కనీసం పది కూడా చదవలేదు.. కానీ కోట్లు ఆర్జిస్తున్నారు.
‘ప్రపంచం ఏమైనా కానీ... నా కడుపులో మాత్రం ఓ కప్పు టీ పడాల్సిందే’ అన్నాడో ప్రముఖుడు. ఆయనే కాదు... ఈ జగత్తులో ఎందరికో టీతోనే తెల్లారుతుంది. ఎల్లలు లేని ఈ అభిరుచే పుణేలోని ఓ కుటుంబానికి లక్షలు కురిపిస్తోంది. కేవలం టీ అమ్మి ఆ కుటుంబం నెలకు అక్షరాలా పన్నెండు లక్షల రూపాయలు ఆర్జిస్తోంది. ఇంతకీ ఆ టీ సీక్రెటేంటనేగా..! చూద్దాం రండి...
పుణేలోని అప్పా బల్వంత్ చౌక్. ఎప్పుడు చూసినా కిటకిటలాడుతుంటుంది. అలాగని అక్కడేదో మార్కెట్టో... షాపింగ్ మాలో లేదు. ఉన్నదల్లా టీ హౌస్... ‘యేవలే అమృతతుల్య’! ఒక్కసారి అక్కడ ఓ సిప్పు కొడితే... ఇక రోజూ దాని ముందు క్యూ కడతారు! అంతలా ఉంటుంది టేస్ట్. గ్యాలన్ల కొద్దీ టీ గంటల్లో ఆవిరవుతుంది. మరే ప్రాంతంలో దొరకని ఈ రుచికి పుణేవాసులు మైమరిచిపోతున్నారు. షాప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నీలేష్ యేవలే మాటల్లో చెప్పాలంటే... ‘మాకు నగరంలో మొత్తం మూడు షాపులున్నాయి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9.30 వరకు ఈ టీ హౌస్‌లు తెరిచి ఉంటాయి. అన్నింటిలో కలిపి రోజుకు కనీసం ఐదు వేల కప్పుల టీ అమ్ముతాం. కప్పు రూ.10. నెలకు 1,000 కిలోల పంచదార, 400 కిలోల టీ పొడి ఖర్చవుతుంది’. ఈ లెక్కలను బట్టి అర్థం చేసుకోవచ్చు యేవలే కుటుంబం చేసే టీ టేస్ట్ కెపాసిటీ ఏంటో!
తండ్రి బాటలోనే తనయులు...
పురందర్ గ్రామానికి చెందిన నీలేశ్ తండ్రి దశరథ్ యేవలే తొలుత పాలు సరఫరా చేసేవారు. 1983లో పుణేలో ఆయన ఓ దుకాణం అద్దెకు తీసుకుని టీ స్టాల్ పెట్టారు. తనకంటూ ఓ ప్రత్యేకమైన బ్రాండ్ మార్కెట్‌లో ఉండాలని ఆయన కలలు కనేవారు. కానీ ఆ కల నెరవేరకుండానే ఆయన చనిపోయారు. దశరథ్‌కు ఐదుగురు కుమారులు. ఆయన మరణం తరువాత తనయులు తండ్రి కల నిజం చేయాలని పూనుకున్నారు. అయితే కుప్పలుతెప్పలుగా ఉన్న టీ స్టాల్స్‌తో పాటు తమదీ ఒక స్టాల్ పెడితే పెద్దగా ఫలితం ఉండదని భావించారు. నాలుగేళ్ల పాటు రకరకాల టీలు ప్రయత్నించి చివరకు అప్పా బల్వంత్ చౌక్‌లో తొలి టీ స్టాల్ ‘యేవలే అమృతతుల్య’ ప్రారంభించారు. మంచి స్పందన వచ్చింది. డిమాండ్ పెరిగింది. దీంతో గత ఏడాది నగరంలో మరో బ్రాంచ్ ఏర్పాటు చేశారు. రెండు మూడు నెలల్లోనే ఆదరణ విపరీతంగా వచ్చింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. మరో బ్రాంచీ పెట్టారు. ఇప్పుడు ‘యేవలే అమృతతుల్య’ టర్నోవర్ నెలకు రూ.12 లక్షలు!
టేస్ట్ సీక్రెట్...
‘యేవలే’ టీ కోసం జనం ఇంతగా ఎగబడటానికి కారణం... వారి ఫార్ములానే! పుణేలోని మూడు బ్రాంచీల్లో ఎక్కడ ఏ కప్పు తాగినా ఒకటే రుచి ఉంటుంది. ‘చాలా చోట్ల మరుగుతున్న నీటిలో ప్యాకెట్ పాలను నేరుగా పోస్తారు. ఇది ఎసిడిటీకి దారి తీస్తుంది. కానీ మా తయారీ విధానం పూర్తి ఆరోగ్యకరంగా ఉంటుంది. పాలను రెండుసార్లు కాస్తాం. చల్లార్చిన తరువాతే టీ కలుపుతాం. అందువల్ల మా టీ తాగితే ఎసిడిటీ సమస్య రాదు. మా గ్రామం నుంచి స్వచ్ఛమైన, తాజా పాలు తీసుకొస్తాము. సల్ఫర్ లేని పంచదార, ఫిల్టర్ వాటర్ వాడతాం. సాధారణ పంచదారలో కెమికల్స్ ఉంటాయి. దానివల్ల టీ నల్లబడుతుంది’ అంటారు నీలేశ్. తమ దుకాణాల్లో ఆయన టైమర్లు అమర్చారు. ఏడు నిమిషాలవ్వగానే గ్యాస్ ఓవెన్ ఆగిపోతుంది. ఎక్కువ మరిగితే అసలైన రుచి పోతుందని ఇలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఒకటే ‘టీ’...
యేవలేలో అమ్మేది ఒకటే రకం ‘మిల్క్ టీ’. బ్లాక్ టీ, కడక్ చాయ్ అంటూ వేరే రకాలేమీ ఉండవక్కడ! కనీసం బిస్కెట్లు కూడా అమ్మరు. భవిష్యత్తులో మహారాష్ట్ర వ్యాప్తంగా 100 అవుట్‌లెట్స్ ప్రారంభించాలనేది వారి లక్ష్యం. ఇప్పటికే దేశ విదేశాల నుంచి ఫ్రాంచైజీల కోసం రెండొందలకు పైగా ప్రతిపాదనలు వచ్చాయంటే ఈ టీ పాపులారిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. విశేషం ఏంటంటే యేవలే అన్నదమ్ముల్లో ఎవరూ ఏ మేనేజ్‌మెంట్ కోర్సూ చేయలేదు. కనీసం పదో తరగతికి మించి చదవలేదు. కానీ... సంప్రదాయ చాయ్‌ని విభిన్నంగా నోటికందిస్తూ లక్షలు గడిస్తున్న వీరు ఎందరో వ్యాపారవేత్తలకు స్ఫూర్తి ప్రదాతలు.

No comments:
Post a Comment