీ విడదీసి చూసింది. బర్నర్‌ ఎక్కడ పెట్టాలో, గ్యాస్‌ కనెక్షన్‌ ఎలా ఇస్తే బాగుంటుందో ఆలోచించింది. ప్రయత్నాలు ఒక కొలిక్కి రాగానే తండ్రికి వివరించింది. అతనికీ ఆలోచన నచ్చింది. సమోవర్‌కి సరిపోయేలా బర్నర్‌, రెగ్యులేటర్లను గ్యాస్‌స్టౌ మెకానిక్‌తో ప్రత్యేకంగా తయారుచేయించారు. 


గ్యాస్‌ సమోవర్‌ తయారైంది. చక్కగా పనిచేస్తోంది. సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే కశ్మీరీల ప్రత్యేకతైన నమ్‌కీన్‌ చాయ్‌తో సహా అన్ని రకాల చాయ్‌లనూ తయారుచేసుకోవచ్చు. పావుగంటలో పాతిక మందికి సరిపడా టీ సిద్ధం చేయొచ్చు. అదే బొగ్గుల సమోవర్‌ అయితే ముప్పావుగంట పట్టేది. మెకానిక్‌ ద్వారా విషయం బయటకు తెలిసిపోయింది. చలికాలంలో సమోవర్‌కోసం బొగ్గుల్ని బంగారంలా దాచుకునే పని తప్పిందంటూ ఆ అమ్మాయి ఆలోచనను అందరూ మెచ్చుకున్నారు. రెండు పదుల వయసులోనే నేషనల్‌ ఇన్నొవేషన్‌ ఫౌండేషన్‌ అవార్డు గెలుచుకున్న ఆ యువతి ఎప్పటికైనా చదువు కొనసాగించాలనీ, గ్యాస్‌ సమోవర్లు తయారు చేసే పరిశ్రమ పెట్టాలనీ కలలు కంటోంది.

ఏ చెట్టయినా ఎక్కేయొచ్చు!
సాటివారి కష్టం విని స్పందించే గుణం ఓ రోజుకూలీని వ్యాపారవేత్తను చేసింది. కోయంబత్తూరుకు చెందినడి.రంగనాథన్‌(డిఎన్‌.వెంకట్‌) పెద్దగా చదువుకోలేదు. ఓ స్పిన్నింగ్‌ మిల్లులో రోజుకూలీగా పనిచేశాడు. కొన్నేళ్లకు మిల్లు మూతపడడంతో చేసేదేమీ లేక వ్యవసాయపనులు చేసుకుంటూ పల్లెలోనే స్థిరపడ్డాడు. రైతుల పనిముట్లకు రిపేర్లూ చేసిపెట్టేవాడు. అలా వారితో మాట్లాడేటప్పుడు చెట్లెక్కేవారు దొరక్క రైతులు పడుతున్న ఇబ్బందులు అతని దృష్టికి వచ్చాయి. తేలిగ్గా చెట్లెక్కడానికి తోడ్పడే సురక్షితమైన పరికరం ఒకటి స్వయంగా తయారుచేయాలని పని ప్రారంభించాడు. 

