Tuesday, 31 January 2017

ఆ పట్టణంలో అన్నీ ఉన్నాయ్‌.... మనుషులు తప్ప!

అదో పట్టణం. దానికి దెయ్యాల పట్టణమని పేరు. అలా అని అదేం పాడుబడ్డది కాదు. అక్కడ భారీ అపార్ట్‌మెంట్లు, షాపింగ్‌ మాళ్లు, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, బ్యాంకులు, పార్కులు... ఇలా అన్నీ ఉన్నాయి. కానీ విచిత్రమేంటంటే అక్కడ ఒక్క మనిషీ కనిపించడు. అయినా ఇప్పటికీ అక్కడి ఇళ్లలో రాత్రిళ్లు దీపాలు వెలుగుతూనే ఉంటాయి. ఆ వింత వూరు చూడాలంటే కెనడాకు వెళ్లాల్సిందే. 
కిట్‌సౌల్ట్‌ అనే ఆ పట్టణం వెనక నిజంగా జరిగిన ఓ కథ ఉంది. కొన్నేళ్ల ముందు అక్కడ అసలు ఆ వూరే ఉండేది కాదు. అదంతా కొండ ప్రాంతం. అయితే 1979లో ఆ పరిసర ప్రాంతాల్లో మోలిబ్డెనమ్‌ ఖనిజ నిక్షేపాలు పెద్ద ఎత్తున బయటపడ్డాయి. ఆ గనుల్లో తవ్వకాల కోసం వేరే ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో కార్మికులను అక్కడికి తీసుకొచ్చారు. 


కార్మికుల నివాసం కోసం అక్కడ మూడు వందల ఇళ్లతో అపార్ట్‌మెంట్లు నిర్మించారు. క్రమంగా రెస్టారెంట్లు, బ్యాంకులు, ఆసుపత్రి, పోస్టాఫీసు, గ్రంథాలయం, స్విమ్మింగ్‌ పూల్‌ లాంటి ఇతర సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. టెలిఫోన్‌, డిష్‌ టీవీ కేబుళ్లు కూడా ఏర్పాటు చేశారు. దీంతో అన్ని హంగులున్న కిట్‌సౌల్ట్‌ అనే పట్టణం తయారైంది. 
* అయితే మూడేళ్ల తర్వాత హఠాత్తుగా ఆ పట్టణం ఖాళీ అయింది. మోలిబ్డెనమ్‌ ఖనిజానికి డిమాండ్‌ తగ్గి అక్కడి గనులు మూతపడటంతో కార్మికులందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పట్నుంచి అది ప్రజలు లేని పట్టణంగా మిగిలి దెయ్యాల పట్టణంగా పేరొచ్చింది. 
* నలభై ఏళ్లకి పైగా అక్కడ ఒక్కరూ లేకపోయినా ఆ పట్టణం పాడుబడిపోలేదు. అక్కడి వీధులు శుభ్రంగా ఉంటాయి. పార్కులన్నీ మంచి నిర్వహణతో అందంగా ఉంటాయి. కొళాయి తిప్పితే స్వచ్ఛమైన నీరు వస్తుంది. చీకటి పడిందంటే వీధి దీపాలు, ఇళ్లలోని దీపాలు వెలుగుతుంటాయి. ఇదంతా ఎలా సాధ్యమని ఆశ్చర్యంగా ఉంది కదూ. దీని వెనుక కృష్ణన్‌ సుదందిరన్‌ అనే ఓ భారతీయుడు ఉన్నాడు. 

అమెరికాలో పారిశ్రామికవేత్త అయిన కృష్ణన్‌కు ఈ పట్టణం నచ్చి 2005లో 7 మిలియన్‌ డాలర్లకు కొన్నాడు. అంతకు ముందు 33 ఏళ్ల పాటు నిర్వహణ లేక పాడుబడ్డ ఆ పట్టణాన్ని 25 మిలియన్‌ డాలర్లు వ్యయం చేసి నవీకరించాడు. ఆ పట్టణాన్ని సంరక్షించడానికి 12 మంది ఉద్యోగులను నియమించాడు. వారు నిత్యం పట్టణంలో తిరుగుతూ కంటికి రెప్పలా పర్యవేక్షిస్తుంటారు.
* ఆ పట్టణాన్ని లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ ఉత్పత్తి కేంద్రంగా మార్చాలన్నది కృష్ణన్‌ ఆలోచన. అది సాకారమైతే మళ్లీ ఆ పట్టణం జన సంచారంతో కళకళలాడుతుంది.

LOCATED: Kitsault Ghost Town, Canada

No comments:

Post a Comment