కొబ్బరి చెట్లూ తాటిచెట్లూ ఎక్కి కాయలను కోసేటప్పుడు జరిగే ప్రమాదాలు అన్నీ ఇన్నీ కావు. దాంతో క్రమంగా అసలా చెట్లెక్కే వృత్తిలోకే ఎవరూ వెళ్లడంలేదు. ఈ పరిస్థితితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు వరం మల్టీ ట్రీ క్లైంబర్‌. చక్కగా కుర్చీలో కూర్చున్నట్లు సౌకర్యంగా కూర్చుని ఎంత ఎత్తైన చెట్టయినా అలవోకగా ఎక్కేయొచ్చు ఈ పరికరంతో. సాంకేతికంగానూ భద్రతాపరంగానూ ఉన్నత ప్రమాణాలతో తయారైన ఆ పరికరాన్ని తయారుచేసింది మెకానికల్‌ ఇంజినీర్లు కాదు, మెకానిక్‌ వెంకట్‌. అతడి పదేళ్ల కృషి ఫలితం ఆ పరికరం. అది తాటి, కొబ్బరి ఇలా ఏ రకం చెట్టుకైనా, కాండం వెడల్పు ఎంతున్నా అమరుతుంది. చేతులూ కాళ్లతో పైపైకి అమర్చుకుంటూ ఎలాంటి భయం లేకుండా 40 అడుగుల చెట్టుని ఐదు నిమిషాల్లో ఎక్కేయొచ్చు. బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు కూడా దానిని పరిశీలించి సురక్షితమైనదన్న సర్టిఫికెట్‌ ఇచ్చారు. నేషనల్‌ ఇన్నొవేషన్‌ ఫౌండేషన్‌ అవార్డూ లభించింది. వెంకట్‌కి ముందూ తర్వాతా కూడా కొందరు రకరకాల ట్రీ క్లైంబర్లను తయారుచేశారు కానీ అవి ఒక రకం చెట్లకే పనికొస్తాయి. వేర్వేరు చెట్లకి వేర్వేరు పరికరాలు కొనుక్కోవాలి. వెంకట్‌ పరికరం ఏ రకం చెట్టుకైనా పనికొస్తుంది. ‘ఆర్‌ టెక్‌ ఇంజినీరింగ్‌’ పేరుతో ఇప్పుడు వెంకట్‌ ఈ మల్టీ ట్రీ క్లైంబర్ల వ్యాపారం చేస్తున్నాడు. విదేశాలకూ ఎగుమతి చేస్తున్నాడు.

ముగ్గురు ఇంజినీర్లు వంగివున్న ఓ పైపులోకి ఒక వైరుని దూర్చుతున్నారు. ఎంత 
ప్రయత్నించినా అది వంపు దగ్గర ఆగిపోతోంది కానీ ఆ చివరికి వెళ్లడం లేదు. 
ఇదంతా ఒక రైతు చూసి ‘‘సార్‌, నేను ప్రయత్నించనా?’’ అని అడిగాడు. 
‘ఇంత చదువూ తెలివీ ఉన్న మనం మూడు రోజులుగా కష్టపడుతున్నా కానిది చదువూ సంధ్యాలేని ఈ పల్లెటూరి రైతువల్ల అవుతుందా, అమాయకుడు’ అని నవ్వుకుంటూ ‘‘సరే 
ప్రయత్నించు’’ అన్నారు ఆ ఇంజినీర్లు. 
రైతు తన పొలంలోకి వెళ్ళి ఒక ఎలుకను తీసుకునివచ్చి దాని తోకకి వైరును కట్టి పైపులోకి వదిలాడు. ఆ ఎలుక రెండోవైపు నుంచి బయటకు వచ్చింది, దాంతో పాటే వైరూనూ!! 
నోరు తెరిచారా ఇంజినీర్లు. 
అర్థమైందిగా... అదండీ సంగతి..!


పెళ్లింట్లో విషాదం.. 9మంది సజీవ దహనం

పెళ్లింట్లో విషాదం.. 9మంది సజీవ దహనం

 రాజస్థాన్‌లోని బీవర్‌లో ఓ పెళ్లింట్లో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వంట గ్యాస్‌ సిలిండర్‌ పేలి తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వంట చేస్తున్న సమయంలో సిలిండర్‌ దగ్గర నిర్లక్ష్యంగా పనిచేయడంతో పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. దాని పక్కనే మరో గ్యాస్‌తో నిండుగా ఉన్న సిలిండర్‌ ఉండటం వల్ల ప్రమాద తీవ్రత పెరిగింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
పేలుడు ధాటికి ప్రమాదం జరిగిన చోట రెండంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నట్లు అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. ఇంటి ఎదుట ఉంచిన రెండు కార్లు కూడా పేలుడు ధాటికి ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసే పనిలో సహాయక సిబ్బంది నిమగ్నమయ్యారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.